ఇదేం తరీఖా..!

ఇదేం తరీఖా..!


సభ నిర్వహణ తీరుపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ గుస్సా

 

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్న తీరుపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. శుక్రవారం శాసనసభ వాయిదా పడగానే స్పీకర్ వద్దకు వెళ్లి ఆయన నిరసన తెలిపారు. ‘ఎయిర్‌పోర్టు పేరు విషయంలో తీర్మానంపై మాట్లాడాల్సిందిగా స్పీకర్ రెండుసార్లు కోరారు. స్పీకర్‌పై గౌరవంతో లేచి నిలబడ్డా. ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానం ఏంటో నాకు తెలియదు. తీర్మానం కాపీలను సభ్యులకు ఇవ్వాల్సిన బాధ్యత లేదా? అదేంటో తెలియకుండా సభలో నేనేం మాట్లాడాలి?’ అని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. విషయం తెలుసుకున్న శాసనసభ కార్యదర్శి ఎన్.రాజా సదారాం పరుగు పరుగున అక్కడకు వచ్చారు. సిబ్బంది పొరపాటు వల్ల ఇలా జరిగిందని, తప్పుగా తీసుకోవద్దని కోరారు.



‘ఇదేం ప్రజాస్వామ్యం. ఇవేం సమావేశాలు. సమావేశాలను నిర్వహించే తరీఖా(పద్ధతి) ఇదేనా? ఇవేం సభా సంప్రదాయాలు? శాసనసభకు విలువ లేదు. బీఏసీ నిర్ణయాలకు విలువ లేదు. ఎవరి అభిప్రాయాలకు గౌరవం లేకుంటే బీఏసీకి, శాసనసభకు మేమెందుకు? మీరే నిర్వహించుకోండి’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంఐఎం సభ్యులతో కలిసి అక్బరుద్దీన్ సభ నుంచి బయటకు నడిచారు. అదే సమయంలో దాదాపు ఉరుకుతున్నట్టుగానే శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అక్కడికి చేరుకున్నారు. అక్బరుద్దీన్‌ను చేయిపట్టుకుని బతిమిలాడి  సర్దిచెప్పారు. చివరకు బీఏసీ సమావేశం చివరలో అక్బరుద్దీన్ కూడా హాజరయ్యారు.     

 

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top