30 లోగా రుణ మాఫీ జాబితా


కలెక్టర్ డాక్టర్ శరత్

 సంగారెడ్డి టౌన్ : జిల్లా వ్యాప్తంగా రుణ మాఫీ పొందిన రైతుల తుది జాబితాను గ్రామ సభల ద్వారా అమోదింపచేసి ఈ నెల 30లోగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపానున్నట్లు కలెక్టర్ డాక్టర్ శరత్ పేర్కొన్నారు.  బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ ప్రత్యేక సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో  2.76,678 మంది రైతులు రూ.లక్ష లోపు రుణాలు (మొత్తం రూ.1.763 కోట్లు) పొందారని, ఆదేవిధంగా  29,347 మంది రైతులు బంగారం తాకట్టుపై (లక్షలోపు) రూ.185 కోట్లు పొందారని, మొత్తంగా 3,06,025 మంది రైతులు రూ.1,948 కోట్ల మేర లబ్ధిపొందనున్నారని తాత్కాలిక అంచనా వేసినట్లు కలెక్టర్ శరత్ పేర్కొన్నారు.  



ఆగస్టు 15న  రుణాలకు సంబంధించిన చెక్కులను లాంఛనంగా అందజేశామని, గతంలోనే ప్రభుత్వం విధాన ప్రకటన చేసినందున, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళి కిందకు రాదని కలెక్టర్ స్పష్టం చేశారు. రుణ మాఫీ పొందే రైతుల తుది జాబితా ఈ నెల 30లోగా సిద్ధం చేస్తారని ఈ నెల 21 నుంచి 23 మధ్య పంట రుణాలు బంగారంపై పొందిన రుణాల తుది జాబితా బ్యాంకుల వారీగా రూపొం దించి 24, 25 తేదీల్లో మండలాల వారీగా అధికారులతో బ్యాంకర్ల సమావేశం నిర్వహించి చర్చించాలన్నారు. ఇందుకు గాను ప్రతి మండలంలో సమన్యయ అధికారిగా సీనియర్ అధికారిని నియమించనున్నట్లు తెలిపారు.

 

రుణం పొందిన రైతుల జాబితాను పరిశీలించడంతో పాటు తహాశీల్దార్లు, టైటిల్ డీడ్లను పరిశీలిస్తారన్నారు. 26న రైతుల జాబితాను తయారుచేసి 27న జాబితాపై బ్యాంకర్లు, వ్యవసాయాధికారులు, ప్రత్యేకాధికారులు సమావేశం నిర్వహించి చర్చించుకోవాల్సి ఉంటుందన్నారు. 28, 29 తేదీల్లో గ్రామ పంచాయతీల్లో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించి, సోషల్ ఆడిట్ నిర్వహించి గ్రామసభ తీర్మానంతో జాబితాను జిల్లా కేంద్రానికి పంపాలన్నారు. 30న జిల్లా స్థాయిలో తుది జాబితాను రూపొందించి ప్రభుత్వానికి పంపనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మార్చి 31న పంట రుణాలను చెల్లించినా, తిరిగి చెల్లిస్తామన్నారు. సమావేశంలో ఏజేసీ మూర్తి, వివిధ బ్యాంకుల అధికారులు, వ్యవసాయ శాఖ జేడీ హుక్యా నాయక్ పాల్గొన్నారు.

 

ఎన్నికల నియమావళిని పాటించాలి

మెదక్ ఉప ఎన్నిక సందర్భంగా  ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలులో ఉన్నందున నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఖచ్చితంగా అమలు చేయాలని, నియమాళిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు.  



28న నామినేషన్ల పరిశీలన, 30న ఉపసంహరణ, సెప్టెంబర్ 13న ఎన్నిక, 16న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఇప్పటికే అనుమతి పొంది పారంభించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించవచ్చని, కొత్తగా ఏవిధమైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించవద్దని కలెక్టర్ సూచించారు. అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులచే ఏ విధమైన శంకు స్థాపనలు చేయించవద్దని ఆర్ధిక పరమైన మంజూరీలు చేయవద్దని సూచించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి పొందాలని తెలియజేశారు.   



సహాయ రిటర్నింగ్ అధికారిగా సంగారెడ్డి నియోజక వర్గానికి ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, మెదక్ నియోజకవ ర్గానికి ఆర్డీఓ వనజాదేవి, సిద్దిపేట నియోజక వర్గానికి ఆర్డీఓ ముత్యరెడ్ది, పటాన్‌చెరు నియోజక వర్గానికి డీఆర్‌డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గానికి డ్వామా పీడీ రవీందర్, గజ్వేల్ నియోజక వర్గానికి ప్రత్యేకాధికారి హనుమంతరావు, దుబ్బాక నియోజక వర్గానికి హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరావును నియమించామన్నారు.  మెదక్ ఉప ఎన్నిక విషయమై ఈ నెల 21న ఎన్నికల ప్రవర్తనా నియమావళి, తదితర అంశాలను వివిధ పార్టీల నాయకులతో చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top