ఏపీ సర్కార్ ‘కోల్’మాల్

ఏపీ సర్కార్ ‘కోల్’మాల్


♦ విదేశీ బొగ్గు సరఫరాలో ఖజానాకు రూ.500 కోట్ల నష్టం

♦ అంతర్జాతీయంగా బొగ్గు ధర తగ్గినా పాత ధరే చెల్లింపు

♦ అవసరం లేకున్నా భారీగా బొగ్గు దిగుమతులు

♦ ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు


 

 సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఏపీజెన్‌కో)కు విదేశీ బొగ్గు వ్యవహారంలో భారీ కొనుగోల్‌మాల్ జరిగినట్టు తెలుస్తోంది. ఆరు నెలలకు టెండర్లు పిలిచి రెండేళ్లపాటు భారీ స్థాయిలో బొగ్గు దిగుమతి చేసుకోవడతో ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.500 కోట్లు నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఓ రెండు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ముందుపెట్టి ప్రభుత్వ పెద్దలు కథ నడిపిస్తుంటే, అధికారులు వారికి చేయూతనిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జెన్‌కో ఆధ్వర్యంలోని థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు 70 శాతం స్వదేశీ బొగ్గును, 30 శాతం విదేశీ బొగ్గును వాడతారు.



విదేశీ బొగ్గును సరఫరా చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఓపెన్ టెండర్ల ద్వారా దక్కించుకుంటాయి. విదేశీ బొగ్గు సరఫరా కోసం 2013 జూన్ 28న పిలిచిన టెండర్లను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పీఈసీ లిమిటెడ్ (న్యూఢిల్లీ), ఎంఎస్‌టీసీ లిమిటెడ్ (కోల్‌కతా) చేజిక్కించుకున్నాయి. ఆ మేరకు విజయవాడలోని థర్మల్ కేంద్రాలకు టన్ను రూ. 4,970 చొప్పున ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు, ముద్దనూరు ఆర్టీపీపీకి మెట్రిక్ టన్ను రూ. 5,150 చొప్పున నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును సరఫరా చేయాలి. ఈ కాంట్రాక్టు గడువు 2013 డిసెంబర్‌తో ముగిసింది.



నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి, ఎవరు తక్కువ ధరకు సరఫరాచేస్తే వారికే కాంట్రాక్టు ఇవ్వాలి. కానీ ఏపీ జెన్‌కో ఈ ప్రక్రియను ముందుకు సాగనివ్వలేదు. 2013 డిసెంబర్ 20 నుంచి ఏడుసార్లు టెండర్లు పిలిచి, ఆ తర్వాత రద్దు చేసేసింది. 2014 ఏప్రిల్ 22వ తేదీన మరోసారి టెండర్లు పిలిచినా... ఏపీ జెన్‌కో పెట్టిన సవాలక్ష నిబంధనలవల్ల ఎవరూ అర్హత పొందలేదు. ఈ నేపథ్యంలో 2014 ఆగస్టు 25న మరోసారి 3.4 మెట్రిక్ టన్నులకు టెండర్లు పిలిచింది. ఎంఎస్‌టీసి ఒక్కటే టెండర్ వేయడంతో దీన్నీ రద్దు చేశారు.



ఈ సంస్థల్లోని వ్యక్తులు ప్రభుత్వ పెద్దల అక్రమాలకు అన్నివిధాలుగా సహకరిస్తున్నందువల్ల... ఇప్పటివరకూ సరఫరా చేస్తున్న సంస్థలు మాత్రమే అర్హత పొందేలా, ఇతర సంస్థలేవీ అర్హత సాధించకుండా ఉండేలా నిబంధనలు పొందుపరిచినట్లు తెలుస్తోం ది. ఇలా వివిధ కారణాలతో టెండర్లు ఖరారు చేయకుండా.. 2013లో టెండర్లు దక్కించుకున్న ఎంఎంటీసీ, పీఈసీ లిమిటెడ్ సంస్థలు పాత ధరలకే బొగ్గు దిగుమతి చేసేందుకు మార్గం సుగమం చేశారు.



 బొగ్గు ధర తగ్గినా పాత రేటుకే సరఫరా

 2013లో అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధర టన్ను 69.15 డాలర్లుగా ఉంది. ఇది 2015 నాటికి 52.40 డాలర్లకు తగ్గింది. అయినప్పటికీ ఏపీ జెన్‌కో టన్నుకు 69.15 డాలర్లు చెల్లించడంలో ఆంతర్యం ఏమిటనేది అర్థం కాని విషయం. పైగా 2013 ఒప్పందం ప్రకారం 12 లక్షల టన్నులు సరఫరా చేయగా.. కాంట్రాక్టు గడువు పొడిగించిన తర్వాత 19.5 లక్షల టన్నులు దిగుమతి చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సమయంలో స్వదేశీ బొగ్గు సమృద్ధిగా లభిస్తోంది. ఏపీ జెన్‌కో విద్యుత్ సంస్థలు పూర్తిస్థాయిలో పనిచేయడంలేదు. అయినా పెద్ద మొత్తంలో విదేశీ బొగ్గు దిగుమతి చేసుకోవడం ఆర్థిక ప్రయోజనాల కోసమేనని స్పష్టమవుతోంది.



2013తో పోలిస్తే ఏపీ జెన్‌కో 165 శాతం విదేశీ బొగ్గు కోసం వెచ్చించినట్టు కన్పిస్తోంది. దీని విలువ రూ. 1,100 కోట్లని లెక్కగట్టారు. కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత 10 లక్షల టన్నులు అవసరంకాగా 20 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నారు. ఫలితంగా రూ. 200 కోట్లు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. టెండర్లను ఖరారు చేసి, వాస్తవ వినియోగం ప్రకారం బొగ్గును దిగుమతి చేసుకుని ఉంటే... సుమారు రూ. 500 కోట్ల మేర ఖర్చు తగ్గేదని నిపుణులు చెబుతున్నారు.



 అడ్డగోలుగా హ్యాండ్లింగ్ ఛార్జీలు

 విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న బొగ్గును ఓడరేవులనుంచి థర్మల్ ప్రాజెక్టులకు చేర్చినందుకు ఏపీ జెన్‌కో కొంతమొత్తం చెల్లిస్తుంది. బొగ్గు సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సరుకు రవాణాకు సబ్‌కాంట్రాక్టర్లను టెండర్ల ద్వారా ఎంపిక చేస్తాయి. అలా ఎంపికైన అదానీ, మహేశ్వరి కోల్ కంపెనీలు మొత్తం 12 లక్షల మెట్రిక్ టన్నులను రవాణా చేశాయి. అయితే కృష్ణపట్నం పోర్టుకు, థర్మల్ ప్రాజెక్టుకు దూరం కేవలం ఏడు కిలోమీటర్లే. కాబట్టి ఎలాంటి హ్యాండ్లింగ్ ఛార్జీలు దీనికి వర్తించవనే నిబంధనలున్నాయి. కానీ ఏపీ జెన్‌కో ఉదారంగా హ్యాండ్లింగ్ ఛార్జీలకింద రూ. 100 కోట్లు చెల్లించి వారికి లబ్ధి చేకూర్చిందన్న ఆరోపణలున్నాయి.



 టెండర్లు రద్దు చేశాం: జెన్‌కో వర్గాలు

 ఇప్పటివరకూ గడువు పొడిగిస్తూ వచ్చిన సంస్థల టెండర్లు రద్దు చేస్తూ ఏపీ జెన్‌కో బోర్డు సోమవారం నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. అర్హతగల సంస్థలు ముందుకు రాకపోవడంవల్లే ఇంతకాలం టెండర్లు పిలవలేదని పేర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధర తగ్గినప్పటికీ, డాలర్ విలువ పెరిగిందనీ, దీంతోపాటు రైల్వే రవాణా ఛార్జీలు పెరిగాయని తెలిపాయి. ఈ నేపథ్యంలో సరఫరా చేస్తున్న విదేశీబొగ్గుకు చెల్లించే మొత్తం ఒక్కపైసా కూడా ఎక్కువ ఉండదని పేర్కొన్నాయి.

 

69.15 డాలర్లు: 2013లో అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను బొగ్గు ధర

12 లక్షల టన్నులు: టెండర్ల ప్రకారం సరఫరా చేయాల్సిన విదేశీ బొగ్గు

52.40 డాలర్లు: 2015లో అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను బొగ్గు ధర

19.5 లక్షల టన్నులు: గడువు తర్వాత సరఫరా చేసిన విదేశీ బొగ్గు

1,100 కోట్లు: గడువు ముగిశాక సరఫరా చేసిన బొగ్గు విలువ

100 కోట్లు: హ్యాండ్లింగ్ ఛార్జీల పేరుతో చెల్లించింది

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top