సాగర్..పూడిపోతోంది

సాగర్..పూడిపోతోంది - Sakshi


- జలాశయంలో రోజురోజుకూ తగ్గుతున్న నీటినిల్వ సామర్థ్యం

- రాళ్లురప్పలతో పేరుకుపోతున్న పూడిక

- ఆందోళనలో ఆయకట్టు రైతాంగం

- ముందస్తు చర్యలు చేపట్టని ప్రభుత్వం


నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయంలో రోజురోజుకూ నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల్లోని ఐదు జిల్లాల పరిధి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. 2,58,948 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన కృష్ణానది పరీవాహక ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీటితోపాటు ఒండ్రుమట్టి, ఇసుక ప్రతి ఏటా జలాశయంలోకి వచ్చి చేరుతోంది. అదే విధంగా అటవీప్రాంతమైన ఎత్తయిన నల్లమల గుట్టల మీదనుంచి వచ్చే వరదనీటితోపాటు రాళ్లురప్పలూ కృష్ణానదిలోకి వచ్చిచేరుతున్నాయి.



కృష్ణానదిలో వరద అత్యధికంగా వచ్చే సమయంలో  నదీతీరాలను ఒరుసుకుంటూ వచ్చే నీటి ఉధృతితో తీరాలు కోతకుగురై  చెట్లు చేమలు, మట్టికొట్టుకొచ్చి జలాశయం నిండుతోంది. జలాశయంలో నిండుగా నీరున్నప్పుడు గుట్టలు నదిలోకి కూలుతున్నాయి. 110చదరపు మైళ్ల పరిధిలో  ఐదు జిల్లాల నడుమ విస్తరించి ఉన్న జలాశయంలో వేలాదిగా పశుజీవాలు, జంతుజాలాలు తాగునీటికి వచ్చినపుడు ఎత్తై ప్రాంతాలనుంచి జారిపడే రాళ్లు తక్కువేమి కావు. ఒక్కరోజు కాదు ఏడాది పొడవునా ఇది జరుగుతుంటుంది. జలాశయంనుంచి మాత్రం తట్టమట్టి కానీ.. ఏఒక్క రాయి కూడా బయటకు పోదు. దీంతో పూడిక పెరిగిపోయి నిటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది.

 

చర్యలు సున్నా..


1955లో సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరగగా 1967లో పూర్తయింది. ఆనాటి నుంచి నేటివరకు 47సంవత్సరాలలో చేరిన పూడిక సుమారుగా 103 శతకోటి అడుగుల పైచిలుకు నీటినిల్వలుండే ప్రాంతాన్ని మింగేసింది. ప్రభుత్వం ఆనాటినుంచి నేటివరకు పూడికపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కేంద్ర జలనిపుణుల బృందం ఐదు, పదేళ్లకోమారు నిండిన పూడికపై సర్వే నిర్వహించి పూడుతుందని తెలియజేయడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పిన దాఖలాలు కూడా లేవు. నాగార్జున సాగర్ జలాశయానికి నది గరిష్ట వరద ప్రవాహం 10.60 లక్షల క్యూసెక్కులుకాగా, వెయ్యేళ్ల గరిష్ట వరద ప్రవాహం 20.60లక్షల క్యూసెక్కులు.

 

పూడిక నివారణకు మార్గాలు

- పూడికను తొలగించడమనేది జరగదని, కేవలం నివారించడమొక్కటే మార్గమని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు.

- జలాశయానికి ముందు మినీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి.

- వరద ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉన్నచోట మట్టిని నిలపడానికి అడ్డుకట్టలు వేయాలి.

- గుట్టల మీదినుండి వచ్చే వరదతోపాటు కొట్టుకువచ్చే రాళ్లు, మట్టిని నివారించడానికి రాతికట్టలు నిర్మించాలి.

- జలాశయంలో నీరు తగ్గిన సమయంలో ప్రాజెక్టు తీరాలలో ఉన్న ఆయకట్టేతర ప్రాంతాల్లోని మెట్టభూముల్లోకి ఒండ్రుమట్టిని ప్రభుత్వ ఖర్చుతో తోలాలి.

 

తగ్గిందిలా..

సాగర్ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 408.24 (టీఎంసీలు)శతకోటి ఘనపుటడుగులు. 2010నాటికి 312.0456 టీఎంసీలకు తగ్గింది. సాంకేతిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 1967నుంచి 1974నాటికి 14.4టీఎంసీలుకు చేరింది. 1978 నాటికి 48.72టీఎంసీలు తగ్గింది. అది 2001నుంచి 2009నాటికి 79.21టీఎంసీలకు చేరింది. 2009లో కృష్ణానదికి వచ్చిన వరద తో పాటు బురద మట్టి అంతా ఇంతాకాదు. 14.8లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరింది. అంటే..ఎంత బురదవచ్చిందో గమనించవచ్చు. 2010నాటికి 96.095టీఎంసీలకు తగ్గింది. నేడది 103టీఎంసీల పైచిలుకు తగ్గి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

నీటి కేటాయింపులు..


సాగర్ జలాశయంనుంచి కుడికాలువకు 132టీఎంసీలు, ఎడమకాలువకు 132టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి. ఆవిరి రూపేనా 17టీఎంసీల నష్టముంటుంది. ఈ నీటితో 22లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. కృష్ణాడెల్టాలో వేలాది ఎకరాలకు సాగునీటితో పాటు విద్యుత్ ఉత్పాదన జరుగుతుంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతోపాటు ఆయకట్టుపరిధిలోని ఐదు జిల్లాల్లోని వందలాది చెరువులు నింపి వేలాది గ్రామాలకు తాగునీరందిస్తుంది. తెలంగాణలోని ఫ్లోరిన్‌ఫీడిత గ్రామాలకు తాగునీరు సాగర్‌జలాశయంనుంచి వెళుతున్నాయి. ఇంత ప్రతిష్ట కలిగిన జలాశయంలో పూడిక చేరిక నివారణపై ప్రభుత్వాలకు శ్రద్ధలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top