ప్రపంచం చూపంతా భారత్ వైపే


ఘట్‌కేసర్ టౌన్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచమంతా భారతదేశం వైపే చూస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక బస్ టెర్మినల్ ఆవరణలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం హయాంలో జరగని ఆర్థిక అభివృద్ధి నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాతే జరుగుతోందన్నారు.



 నేను  భారతీయుడనని ప్రతి ఒక్కరూ ప్రపంచంలో తలెత్తుకునే స్థాయికి నేడు దేశం చేరుకుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన ఘనత నరేంద్రమోదీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నిధులను నేరుగా కేటాయిస్తోందన్నారు. సభ్యత్వ నమోదులోఅన్ని మతాల ప్రజలకు భాగస్వాములను చేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని, పార్టీ సభ్యత్వ నమోదులో యువతకు పెద్దఎత్తున భాగస్వామ్యం కల్పించాలన్నారు.



మండలంలోని అన్ని గ్రామాల్లో నవంబర్ 30న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బిక్కునాయక్, కరుణాకర్, రైతు సేవా సహకార సంఘం వైస్ చైర్మన్ ఎలిమినేటి శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ సభ్యత్వ నమోదు మండల ప్రముఖ్ గుండ్ల బాల్‌రాజ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రామోజీ, జిల్లా కార్యవర్గ సభ్యుడు కంభం లక్ష్మారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు రజని, సభ్యురాలు సుధారాణి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top