ఆశా వర్కర్ల వినూత్న నిరసన


రామాయంపేట (మెదక్ జిల్లా) :  ఆశా వర్కర్లు చేపట్టిన నిరవధిక సమ్మె 35వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా మంగళవారం ఆశా కార్యకర్తలు వివిధ జిల్లాల్లో వినూత్న రీతిలో తమ నిరసన తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేటలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజాప్రతినిధులు, అధికారుల వద్దకు వెళ్లి తమకు జరుగుతున్న నష్టాన్ని వివరించి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని వారు పేర్కొన్నారు.



అదేవిధంగా దుబ్బాక తహశీల్దార్ కార్యాలయం పైకి ఎక్కి నిరసన తెలిపారు. కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.ఆశా వర్కర్ల సమ్మెకు మద్దతు తెలిపిన పెద్దగండవెళ్లి ఎంపీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చందిరి సంజీవరెడ్డి మాట్లాడారు. ఆశా వర్కర్లు గత నెల రోజులుగా శాంతియుత మార్గంలో నిరసనలు తెలిపినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆశా వర్కర్ల వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయన్నారు.


అలాగే నల్లగొండ జిల్లా వలిగొండ మండలకేంద్రంలో ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మెలో భాగంగా భువనగిరి, నల్లగొండ రహదారిపై కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు తుర్కపల్లి సురేందర్ మాట్లాడుతూ.. ఆశాల శ్రమను పది సంవత్సరాలుగా ప్రభుత్వం దోచుకుంటుందన్నారు. కనీస వేతనం అమలు చేయాలన్నారు. సమ్మెకు వీఆర్‌ఏల సంఘం మద్దతు ప్రకటించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top