బీడీ కార్మికులకు భరోసా


బీడీ కార్మికుల పోరాటాలు ఫలించాయి. బతుకుదెరువు కోసం బీడీలు చుడుతూ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నవారికి ‘ఆసరా’ లభించనుంది. బీడీ కార్మికులకు రూ.వెయ్యి జీవన భృతి అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా యి. మంగళవారం నుంచి జిల్లాలో వివరాల సేకరణ చేపట్టనున్నారు.

 - కరీంనగర్

 

 కరీంనగర్ : జిల్లాలో 1.20 లక్షల మంది బీడీ కార్మికులున్నారు. వీరిలో 60 వేలకుపైగా మంది పీఎఫ్ ఉన్నవారు. వీరిలో ఇప్పటికే ఆసరా పథకం కింద వివిధ రకాల పింఛన్లు పొందుతున్న వారు 15 శాతం దాకా ఉంటారు. మిగతా 60వేల మంది వర్దీ బీడీలు చేస్తున్నవారే. పీఎఫ్ ఉన్నవారికి జీవనభృతి కింద లబ్ధి చేకూరే అవకాశముండగా.. వీరికి ప్రతీనెలా రూ.5 కోట్ల మేర ప్రయోజనం చేకూరే అవకాశముంది.

 జిల్లాకు త్వరలో పర్యవేక్షణ కమిటీ




 బీడీ కార్మికుల స్థితిగతులు, కార్మికుల పనిదినాలు, వారికి వస్తున్న ఆదాయంపై సీనియర్ ఐఏఎస్ అధికారి పూలం మాలకొండయ్య నేతృత్వంలో పర్యవేక్షణ జరగనుంది. రాష్ట్రంలో మొదట కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో కమిటీ పరిశీలించనున్నట్లు తెలిసింది. ఫిబ్రవరిలో ఈ కమిటీ నివేదిక సమర్పించగానే బీడీ కార్మికులకు పింఛన్ అమలుచేసే అవకాశముంది. వివరాల సేకరణ, కమిటీ నివేదిక అనుకున్న ప్రకారం అందితే మార్చి నెల నుంచే ఒక్కో కార్మికురాలికి నెలకు రూ.వెయ్యి జీవనభృతిగా అందనుంది. పీఎఫ్ కార్డుల ఆధారంగా బీడీ కార్మికులను గుర్తించాలని సమీక్షలో నిర్ణయించగా... చాలా కంపెనీలు పీఎఫ్ ఖాతాలు తెరవలేదని సమాచారం. దీంతో సమగ్ర సర్వేలో ఇచ్చిన సమాచారం ఆధారంగా అధికారులు క్షేత్రస్థాయిలో పునఃపరిశీలించనున్నారు.




 పోరాటం ఫలిచింది

 - ఎర్ర కేతక్క, బీడీ కార్మిక సంఘం నాయకురాలు




 నలభై ఏళ్లుగా చేస్తున్న పోరాటం ఫలించింది. కేసీఆర్  హామీని నిలుపుకున్నందుకు సంతోషం. రోగాల పాలవుతున్న కార్మికులకు ఆసరా పథకం వరంలాంటిది.

 సలాం కేసీఆర్

 - కూడలి పద్మ, బీడీ కార్మికురాలు

 

 బీడీ కార్మికుల అవస్థలు తెలుసుకున్న కేసీఆర్‌కు బీడీ కార్మికుల నుంచి సలాం చేస్తున్న. ఆసరా అందించాలన్న ఆలోచనే అద్భుతం. మాకు వెయ్యి రూపాయలంటే హజార్ బీడీ లెక్క.

 అందరికీ ఇవ్వాలి

 - షకీలా, బీడీ కార్మికురాలు

 

 రోజంతా బీడీలు చేసినా పూట గడవడం కష్టమే. బీడీలు చుట్టేవాళ్లందరికీ పింఛన్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల్లో అధికారులు కొర్రీలు పెట్టకుండా చూడాలి.




 మాది చేతల ప్రభుత్వం...

 రూప్‌సింగ్, టీఆర్‌ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు




 హామీలను దశలవారీగా అమలు చేస్తూ చేతల ప్రభుత్వంగా నిరూపించుకుంటున్నాం. సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top