బీఎడ్ కాలేజీలకు ఉచ్చు


ఖమ్మం:నిన్నమొన్నటి వరకు ఇంజినీరింగ్ కళాశాలలపై దాడులు చేసిన రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఇప్పుడు బీఎడ్ కాలేజీలపై దృష్టి సారించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు కళాశాలలు ఉన్నాయా? లేవా? వసతులు, ఫీజుల వసూళ్లు తదితర వ్యవహారాలపై తనిఖీలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలికి నివేదిక అందించేందుకు సిద్ధమవుతున్నారు. కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నేరుగా విద్యార్థులతో మాట్లాడుతున్నారు. సమస్యలేమైనా ఉంటే ఫోన్ చేయమని సూచిస్తున్నారు. ఇంతకాలం ఇష్టానుసారంగా కళాశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాలకు ఈ చర్య మింగుడు పడటం లేదు. కళాశాలలు నిర్వహించకున్నా, అడ్డగోలు ఫీజులు వసూలు చేసినా, ఫ్యాకల్టీని నియమించకపోయినా, తరగతులు నిర్వహించకపోయినా, హాజరుపేరుతో వేలకు వేలు దండుకున్నా..ఇక కళాశాలల యాజమాన్యాలపై ఫిర్యాదులు వె ళ్లినట్టే.

 

 నిర్లక్ష్యంపై కొరడా

 

 విలువైన మానవ వనరులు తయారయ్యేది పాఠశాలల్లోనే.. దీన్ని దృష్టిలోపెట్టుకొని బీఎడ్, డీఎడ్ కోర్సులు చదివే ఛాత్రోపాధ్యాయులకు తగు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. సిలబస్, సహపాఠ్యాంశాలు, క్షేత్రపర్యటనలు, బోధనోపకరణాలు, రికార్డులు, ఇతర వసతులు ఎన్నో అందుబాటులో ఉండాలి. కానీ పలు కళాశాలలు వీటిని నిర్లక్ష్యం చేస్తున్నాయి. పైగా ఇష్టానుసారంగా ఫీజులు, డెవలప్‌మెంట్ పేరుతో వేలాది రూపాయలు దండుకుంటున్నాయి. దీనిపై రాష్ట్ర ఉన్నత విద్యామండలికి పలువురు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులృబందం ఈనెల 22న జిల్లాలోని ట్రినిటీ, అనిబిసెంట్, సెయింట్‌ఆన్స్, సెయింట్‌లారెన్స్, మహ్మదీయ బీఎడ్ కళాశాలలను తనిఖీ చేసింది. పలు కళాశాలల పరిస్థితి సంతృప్తికరంగా ఉన్నా..కొన్ని అధ్వానంగా ఉన్నట్లు గుర్తించింది. నిబంధనలకు అనుగుణంగా లేని కళాశాలల వివరాలను ఉన్నత విద్యామండలికి అందించనున్నట్లు ఉపాధ్యాయ విద్య రాష్ట్ర అధికారి మేహ ందర్‌రెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం అకడమిక్ ఆడిట్ అధికారి రవీందర్‌రెడ్డి, కేయూ ఎడ్యకేషన్ కోర్సు డీన్ రామునాథ్‌కిషన్ తెలిపారు. ఇప్పటికైనా చక్కబెట్టుకోపోతే కళాశాలలు మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లాకేంద్రంలో మరోమారు, వీటితో పాటు కొత్తగూడెం, పాల్వంచ, మధిర, సత్తుపల్లి తదితర ప్రాంతాల్లోనూ తనిఖీలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది.

 

 తనిఖీ బృందం తడాకా

 

 జిల్లాలో 16 బీఎడ్ కళాశాలలున్నాయి. వీటిలో 1600 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో 75 శాతం సీట్లు కన్వీనర్ కోటా, 25 శాతం మేనేజ్‌మెంట్ కోటా ద్వారా భర్తీ చేస్తారు. భవిష్యత్‌లో బీఎడ్ విద్యావిధానంలో సమూల మార్పులు చేస్తామని, బీఎడ్ కోర్సులను రెండేళ్లు చేసే అవకాశం ఉందని ప్రభుత్వప్రకటన రావడంతో ఈ ఏడాది సీట్లకు అత్యధిక డిమాండ్ ఉంది. డబ్బులు తీసుకొని మేనేజ్‌మెంట్ కోటా సీట్లను భర్తీ చేస్తున్నారు. చివరకు కన్వీనర్ కోటాలో సీటు సాధించిన వారి నుంచీ డెవలప్‌మెంట్ ఫీజు వసూలు చేస్తున్నారు.

 

  రీయింబర్స్‌మెంట్ వస్తుందో.. రాదో అని కొందరు నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. రికార్డులు, యూనిఫాం, ప్రాక్టికల్ మార్కులు, హాజరు నమోదు శాతం ఆధారంగా కూడా డబ్బుల వసూళ్లకు పూనుకుంటున్నట్లు సమాచారం. ప్రాక్టికల్ మార్కులు తమ చేతిలో ఉంటాయనే పేరుతో కన్వీనర్ కోటాలో సీటు సాధించిన వారి నుంచి కూడా రూ.20వేలు దండుకుంటున్నట్లు తెలిసింది. పలు కళాశాలల్లో కనీసం తాగునీరు, ల్యాబ్స్, గ్రంథాలయం, తరగతి గదులు కూడా లేకపోవడం గమనార్హం. కొన్ని కళాశాలలైతే అనుమతి పొందేటప్పుడు ఓ భవనం, ఆ తర్వాత మరో బంగ్లాలో తరగతులు నిర్వహిస్తున్నట్టు తనిఖీ అధికారుల దృష్టికి వచ్చింది. వీటిని చక్కదిద్దే ప్రయత్నం ఈృబందం చేస్తోంది. విద్యార్థుల హాజరుశాతం తప్పనిసరి చేసింది. కళాశాలల్లో బయోమెట్రిక్ అంటెండెన్స్ పద్ధతిని కూడా ప్రవేశపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top