సరిహద్దులో ఇసుక వార్..!

సరిహద్దులో ఇసుక వార్..! - Sakshi


సాక్షిప్రతినిధి, ఖమ్మం: గోదావరి ఇసుకపై ఇరు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీ నేతల మధ్య వార్ కొనసాగుతోంది. భద్రాచలం సరిహద్దు.. ఆంధ్రప్రదేశ్‌లో వీలినమైన నెల్లిపాక మండలం గొమ్ము కొత్తగూడెం రీచ్‌లో ఇసుక తవ్వకాలకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ తవ్వకాలు భద్రాచలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత కనుసన్నల్లోనే సాగుతున్నాయి. అయితే, ఇక్కడి నుంచి ఇసుకను హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తుండడం.. వాటిని అధికారులు అడ్డుకోవడం.. తనకు వాటా ఇస్తే ఇసుక వాహనాలు సాఫీగా వెళ్తాయని ఓ టీఆర్‌ఎస్ నేత అంటుండడంతో సరిహద్దులో ఇసుక వివాదం తీవ్రరూపం దాల్చింది.



భద్రాచలం డివిజన్‌లో గతంలో వెంకటాపురం మండలంలోని మొర్రంవానిగూడెం, మరికాల చర్ల మండలంలోని గొమ్ముగూడెం, మొగల్లపల్లి, భద్రాచలం మండలంలోని భద్రాచలం, గొమ్ముకొత్తగూడెం, పాల్వంచ డివిజన్‌లోని బూర్గంపాడు మండలంలోని పాత గొమ్మూరు వద్ద గిరిజన సొసైటీల ఆధ్వర్యంలో ఐటీడీఏ ద్వారా ఇసుక రీచ్‌లను  ఏర్పాటు చేశారు. వీటిలో భద్రాచలం మండలం గొమ్ముకొత్తగూడెం ఇసుక రీచ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన నెల్లిపాక మండల పరిధిలోకి వెళ్లింది. ఈ ఇసుక రీచ్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఆ గ్రామానికి చెందిన గిరిజన మహిళలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.



వచ్చే ఏడాది జూన్ వరకు ఇక్కడ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం భద్రాచలం ఏజెన్సీలో గోదావరి ఇసుక తవ్వకాలకు ఏ ఒక్క రీచ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదు.  గొమ్ముకొత్తగూడెం ఇసుక రీచ్‌ను పేరుకే ఏపీ ప్రభుత్వం స్థానిక  మహిళా సొసైటీకి అప్పగించినా భద్రాచలానికి చెందిన ఓ టీడీపీ సీనియర్ నేత కనుసన్నల్లోనే ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. రాజధానికి ఇసుకను తరలించాలంటే తెలంగాణ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ అనుమతి లేకపోవడంతో టీఆర్‌ఎస్ నేత హుకుంతో భద్రాచలం, సారపాక వద్ద గొమ్ముకొత్తగూడెం నుంచి తరలిస్తున్న ఇసుక లారీలను అధికారులు పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top