డూప్లికేటుగాళ్లు


సాక్షి, ఖమ్మం: అటవీ భూముల్లో పోడు నరికి వ్యవసాయం చేసుకునే గిరిజన రైతులకు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రభుత్వం హక్కులు కల్పించింది. 2006 డిసెంబర్ నాటికి గిరిజనుల ఆధీనంలో ఉన్న అటవీ భూములకు సంబంధించిన అర్హులను గుర్తించారు. జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకునే సుమారు 30 వేల మంది గిరిజన రైతులకు దాదాపు 2.10 లక్షల ఎకరాల అటవీ భూములపై శాశ్వత హక్కులు కల్పించారు. ఇంకా వేలాది మంది తమకు హక్కు కల్పించాలంటూ ఆయా మండలాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు.



ఈ దరఖాస్తులు 2010 నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఆసరాగా చేసుకున్న ఓ ముఠా అక్రమ సంపాదనే ధ్యేయంగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామంటూ గిరిజనులను నమ్మించింది. ఏజెన్సీ మండలాల్లో  ఒక్కో రైతు నుంచి ఎకరానికి రూ.10 వేలు వసూలు చేసింది. ‘ఈ పాస్ పుస్తకాలుంటే బ్యాంకుల్లో రుణాలు వస్తాయి.. ప్రభుత్వం విద్యుత్, బోర్లకు రుణాలిస్తుంది..’ అని మాయమాటలు చెప్పింది.



పట్టాలు వస్తాయని గిరిజన గూడేల్లో ఒకరిని చూసి మరొకరు ఇలా వందలాది మంది గిరిజన రైతులు ఈ ముఠాకు డబ్బులు ముట్ట జెప్పారు. చాలా మంది రైతులు రూ.2, నుంచి రూ.5కు వడ్డీకి తెచ్చి మరీ ఇచ్చారు. ఇదే అదనుగా భావించిన ముఠా రైతుల నుంచి అందినకాడికి దండుకుంది. రూ.లక్షల్లో కూడబెట్టుకుంది. జూలూరుపాడు, ఏన్కూరు, ఇల్లెందు, టేకులపల్లి, మండలాల్లో ఈ ముఠా సభ్యులు చాలా మంది రైతులను మోసం చేశారు.



 బయట పడిందిలా..

 గత ఏడాది ఏన్కూరు మండలంలో నకిలీ పట్టాదారు పాసుపుస్తకం బయట పడింది. అయితే అక్కడ ఉన్న అధికారులు.. ఆ ముఠా సభ్యులు కుమ్మక్కై ఈ వ్యవహారం బయటపడకుండా సదరు రైతుకు డబ్బులు ఇప్పించినట్లు సమాచారం. దీన్ని ఆసరాగా చేసుకొని ముఠా మరోసారి జూలువిదిల్చింది. జూలూరుపాడు మండలం వినోభానగర్, ఏన్కూరు మండలం అక్కినాపురంతండా, నాచారం, కేశుపల్లి, ఇమామ్‌నగర్ గ్రామాల్లోని గిరిజన రైతులకు నకిలీ పాస్ పుస్తకాలు అంటగట్టింది.



వినోభానగర్‌కు చెందిన భూక్యా ఉమ పంట రుణం కోసం బ్యాంకుకు వెళ్లడంతో అసలు విషయం బయట పడింది. ‘ఇది నకిలీపాస్ పుస్తకం.. రుణం ఇవ్వటం కుదరదు’ అని బ్యాంకు అధికారులు చెప్పడంతో మోసపోయినట్లు వారు గ్రహించారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లినా అక్కడ కూడా తాము ఈ పట్టాదారు పుస్తకాలు ఇవ్వలేదని చెప్పడంతో ఒక్కసారిగా ఆమె ఆశలు అడియాశలయ్యాయి.



  గిరిజనులకు సదరు ముఠా సభ్యులు ఇస్తున్న పట్టాదారు పాసు పుస్తకాలు ఒరిజనల్ వాటిని  పోలి ఉండటం గమనార్హం. తహశీల్దార కార్యాలయాల్లోని ఉద్యోగుల సహకారం లేనిదే ఇంత పకడ్బందీగా పుస్తకాలు తయారు చేయటం కుదరదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ముఠా సభ్యులు వారు వసూలు చేసిన డబ్బులో కొంత తహశీల్దార్ కార్యాలయాల్లోని సిబ్బందికి అప్పజెప్పి ఖాళీ పాసు పుస్తకాలను తీసుకుంటున్నట్లు సమాచారం.



వీటిపై తహశీల్దార్, ఐటీడీఏ అధికారుల పోర్జరీ సంతకాలు చేసి యథేచ్ఛగా గిరిజనులకు అసలువే అంటూ ఇస్తున్నారు. ఉమకు 2013లో జారీ అయినట్లుగా ఉన్న నకిలీ పట్టాదారు పాసు పుస్తకంలోనూ తహశీల్దార్, ఐటీడీఏ ఫారెస్టు అధికారుల నకిలీ సంతకాలు, ముద్రలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఈ ముఠాకు తహశీల్దార్ కార్యాలయాల్లోని సిబ్బందే సహకరిస్తున్నారని తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top