రేపటి నుంచి బీటెక్, బీ ఫార్మశీ పరీక్షలు

రేపటి నుంచి బీటెక్, బీ ఫార్మశీ పరీక్షలు - Sakshi


సాక్షి, సిటీబ్యూరో: జేఎన్టీయూహెచ్ పరిధిలో ఫైనలియర్ బీటెక్, బీఫార్మశీ వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26 వరకు జరగనున్న పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని వర్సిటీ అధికారులు చెప్పారు.



సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. తొలుత అన్ని పరీక్షలను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఫైనలియర్ పరీక్షల నిర్వహణకు అనుమతించాలంటూ.. వర్సిటీ అధికారులు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఫైనలియర్ పరీక్షలను మాత్రమే నిర్వహించేందుకు ఈ నెల 4న ఎన్నికల కమిషన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

 

90,228 మంది...


 

ఫైనలియర్ బీటెక్, బీఫార్మశీ పరీక్షలకు మొత్తం 90,228 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 85993 మంది బీటెక్ విద్యార్థులు కాగా, 4235 మంది బీఫార్మశీ వారు. పరీక్షలు రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను ఎన్నికల అనంతరం (మే 19 తర్వాత) నిర్వహిస్తామన్నారు. గతేడాది మాదిరిగానే ఈ దఫా బీటెక్, బీఫార్మశీ పరీక్షలకు కూడా జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు.

 

తప్పని అవస్థలు...

 

జంబ్లింగ్ విధానం ప్రకారం ఒక కళాశాల విద్యార్థులకు 10 కిలోమీటర్ల రేడియస్‌లో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే.. కొన్ని ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు 20 కిలోమీటర్ల దూరంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల్లో కేంద్రాల వల్ల అక్కడికి వెళ్లే క్రమంలో గతంలో ఎంతోమంది విద్యార్థులు రోడ్డు ప్రమాదాలకు గురైనా... యూనివర్సిటీ అధికారులకు మాత్రం పట్టడం లేదు.  

 

అందని హాల్‌టికెట్లు

 

మరో 24 గంటల్లో పరీక్షలకు హాజరు కావాల్సిన కొన్ని కళాశాలల విద్యార్థులకు ఇంకా హాల్‌టికెట్లు అందలేదు. ప్రైవేటు యాజమాన్యాలు యూనివర్సిటీకి కామన్ సర్వీస్ ఫీజు బకాయిలు చెల్లించనందుకు హాల్‌టికెట్లను నిలిపివేసినట్లు సమాచారం. ఆన్సర్ స్క్రిప్ట్స్ కూడా రాలేదని మరి కొన్ని కళాశాలల సిబ్బంది యూనివర్సిటీ పరీక్షల విభా గం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు... ఫీజు రీయింబర్స్‌మెంట్ అందని విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తల్లిదండ్రుల నుంచి అధికారులకు ఫిర్యాదులు వస్తున్నా యి.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top