నేటి నుంచి బతకమ్మ వేడుకలు


 ‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..బంగారు గౌరమ్మ ఉయ్యాలో...’‘చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దూల గుమ్మ.. అందాల బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన..’ ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ..ఏమేమి కాయొప్పునే.. తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే..’ ‘ఒక్కొక్క పువ్వేసి చందమామ ఒక్క జామాయె చందమామ...రెండేసి పూలేసి చందమామ రెండు జాములాయె చందమామ..’’

 


ఎంగిలి పూల బతుకమ్మ..

 బతుకమ్మ... బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ బంగారు బతుకమ్మను తొమ్మిది రోజులపాటు కొలిచే పండుగ రానే వచ్చింది. ‘పూల’ పల్లకిలో మహిళలకు సంబరాలు మోసుకువచ్చింది. తెలంగాణకే తలమాణికమైన బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు పల్లెల నుంచి పట్టణాల వరకు మహిళలు ఇష్టంగా జరుపుకుంటారు. మనిషికి ప్రకృతికి విడదీయరాని అనుబంధం ఉంది. అందుకే భారతీయ సంస్కృతిలో ప్రకృతితో మమేకమై చేసే పండుగలే అధికం. ఇటువంటి పండుగల్లో బతుకమ్మ ఒకటి. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ వచ్చిందం టే ఆడపడుచుల్లో కలిగే సంబరం అంతా ఇంతా కాదు.



అశ్వయుజమాసం ఆరంభం అమావాస్యరోజైన శుక్రవారం నుంచి నవరాత్రులు ముగిసే వరకు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలు జరుపుకుంటారు. బతుకమ్మ పండగ మూడు పండగల సమ్మేళనంగా జరుపుకునే పసందైన వేడుక. అమావాస్యను తొలి రోజుగా బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పేర్చి సాయంత్రం చావడి వద్దకు తీసుకవచ్చి ఆడుతారు. ఎంగిలి పూలు వేస్తారు. అమావాస్యకు ముందు ఐదు రోజులు బొడ్డెమ్మగా ఆడిన అనంతరం అమావాస్య రోజు నుంచి తొమ్మిది రోజులపాటు ఈ ఆట సాగుతుంది. ఈ పండుగ వచ్చిం దంటే ఎక్కడెక్కడి వారో తమ సొంతూళ్లకు చేరుకుంటుంటారు.



 పండుగ పుట్టిందిలా...

 పూర్వం ధర్మాంగధుడు అనే రాజు ఉండేవాడు. అతడి భార్య సత్యవతి. ఆ కాలంలో ఈ రాజ దంపతులకు పలుమార్లు సంతానం కలిగినా పుట్టిన వారు పుట్టినట్లే చనిపోతూ ఉండేవారు. ఇలా చాలామంది చని పోతుండడంతో దంపతులిద్దరూ లక్ష్మీదేవి పూజ నిర్వహిస్తారు. వారికి చివరగా ఓ పాప పుడుతుంది. ఆమె బతికుండాలని రాజు లోకమాత అయిన దుర్గాదేవికి శరన్నవరాత్రుల పేరిట తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాడు. అప్పటి వరకు పాపకు ఏపేరు పెట్టకుండా ఉంటాడు.



 ఈ బిడ్డ బతకాలని అందరూ ఆమెను ‘బతుకమ్మా.. బతుకమ్మా..’ అంటూ దీవించారు. క్రమంగా ఆ పాప పేరు బతుకమ్మగా మారింది. తదుపరి లక్ష్మీదేవిగా నామకరణం చేసినా.. అందరూ బతుకమ్మగానే పిలుస్తుండేవారు. రాజు కూతురు ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఎవరి ఇంట్లో అడుగిడినా లక్ష్మీదేవి తాండవిస్తుండేది. వరంగల్ జిల్లాలో ఈ పండుగ పుట్టిందనేది ఎక్కువగా వాడుకలో ఉంది.



 సౌభాగ్యం పంచే బతుకమ్మ

 పెళ్లి కావాల్సిన వారు పండుగ తొలి రోజు నుంచి తొమ్మిది రోజులపాటు బతుకమ్మను గౌరమ్మగా కొలిస్తే మంచి వరుడు రావడంతోపాటు సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని నమ్మకం. ఇదే తీరులో సౌభాగ్యం కలిగిన మహిళలు తొమ్మిది రోజులు బతుకమ్మను పూలతో పూజించి ఆడితే సౌభాగ్యం నిలుస్తుందని విశ్వాసం. పూనాస పంటలుగా వచ్చే వాటితో ఐదు రకాల పిండి వంటలు చేసి, ఐదు రకాల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మగా కొలిస్తే ఆ ఇంట సిరుల పంట కురుస్తుంది. తంగేడు పూలు, గోవు పూలు, గుమ్మడి పూలు, పున్నాగ పూలు, కట్లపూలతో బతుకమ్మను పేరుస్తారు. పప్పు పులుగడం, పెరుగుతో చేసే దద్దోజనం, పాయసం, పులిహోర, కేసరి అనే ఐదింటిని నైవేద్యాలుగా పెడుతారు. ఈ వంటకాలు శరీరారానికి మేలు చేస్తాయి.



 ప్రదక్షిణలే పాటలయ్యాయి

 భక్తిశ్రద్ధలతో ఐదేసి రకాల పూలు, వంటకాలతో బతుకమ్మ చుట్టూ ఐదుసార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఇలా ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో పాత కాలంలో వేద మంత్రాలతో కూడిన శ్లోకాలు పాడేవారు. అన్ని వర్గాల వారికి శ్లోకాలు రాకవపోవడంతో గౌరమ్మపై స్థానిక భాష, వైవిధ్యాలకు అనుగుణంగా పాటలు పాడేవారు. ఆనాటి ఆ పాటలు నేటి బతుకమ్మ పాటలుగా చెలమణి అవుతున్నాయి.



కష్ట జీవులు కూడా బతుకమ్మ ఆడుతున్న సమయంలో తమ శ్రమను, తమ కష్టాల్ని బతుకమ్మ పాటలుగా మలిచేవారు. అలా నేడు బతుకమ్మ పాటలు వేలల్లో కనిపిస్తాయి. ఎక్కువగా దేవుళ్లు పడ్డ కష్టాలు, రామాయణంలో సీతమ్మవారి కష్టాలు, లక్ష్మీదేవి వైభవాన్ని చాటుతాయి. తెలంగాణ ప్రజల కష్టసుఖాలు కూడా బతుకమ్మ పాటలుగా నేడు ఆదరణ పొందుతున్నాయి.



 సద్దుల బతుకమ్మ

 బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మ ప్రత్యేకం. తొమ్మిది రోజుల్లోనూ ప్రతి ఆడపడుచూ తప్పనిసరిగా బతుకమ్మ చుట్టూ రెండు అడుగులు వేయాలి. రెండు పాటలు పాడాలి అనుకునే సందర్భం సద్దుల బతుకమ్మ. మహిళలు పట్టు చీరెలు, యువతులు పరికిణీలు ధరించి, నగలతో సింగారించుకుంటుంటారు. వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడుతూ రాత్రిలో బతుకమ్మను చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.



పెద్ద బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పేరుతోనూ, గౌరమ్మగానూ కొలిచి నీటిలో నిమజ్జనం చేసి పోయి రా.. బతుకమ్మా అంటూ.. హారతులు ఇచ్చి సాగనంపుతారు. వెంట తెచ్చుకున్న పెరుగన్నం, సత్తు పిండి (మొక్కజొన్న, వేరుశెనగ పిండి వేయించి చక్కెర కలిపి) ఇచ్చి పుచ్చుకుంటారు. బియ్యం, నువ్వులు, పల్లీలు, మొక్కజొన్నలను చక్కెర, బెల్లంతో కలిపి దంచిపెడుతారు. యువతులు, మహిళలు ఒకచోట చేరి శిబ్బుల్లో (బతుకమ్మను పేర్చేది) ఇచ్చిపుచ్చుకుంటుంటారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top