అట్రాసిటీలో ‘ఆమె’ కేసులే ఎక్కువ


ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మహిళలకు సంబంధించిన కేసులే ఎక్కువగా నమోదయ్యాయి. మహిళలను, చిన్నారులను లైంగికంగా వేధించడం, కులం పేరుతో దూషించడం, పెళ్లి చేసుకుంటానని మోసగించడం, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. కాగా, స్థలాలు, భూములకు కేసులు సైతం నమోదయ్యాయి. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కమిటీ సభ్యులతో జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ జగన్మోహన్ అధ్యక్షతన నిర్వహించారు.



ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన సభ్యులు కేసుల పరిష్కారానికి.. పోలీసులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కొన్ని కేసులకు సంబంధించి రూ.6.50 లక్షలు రెండు రోజుల క్రితమే మంజూరు చేశామని కలెక్టర్ చెప్పారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున కేసులకు సంబంధించి నష్టపరిహారాన్ని బడ్జెట్‌లో కేటాయించలేదని, పాత కేసులకు కలెక్టర్ వద్ద ఉన్న నిధులను నష్టపరిహారంగా ఇచ్చినట్లు డీఆర్వో ప్రసాద్‌రావు తెలిపారు. 2015లో 31 కేసులకు పరిహారం ఇచ్చామన్నారు. సబ్ డివిజన్ల వారీగా ఒక్కో కేసును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కేసు ఎలా నమోదు చేశారు.. దేనికి సంబంధించి కేసు, ఇంత వరకు పోలీసు అధికారులు చేసిందేమిటి.? ఎన్ని కేసులు పూర్తి చేశారు.. ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి? ఎన్ని కేసులకు నష్టపరిహారం అందించారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.



అనంతరం ఎస్పీ తరుణ్‌జోషి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కొద్దిగా స్పీడప్ చేయాలని సూచించారు. 2014 సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద 100 కేసులు నమోదైతే 30 కేసులకు ఫైనల్ రిపోర్టు పూర్తైదని, 26కేసులు పెండింగ్ లో ఉన్నాయని, ఇంకా 44 కేసులపై విచారణ కొనసాగుతోందన్నారు. 2015 ఏప్రిల్ వరకు 36 కేసులు నమోదవగా, ఐదు కేసులకు ఫైనల్ రిపోర్టు పూర్తైదని, ఎనిమిది కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, 23 కేసులు విచారణ కొనసాగుతున్నాయని, ఎనిమిది కేసులకు నష్టపరిహ రం అందించామన్నారు.



కొన్ని కేసులకు హైకోర్టు స్టే ఆర్డర్స్‌తో రెండు, మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని సంబంధిత డీఎస్పీలు వివరించారు. సమావేశంలో ఐ టీడీఏ పీవో కర్ణన్, అదనపు ఎస్పీ పనసారెడ్డి, మంచి ర్యాల ఏఎస్పీ విజయ్‌కుమార్, డీఆర్వో సంజీవరెడ్డి, ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, శివలింగయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య, ఐసీడీఎస్ పీడీ మీరా బెనర్జీ, క మిటీ సభ్యులు, డీఎస్పీలు, అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top