అంగట్లో ఆదివాసీలు

అంగట్లో  ఆదివాసీలు


భద్రాచలం కేంద్రంగా బ్రోకర్ల దందా

 

ఛత్తీస్‌గఢ్ నుంచి వస్తున్న అమాయకులపై వల

ఉపాధి చూపుతామంటూ పలు ప్రాంతాలకు కూలీలుగా తరలింపు

2 వేల జీతంతో దుర్భర జీవితం అనుభవిస్తున్న గిరిపుత్రులు

బతుకుదెరువు కోసం వచ్చి చాకిరీలో మగ్గిపోతున్న వైనం


 

భద్రాచలం: అది భద్రాచలంలోని అంబేడ్కర్ సెంటర్.. ఓ ప్రైవేటు బస్సు వచ్చి ఆగింది.. పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ నుంచి పొట్ట చేతబట్టుకొని వచ్చిన గిరిజనులు బిలబిలమంటూ దిగారు.. వారిలో పిల్లాజెల్లా, మహిళలు, యువకులు ఉన్నారు.. అంతా లోకం పోకడ తెలియని అమాయకులే.. ఇంతలోనే వారిపై బ్రోకర్లు రాబందుల్లా వాలిపోయారు! ‘మాతో రండి.. మేం పని ఇప్పిస్తాం’ అంటూ వెంట పడ్డారు. వారందరినీ గుత్తగా మాట్లాడుకొని హైదరాబాద్, చెన్నై, విజయవాడ వంటి నగరాలతోపాటు ఇతర ప్రాంతాలకు కూలీలుగా పంపారు. వారిని పనిలో కుదుర్చుకున్న వారు నెలకు రెండు, మూడు వేల జీతమిచ్చి బండెడు చాకిరీ చేయించుకుంటున్నారు. బోరింగ్, సిమెంట్ ఫ్యాక్టరీలు, వివిధ పరిశ్రమల్లో  ప్రమాదకరమైన పనులు చేయిస్తున్నారు. అత్యంత దుర్భర పరిస్థితుల్లో అటు పని మానుకోలేక.. ఇటు ఇంటి దారి పట్టక అమాయక అడవి పుత్రులు నరకం అనుభవిస్తున్నారు. మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలూ చోటుచేసుకుంటున్నాయి. మరికొందరితో ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా చేయిస్తున్నారు. వారిని వివిధ ప్రాంతాలకు చేరవేసిన బ్రోకర్లు మాత్రం తమ కమీషన్ జేబులో వేసుకొని జారుకుంటున్నారు! ఖమ్మం జిల్లా భద్రాచలం కేంద్రంగా అన్నెంపున్నెం ఎరుగని ఆదివాసీలతో ఈ అమానవీయ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది.



తన్నుకుపోయేందుకు పోటాపోటీ

ప్రతి రోజూ ఛత్తీస్‌గఢ్ నుంచి దాదాపు 200 నుంచి 300 మంది గిరిపుత్రులు భద్రాచలం వస్తున్నారు. వీరిని రాగానే తన్నుకుపోయేందుకు బ్రోకర్లు కాచుకొని కూర్చుంటున్నారు. గురువారం ‘సాక్షి’ పరిశీలనలో ఇది తేటతెల్లమైంది.  సుమారు 40 మంది ఆదివాసీలు రాగానే అక్కడే ఉన్న మధ్యవర్తులు వారితో బేరసారాలకు దిగారు. కూలీ రేట్లు మాట్లాడిన వెంటనే వారిని అక్కడ్నుంచి ఆటోల ద్వారా భద్రాచలం, సారపాక ప్రాంతాల్లోని తమ అడ్డాలకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో బ్రోకర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘నేను ముందు మాట్లాడుకున్నానంటే నేనంటూ..’ ఇద్దరు బ్రోకర్లు ఒకరినొకరు తోసుకున్నారు. ఇలాంటి ఘటనలు ఇక్కడ నిత్యకృత్యంగా మారిపోయాయి.

 

కమీషన్ దండుకొని వదిలేయడమే..


 వలస వచ్చే ఆదివాసీలను హైదరాబాద్, చెన్నై, విజయవాడ సహా ఇతర ప్రాంతాలకు పంపుతున్నారు. బోర్లు వేసే పనులు, సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. కూలీలను పంపినందుకు మధ్యవర్తులకు సదరు కాంట్రాక్టర్ కమీషన్ రూపంలో డబ్బులు చెల్లిస్తారు. ఇలా పంపించినందుకుగాను ఒక్కో కూలీకి బ్రోకర్‌కు రూ.3 వేల వరకూ కమీషన్ రూపంలో అందుతోంది. ఈ వ్యవహారం భద్రాచలంలో సిండికేట్‌లా మారింది. భద్రాచలం శివారులో బ్రోకర్‌లంతా ఒక అసోసియేషన్ కూడా ఏర్పాటు చేసుకొని వ్యాపారం సాగిస్తున్నారంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.



 దారుణ పరిస్థితుల మధ్య..

 ఆదివాసీలు పనిచేస్తున్న చోట్ల దారుణమైన పరిస్థితులు ఉంటున్నాయి. అక్కడ చాకిరీ, ఇబ్బందులు తట్టుకోలేక అనేక మంది పారిపోయి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరు బ్రోకర్లు కమీషన్ల కోసం యువకులను స్మగ్లింగ్ వంటి పనులకు కూడా పంపుతున్నారు. ఇలా భద్రాచలం పరిసర ప్రాంతాల నుంచి వెళ్లిన పది మంది వరకు యువకులు గతంలో తిరుపతి సమీపంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించి ఆదివాసీలను కాపాడాలని మానవ హక్కుల సంఘాల నేతలు కోరుతున్నారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top