పీవీకి భారతరత్న!

పీవీకి భారతరత్న! - Sakshi


కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం సిఫారసు

 

హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. అలాగే తెలంగాణ రాష్ర్ట సాధన కోసం అహర్నిశలు శ్రమించి.. రాష్ర్ట ప్రజానీకానికి మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్‌కు పద్మ విభూషణ్, దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదే శ్‌లో దూరవిద్యలో సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని సమర్థంగా నిర్వహించిన ప్రొఫెసర్ జి. రామిరెడ్డికి పద్మ భూషణ్ ఇవ్వాలని సిఫారసు చేసింది. తెలంగాణ ప్రాంతానికి విశేష సేవలందించిన ప్రముఖులకు, గతంలో ఏమాత్రం ప్రాముఖ్యత లభించని వారికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పలువురి పేర్లను కేంద్రానికి సిఫారసు చేసినట్లు సమాచారం. ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేసిన పీవీ నరసింహారావు పేరును భారతరత్న కోసం సిఫారసు చేస్తామని ఇటీవలే జరిగిన ఆయన జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ‘పద్మ’ అవార్డుల కోసం సీఎస్ ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీ ఓ జాబితాను రూపొందించి గత నెల 28న సీఎం ఆమోదం కోసం పంపింది. ఇందుకు సోమవారమే తుది గడువు కావడంతో ఈ జాబితాలోని అత్యధికుల పేర్లకు కేసీఆర్ చివరి నిమిషంలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో సంబంధిత ఫైలును అధికారులు వెంటనే కేంద్రానికి పంపించారు. భారతరత్నతోపాటు మొత్తం 26 మంది పేర్లను రాష్ర్ట ప్రభుత్వం తరఫున సిఫారసు చేసినట్లు సమాచారం. పద్మ పురస్కారాల్లో ఇప్పటివరకు తెలంగాణ నుంచి ఎక్కువ ప్రాతినిధ్యం లభించలేదని, వివిధ రంగాల్లో నిష్ణాతులను పట్టించుకోలేదన్న ఉద్దేశంలో ఉన్న ప్రభుత్వం.. గతంలో సిఫారసు చేసినా అవార్డులకు ఎంపిక కాని వారిని ఈసారి పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చినట్లు ఓ ఉన్నతాధికారి వివరించారు.



ఇందులో కవులు, కళాకారులకు ఎక్కువ మందికి అవకాశం కల్పించారు. పద్మశ్రీ అవార్డుల కోసం సిఫారసు చేసిన పేర్లలో ఏలె లక్ష్మణ్(చిత్రకారుడు), బి.నర్సింగరావు(దర్శకుడు), కాపు రాజయ్య(చిత్రకారుడు), ప్రొఫెసర్ ఎన్.గోపి(విద్యావేత్త), ఎం.ఎస్. గౌడ్(దంతవైద్యులు), సామలవేణు(మెజీషియన్), సామాజిక సేవకుడు(మహ్మద్ ఒమర్), జయప్రదరామ్(వేణుగానం), ప్రొఫెసర్ ప్రదీప్‌కుమార్, కళాకారుడు గూడ అంజయ్య, కవి గోరటి వెంకన్న, రచయిత అంద్శై, విద్యావేత్త మహమ్మద్ అలీఖాన్ తదితరులు ఉన్నట్లు తెలిసింది. జాబితాలోని వారందరి నేపథ్యం, జాతికి వారు అందించిన సేవలను కూడా ప్రత్యేకంగా వివరిస్తూ కేంద్రానికి సిఫారసు చేసినట్లు సమాచారం.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top