పోల‘వరమా’.. శాపమా?

పోల‘వరమా’.. శాపమా? - Sakshi

- ఈ ప్రాజెక్టుతో తెలంగాణ గ్రామాలకు ముంపు ముప్పు

భయాందోళనల్లో భద్రాచలం డివిజన్‌ వాసులు

- రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్‌

 

బూర్గంపాడు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణా నికి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం డివిజన్‌లోని కుక్కు నూరు, వేలేరుపాడు మండలాలతోపాటు బూర్గంపాడు మండలం సీతారామనగరం, శ్రీధర వేలేరు, గణపవరం, ఇబ్రహీం పేట రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. ఆయా గ్రామాల్లో పోలవరం ప్రాజెక్టు ముంపు నష్టపరిహారం అందించే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే తెలంగాణలో ఉండి, పోలవరం ముంపునకు గురయ్యే భూములకు పరిహారం అందించే విషయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పట్టన ట్టుగా వ్యవహరిస్తున్నాయి. 

 

ముంపు గ్రామాలు...

బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు. సంజీవరెడ్డిపాలెం, నాగినేనిప్రోలు, సారపాక, మోతె , ఇరవెండి గ్రామాల్లోని వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ భూములకు పరిహారం ఎవరిస్తారనే ప్రశ్న స్థానికులను కలవరపెడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ముంపు భూములపై ఇరిగేషన్‌ అధికారులు మండలంలో సర్వేచేశారు. బూర్గంపాడు మండలంలోని పలు గ్రామాల భూములు ముంపునకు గురవుతాయని నిర్ధారించి అక్కడ సర్వే రాళ్లు పాతారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడంతో బూర్గంపాడు మండలం రెండు ముక్కలైంది. 4 రెవెన్యూ గ్రామాలను ఏపీలో విలీనం చేశారు.



అయితే గతంలో వచ్చిన గోదావరి వరదలను పరిశీలిస్తే ఏపీలో విలీనమైన గ్రామాల కంటేæ ప్రస్తుతం భద్రాచలం డివిజన్‌లోనిæ బూర్గంపాడు, సంజీవరెడ్డిపాలెం, నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం, సారపాక, మోతె, ఇరవెండి, భద్రాచలం పరిసర గ్రామాలే ఎక్కువ ముంపునకు గురవుతాయి. కానీ పోలవరం ముంపు ప్యాకేజీలో తెలంగాణలో ఉన్న బూర్గంపాడు మండలాల్లోని ఈ గ్రామాలను పరిగణనలోకి తీసుకోకపో వటంతో భవిష్యత్‌లో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. గోదావరి వరదలను ప్రామాణికంగా తీసుకుని పోలవరం ముంపును గుర్తించాలని కోరుతున్నారు. ప్రసుత్తం ఏపీ ప్రభుత్వ పోలవరం ముంపు గెజిట్‌లో బూర్గంపాడు మండలంలోని 365 హెక్టార్ల భూమి ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.



వాస్తవానికి అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం మండలాల్లో సుమారు 1000 హెక్టార్లు మునిగే ప్రమాదం ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం ఇది తమది కాదన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఈ విషయమై ఇటీవల సీతారామనగరం గ్రామంలో జరిగిన గ్రామసభకు హాజరైన పశ్చిమగోదావరి జిల్లా ఐఏఎస్‌ అధికారి షాన్‌మోహన్‌కు బూర్గంపాడు మండల ప్రజాప్రతినిధులు వివరించగా.. ఇది తెలంగాణ ప్రభుత్వమే చూసుకోవాలని ఆయన అన్నారు.కాగా, ఈ విషయమై రైతుల నుంచి ఎలాంటి వినతులు రాలేదని భద్రాచాలం ఆర్డీఓ శివనారాయణరెడ్డి అన్నారు.  వినతులు వస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామనీ, ప్రాథమికంగా నివేదికలు తయారుచేసి పోలవరం ముంపు భూముల వివరాలను కలెక్టర్‌కు అందిస్తామని వివరించారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top