ఇక్కడా అన్యాయమే!


  • ఉమ్మడి పాలనలో తెలంగాణ రోడ్లను మోటబుల్‌గా చూపిన వైనం

  • ఫలితంగా ఇప్పటికీ కేంద్రం నుంచి రాని పీఎంజీఎస్‌వై నిధులు

  • తాజా సర్వేలో 14,884 కి.మీ.ల అన్‌మోటబుల్ రోడ్లను గుర్తించిన ప్రభుత్వం

  • సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల్లోనే కాదు.. రహదారుల నిర్మాణంలోనూ సమైక్య పాలనలో తెలంగాణకు అన్యాయమే జరిగిందని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. గతంలో పనిచేసిన అధికారుల పక్షపాత వైఖరి ఫలితంగా.. ఈ ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అందకుండా పోయాయని లెక్కతేల్చింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) కింద ఏటా గ్రామీణ రహదారుల నిర్మాణం నిమిత్తం ప్రతి రాష్ట్రానికి నిధుల కేటాయింపు ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ రహదారుల్లో మోటారు వాహనాలు తిరిగేందుకు వీలుకాని మట్టి రోడ్లను వాహన యోగ్యం (మోటబుల్)గా మార్చేందుకు మాత్రమే ఈ నిధులు మంజూరు చేస్తారు.

     

    అయితే, ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతంలోని రోడ్లన్నీ వాహనాలు తిరిగేందుకు వీలైనవే (మోటబుల్)నంటూ గతంలో ఉన్నతాధికారులు, పాలకులు నివేదికలు ఇవ్వటంతో తెలంగాణకు పీఎంజీఎస్‌వై నిధులను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని ఉన్నతాధికారులు చెప్పారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక చేసిన సర్వేలో ఈ అన్యాయం వెలుగులోకి వచ్చిందని వారు వివరించారు.

     

    తరలిపోయిన‘పీఎంజీఎస్‌వై’ నిధులు

     

    ఏటా ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లోని రహదారులనే వాహనాలు తిరిగేందుకు యోగ్యం కానివి(అన్ మోటబుల్)గా చూపడంతో, కేంద్రం నుంచి వచ్చే పీఎంజీఎస్‌వై నిధుల్లో అధికమొత్తం ఆయా ప్రాంతాలకే తరలిపోయాయన్నది కాదనలేని నిజం. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రహదారుల సర్వేలో తెలంగాణలోని గ్రామీణ రహదారుల్లో ఇంకా 14,884 కిలోమీటర్ల మేర అన్‌మోటబుల్ రోడ్లు ఉన్నాయని అధికారులు తేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 22,210 రహదారులు 64,044 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి.



    ఇందులో 1,896 కిలోమీటర్ల మేర ఇతర జిల్లాల రహదారులు, 1,425 కిలోమీటర్లు మండల రహదారులు కాగా, 60,723 కిలోమీటర్ల గ్రామీణ రహదారులున్నట్లు సర్వేలో తేల్చారు. ఆయా రహదారుల్లో 1,717 కిలోమీటర్లు సీసీ రోడ్లు, 18,564 కిలోమీటర్లు తారు రోడ్లు, 14,146 కిలోమీటర్లు కంకర(మెటల్) రోడ్లుగా పేర్కొన్నారు. కంకరలేని మట్టి రోడ్లలో వాహనాలు తిరిగేందుకు వీలైన రహదారులు 14,734 కిలోమీటర్లు ఉండగా, వాహనాలు తిరిగేందుకు యోగ్యం కాని రోడ్లు 14,884 కిలోమీటర్లు ఉన్నట్లు గుర్తించారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top