భూపంపిణీకి అడ్డంకులు

భూపంపిణీకి అడ్డంకులు - Sakshi


నియోజకవర్గానికి ఒకే గ్రామం

ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే..

వ్యవసాయ రంగంలోని పేదలకే లబ్ధి

ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ

మళ్లీ మొదటికొచ్చిన ప్రక్రియ

ముకరంపుర : గతంలో ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా అధికారయంత్రాంగం ఆగమేఘాలపై భూ పంపిణీ కార్యక్రమానికి కసరత్తు కొనసాగించింది. ఎస్సీ సబ్‌ప్లాన్ ప్రకారం నలభై శాతం ఎస్సీ జనాభా ఉన్న గ్రామాలను గుర్తించింది. కరీంనగర్ మినహా 48 మండలాల్లో గ్రామాలను ఎంపిక చేసి ప్రభుత్వ, ప్రైవేట్ భూములను గుర్తించింది. కేవలం ఎనిమిది మండలాల్లోనే సర్కారు భూములు అందుబాటులో ఉన్నట్టు తేల్చింది. మిగిలిన మండలాల్లో ప్రైవేట్ భూము లు కొనుగోలు చేయాలని నివేదిక సిద్ధం చేసింది. ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రైవేట్ భూములను ప్రస్తుత మార్కెట్  రేటు ప్రకారం కొనుగోలు చేయాలని పేర్కొంది. ఇందుకోసం సుమారు రూ.397.47 కోట్ల నిధులు అవసరమవుతాయని లెక్కగట్టింది.



ఈ మేరకు ప్రభుత్వానికి ఒక ప్రాథమిక నివేదిక సమర్పించింది. సాధ్యాసాధ్యాలను గమనించిన సర్కారు మొదటి విడతగా నియోజకవర్గానికో గ్రామంతో సరిపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ముఖ్యమంత్రి కార్యాలయం జాయింట్ సెక్రటరీ స్మితాసబర్వాల్, పరిశ్రమల కమిషనర్ జయేష్‌రంజన్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూ పంపిణీ ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాల గురించి వివరించారు. ఆయా గ్రామాల్లో సాగుయోగ్యమైన భూమిని గుర్తించి తక్కువ ధరలో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.



ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం భూ పంపిణీలో వ్యవసాయ రంగంలో ఉన్నవారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. దీంతో అధికారయంత్రాంగం ఇప్పటిదాకా కొనసాగించిన కసరత్తుకు బ్రేక్‌పడింది. గ్రామాల వారీగా లబ్ధిదారులను గుర్తించడానికి ముగ్గురితో కూడిన బృందానికి డివిజన్ల వారీగా ఇస్తున్న శిక్షణను ఆపేశారు. దీంతో గ్రామాల ఎంపిక, లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది.

 

ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే..


నియోజకవర్గానికో గ్రామానికి ఎంపిక చేయాల్సిన బాధ్యతను సర్కారు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అప్పగించింది. దీంతో వారు ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తే.. ఇతర గ్రామాల ప్రజల నుంచి వ్యతిరేక వచ్చే ప్రమాదముందని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఎంపిక చేసిన గ్రామాల్లో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు పేర్కొంటున్నారు. ఆయా గ్రామాల్లో మలివిడతలో భూ పంపిణీ జరుగుతుందంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top