అందమైన మోసం


  •  జోరుగా నకిలీ కాస్మొటిక్స్ దందా  

  •  హన్మకొండ చౌరస్తా అడ్డాగా అమ్మకాలు

  •  ఏటా రూ.2 కోట్ల వ్యాపారం  

  •  నియంత్రణపై అధికారుల నిర్లక్ష్యం

  •  దాడులు చేసినా చర్యలు లేవు..  

  •  ఏడాది గడిచినా రాని నివేదికలు

  •  అధికారుల తీరుపై అనుమానాలు

  • సాక్షి, హన్మకొండ :  జిల్లాలో నకిలీ కాస్మొటిక్స్(సౌందర్య ఉత్పత్తులు) అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నాసిరకం, నకిలీ ఔషధాలు, కాస్మొటిక్స్ అమ్మకాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అనుమానితులు, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు డ్రగ్ కంట్రోల్ అధికారులకు మధ్య సత్సంబంధాలు ఉండటంతో చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.



    2012, ఆగస్టులో వరంగల్ నగరంలో నకిలీ కాస్మొటిక్స్, ఔషధాల వ్యాపా రం జోరుగా సాగుతోందని ఓ వినియోగదారుడు ఇచ్చిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు సీపీ రెడ్డి కాంప్లెక్సులోని ఓ లేడీస్ ఎం పోరియం దుకాణంపై దాడులు చేశారు. దాడు ల్లో దాదాపు పది రకాల బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ఇంపోర్టెడ్ కాస్మొటిక్స్ నకిలీవిగా అనుమానించారు. వీటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ఔషధ నియంత్రణ శాఖ లేబోరేటరీకి పంపిస్తామని అప్పుడు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ పరీక్షల్లో నకిలీవని తేలితే చట్ట ప్రకారం చర్యలు చేపడతామన్నారు. సదరు దుకాణాన్ని సీజ్ చేశారు. తర్వాత ఎటువంటి చర్యలు చేపట్టలేదు.



    ఏడాది గడిచినా నకిలీ కాస్మొటిక్స్ కేసులో కనీస పురోగతి లేకుండా పోవడంతో మరో వినియోగదారుడు ఈ అంశంపై హైకోర్టులో కేసు దాఖలు చేశాడు. స్పందించిన హైకోర్టు తక్షణమే నకిలీ కాస్మొటిక్స్ కేసు వివరాలు అందజేయాలని డ్రగ్స్ కంట్రోలర్ ఉన్నతాధికారులకు 2013 ఆగస్టులో నోటీసులను జారీ చేసింది. జిల్లా డ్రగ్స్ అధికారులు హడావుడిగా 2013 ఆగస్టు 22న మరోసారి సీపీరెడ్డి కాంప్లెక్స్‌లో ఉన్న దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. ఈసారి నాలుగు బ్రాండెడ్ కంపెనీల కాస్మొటిక్స్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఏడాది గడుస్తున్నా చర్యలు లేవు. ఈ అంశంపై సమాచార హక్కు చట్టం కింద వివరాల కోసం ప్రయత్నించగా.. 2013 ఆగస్టు 22న సీపీరెడ్డి కాంప్లెక్స్‌లో కవితా గిఫ్ట్స్ అండ్ లేడీస్ ఎంపోరియంపై జరిపిన దాడిలో నాలుగు రకాల కాస్మొటిక్స్‌ను సేకరించి లేబోరేటరీకి పంపినట్లు డ్రగ్ కంట్రోల్ అధికారి పల్లవి పేర్కొన్నారు. ఇంతవరకు ల్యాబ్ నుంచి నివేదిక అందలేదని తెలిపారు.

     

    డ్రగ్స్ అధికారులు ఏం చేయాలి..



    నకిలీ ఔషధాలు, కాస్మొటిక్స్ అమ్మకాల విషయంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేసిన షాపును సీజ్ చేయవచ్చు. ఆ షాప్‌లో సేకరించిన ఉత్పత్తులను ల్యాబ్‌కు పంపించి 45 రోజుల్లో పూర్తి వివరాలు సేకరించి, కోర్టుకు నివేదించాలి. ల్యాబ్‌లో ఆయా కాస్మొటిక్స్ నకిలీవని తేలితే డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం-1940లోని సెక్షన్ 27(ఎ) ప్రకారం గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు, రూ.5 వేల జరిమానా విధించే అవకాశాలున్నాయి. ఈ కేసులో డ్రగ్స్ అధికారులు అలా చేయలేదు. రెండేళ్లుగా డ్రగ్ కంట్రోలర్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ పేరుతో దాడులు చేయడం మినహా చర్యలు చేపట్టకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.

     

    ఏటా రూ.2 కోట్ల వ్యాపారం



    ముంబై నుంచి దిగుమతి అవుతున్న నకిలీ మా ల్ వ్యాపారానికి యువత టార్గెట్‌గా జరుగుతు న్న నకిలీ కాస్మొటిక్స్ దందాకు హన్మకొండ చౌర స్తా అడ్డాగా మారింది. ఈ దందా ఏడాదికి రూ. 2 కోట్లకు పైగా సాగుతోంది. ఇంత జరుగుతు న్నా డ్రగ్స్ అధికారులు ఒక్క కేసు నమోదు చేసి న దాఖలాలు లేవు. అంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. రెండేళ్లుగా ఈ కేసులో పురోగతి కని పించకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. గతేడాది దాడులు జరిగిన వెంటనే అధికారులకు, షాపుల యజమానులకు భారీ స్థాయిలో బేరం కుదిరినట్లు ప్రచారం జరిగింది.

     

    ఆ అధికారిపై అనుమానాలు



    డ్రగ్ కంట్రోల్ విభాగంలో వరంగల్‌కు పొరుగు జిల్లాలో కీలక పోస్టులో ఉన్న ఓ అధికారికి హన్మకొండ చౌరస్తాలోని ఒక షాపింగ్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న నకిలీ కాస్మొటిక్ దందాతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తక్కువ కాలంలో ఎక్కువ  డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో సదరు అధికారి ఈ మర్గాన్ని ఎంచుకున్నాడని చెబుతుంటారు. ఆయన అండదండలు ఉండటం వల్లనే ఈ నకిలీ కాస్మొటిక్ దందాపై సరైన చర్యలు తీసుకునేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఉత్తుత్తి దాడులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top