5 నుంచి అసెంబ్లీ

5 నుంచి అసెంబ్లీ - Sakshi

7న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఈటెల

  పది నెలలకు సుమారు

  రూ. 80 వేల కోట్ల బడ్జెట్

  కనీసం రెండు వారాలపాటు 

  సాగనున్న సమావేశాలు

 

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 5 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 7న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి అసెంబ్లీ సమావేశాలు జూన్ 9న మొదలై ఐదు రోజులపాటు జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల నిర్వహణ విషయం మాత్రం పలు కారణాలతో రెండు నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ నెల 27 నుంచే ఈ సమావేశాలు ఉంటాయన్న ప్రచారం కూడా జరిగింది. అయితే బడ్జెట్‌పై కసరత్తు సోమవారం వరకూ కొనసాగడంతో అసెంబ్లీ భేటీని అనివార్యంగా నవంబర్ తొలి వారానికి వాయిదా వేయాల్సి వచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా బడ్జెట్ కే టాయింపులపై అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. కీలక రంగాలకు తగినన్ని నిధులు ఉండాలని, ఇప్పటివరకు ఎలాంటి ప్రాధాన్యత లభించని పలు శాఖలకూ ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. 

 

తాజాగా సీఎం నిర్ణయం మేరకు వచ్చే నెల 5 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు.. కనీసం రెండు వారాలపాటు కొనసాగే అవకాశముంది. బడ్జెట్ సమావేశాలు కనీసం 18 పని దినాలు ఉండాలన్నది సంప్రదాయం. అయితే దీనిని తగ్గించడం లేదా పొడిగించడం ప్రభుత్వ ఇష్టమని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ఈసారి పది నెలల కాలానికి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇప్పటికే ఆరు నెలల అవసరాల కోసం కన్సాలిడేటెడ్ నిధుల నుంచి వ్యయం చేయడానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధుల వినియోగాానికి ఉన్న గడువు డిసెంబర్ 2 వరకే ఉంది. 

 

ఇది దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆలోగా అసెంబ్లీని సమావేశపరిచి బడ్జెట్‌ను ఆమోదించుకోవడం తప్పనిసరిగా మారింది. కాగా, పది నెలల కాలానికి దాదాపు రూ. 80 వేల కోట్లకు పైగా బడ్జెట్ పరిమాణం ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ప్రణాళిక వ్యయం కూడా రూ. 25 వేల కోట్లకుపైగా ఉంటుందని, ప్రణాళికేతర వ్యయం రూ. 50 వేల కోట్లకు పైగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా వాటర్‌గ్రిడ్, వైద్య, ఆరోగ్యం, చెరువుల పునరుద్ధరణ, సాగునీటిపారుదల, సంక్షేమం, వ్యవసాయం, విద్యుత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రంగాలకు నిధులు భారీగా ఉండాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top