Alexa
YSR
‘తెలుగువారి గుండెచప్పుడు వినగలిగే ఆత్మీయుడిగా ఉంటే చాలు... నా జన్మ ధన్యమైనట్టే’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం తెలంగాణకథ

వనపర్తిలో ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌

Sakshi | Updated: May 20, 2017 03:21 (IST)
వనపర్తిలో ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌

- రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు భూముల గుర్తింపు
- ప్రభుత్వ, అటవీ భూముల్లో సర్వే చేస్తున్న అధికారులు
- జిల్లాకేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు
- క్షుణ్ణంగా పరిశీలిస్తున్న రక్షణశాఖ అధికారులు


సాక్షి, వనపర్తి: ఫైరింగ్‌ రేంజ్‌ను వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేసేందుకు రక్షణశాఖ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పదిరోజుల క్రితం ఢిల్లీ నుంచి వచ్చిన ఓ రక్షణశాఖ అధికారి వనపర్తి జిల్లా రెవెన్యూ అధికారులతో కలసి 704 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు ఇప్పటివరకు గోప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ శుక్రవారం మీడియాలో కథనాలు రావడంతో విషయం కాస్తా బయటకుపొక్కింది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో కొత్తగా కట్టాలనుకుంటున్న సచివాలయంతోపాటు రాజీవ్‌ రహదారి, నిజామాబాద్‌ జాతీయ రహదారులపై కంటోన్మెంట్‌ ప్రాంతంలో ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న ఎలివేటేడ్‌ కారిడార్ల నిర్మాణానికి రక్షణశాఖకు చెందిన స్థలం కావాలని పలుమార్లు కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. అక్కడ భూమిని ఇస్తే రాష్ట్రంలో రక్షణశాఖకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలోని భూమిని ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇందులోభాగంగా రక్షణశాఖ సికింద్రాబాద్‌లో స్థలాన్ని ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు.. దీనికి ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం వనపర్తి జిల్లాలో స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

వనపర్తి మండలంలో స్థలం పరిశీలన
రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరుకు వనపర్తి జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే వనపర్తి మండలంలోని పెద్దగూడెం, సవాయిగూడెం, కిష్టగిరి గ్రామాల శివార్లలో భూములను గుర్తించారు. సవాయిగూడెంలోని సర్వే నంబరు 85లో 227 ఎకరాలు, సర్వే నంబరు 220లో 477 ఎకరాల ప్రభుత్వ భూములను సర్వే చేసి హద్దు రాళ్లను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల ఎర్రరంగు జెండాలను నాటారు. ఇవి పూర్తిగా ప్రభుత్వ, అటవీ భూములే అని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.

సర్వే 220 కబ్జాలో గిరిజన కుటుంబాలు
సర్వే నంబర్‌ 220లోని సుమారు 150 ఎకరాల భూమిలో కిష్టగిరికి చెందిన 164 గిరిజన కుటుంబాలు కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నాయి. వీరిలో చాలామంది ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడి నివసిస్తున్నవారు ఉన్నారు. 2008 గిరిజన హక్కుల చట్టం ప్రకారం సాగు చేసుకుంటున్న కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలని పలుమార్లు తండావాసులు అధికారులను కోరారు. ఇటీవల వనపర్తి కలెక్టర్‌ శ్వేతామహంతిని కూడా కలసి  పట్టాలు ఇవ్వాలని విన్నవించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇదే భూమిని నమ్ముకుని ఉన్నామని తమకు ఎలాంటి సమాచారం లేకుండా భూములు తీసుకోవడం దారుణమని వారు వాపోయారు.

నష్టపోనున్న పలువురు రైతులు
సర్వే నంబరు 220 చుట్టు సర్వే నంబరు 217, 218, 221, 223లలో కిష్టగిరికి చెందిన పలువురు గిరిజనులకు చెందిన 40 ఎకరాల పట్టా భూమి ఉంది. రైతులు పొలంలోకి వెళ్లాలంటే ఫైరింగ్‌ రేంజ్‌ స్థలాన్ని దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఫైరింగ్‌ రేంజ్‌ నిర్మాణం పూర్తయ్యాక అందులోకి ఇతరులకు ప్రవేశం లేకపోవడంతో, తమ భూములను కోల్పోవాల్సి వస్తుందని చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే పశువుల మేతకు కూడా ఇబ్బందులు తప్పవని వారు వాపోతున్నారు.


అన్నివిధాలా అనుకూలమనే భావన
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రక్షణశాఖ ఆధ్వర్యంలో ఫైరింగ్‌ రేంజ్‌ను ఏర్పాటు చేస్తారని వార్తలు రాగానే అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకతలు రావడంతో అధికారులు వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలం అని భావించిన అధికారులు రక్షణశాఖ అధికారులకు ఈ స్థలాన్ని చూపించినట్లు సమాచారం. ఇది వనపర్తి పట్టణానికి 8 కిలోమీటర్ల దూరం, జాతీయ రహదారికి 10 కిలోమీటర్లు ఉండటం, చుట్టూ కొండలు ఉండడంతో రక్షణశాఖ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది.

పరిశ్రమ వస్తే బాగుండు
ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌ వస్తున్న విషయం మాకు ఈ రోజే తెలిసింది. అధికారులు ప్రజల అభిప్రాయం కూడా తీసుకోలేదు. చుట్టుపక్కల గ్రామాల ప్రజ లకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఫైరింగ్‌ రేంజ్‌కు బదులుగా ఏదైన పరిశ్రమ వస్తే కనీసం కూలీ పని అయినా దొరికేది. ఫైరింగ్‌ రేంజ్‌తో మాకే ప్రయోజనం ఉండదు.
    – సాకె చిన్నారెడ్డి, సవాయిగూడెం

మేం ఒప్పుకోం
సర్వే నంబర్‌ 220లో మా తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాం. చాలామంది కుటుంబాలు ఇప్పటికీ వీటిపైనే ఆధారపడి ఉన్నాయి. దీనికి చుట్టు పక్కన ఉన్న మా పొలాలకు పోవాలంటే ఫైరింగ్‌ రేంజ్‌ దాటి పోవాల్సి వస్తది. ఫైరింగ్‌ రేంజ్‌ ఏర్పాటు చేయడాన్ని మేము ఒప్పుకోం. దీనిపై ఎంతటి పోరాటానికైనా సిద్ధం.
    – శంకర్‌నాయక్, కిష్టగిరి

ప్రజలకు ఇబ్బందులు ఉండవు
వనపర్తి మండలంలో 704 ఎకరాల ప్రభుత్వ, అటవీ శాఖ స్థలాన్ని రక్షణశాఖ కోసం గుర్తించిన విషయం నిజమే. రక్షణ శాఖ అధికారులు వచ్చి స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. ఇంకా ఏ నిర్ణయం వెల్లడించలేదు. దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఈ విషయమై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు.
    – చంద్రారెడ్డి, ఆర్డీవో, వనపర్తి


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

అత్యున్నత విద్యావేదికగా రెడ్డి హాస్టల్‌

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC