ఏపీ మరో పేచీ!

ఏపీ మరో పేచీ! - Sakshi


కృష్ణా నీటి వాడకంపై ఉమ్మడి రాష్ట్రంలోని 69, 107 జీవోలే ప్రామాణికమంటూ కొత్త వాదన

ఇదే పద్ధతి అనుసరించాలని బజాజ్‌ కమిటీకి వినతి

అలాగైతే ఏపీ అవసరాలు తీరాకే తెలంగాణకు నీరు

తెలంగాణకు కేటాయించిన నీటిని వాడకుండా కట్టడి చేసే వ్యూహం




సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణ మార్గదర్శకాల(ఆపరేషన్‌ రూల్స్‌)పై ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ మెలిక పెడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోల ప్రకారమే ప్రాజెక్టుల నిర్వహణ జరగాలంటూ కొత్త వాదన చేస్తోంది. ఇలా చేస్తే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇప్పటికే పదేపదే కేంద్రం, బోర్డుల ముందు తెలంగాణ చెబుతూ వస్తోంది. అయితే అవేమీ పట్టకుండా ఏకే బజాజ్‌ కమిటీకి ఏపీ ఇదే వాదన వినిపిస్తోంది. దీని ద్వారా రాష్ట్రానికి కేటాయించిన 299 టీఎంసీల వాటాలో గండి పెట్టాలనే యోచనలో ఉంది.



జీవో 69తో నష్టమిలా..

ఉమ్మడి ఏపీలో 1996లో జీవో 69 జారీ చేశారు. ఈ జీవో ప్రకారం శ్రీశైలంలో కనీస నీటి మట్టాన్ని 854 అడుగుల నుంచి 834 అడుగులకు కుదించారు. ఇదే జీవోలో ఆపరేషన్‌ టేబుల్‌ ఎలా ఉండాలో వివరించారు. దీని ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్‌ నీటిమట్టం 875 అడుగులపైన ఉన్నప్పుడు చెన్నై తాగునీటికి జూలై, అక్టోబర్‌ మధ్య నెలకు 3.75 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. ఇలా 15 టీఎంసీలు విడుదల చేయాలన్న నిబంధన కేవలం తెలుగుగంగ ద్వారా నీటిని తరలించుకునేందుకే అని తెలంగాణ మొదట్నుంచీ చెబుతోంది. ఇదే సమయంలో సాగర్‌ కింద సాగునీటి అవసరాల ప్రకారమే నీటిని విడుదల చేయాలని, సాగర్‌లో సరిపోనూ నీరుంటే శ్రీశైలం నుంచి విడుదల చేయాల్సిన అవసరం లేదని జీవో చెబుతోంది.


అంటే సాగర్‌కు వాటాల మేరకు నీటిని విడుదల చేయకుండా.. శ్రీశైలం నీటిని మాత్రం ఏపీ 834 అడుగుల వరకు వాడుకునే వెసులు బాటు ఉంటుంది. రాయలసీమకు చెందిన గోరకల్లు, అవుకు కింది ఆయకట్టుకు ఈ లెవల్‌లోనే నీటిని విడుదల చేయాలి. తెలుగుగంగకు సైతం 3 నెలల్లో 29 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. 875 నుంచి 854 అడుగుల మధ్య నీరున్న సందర్భంలో చెన్నై తాగునీరు, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి, సాగర్‌ నుంచి ప్రకాశం దిగువకు సాగు అవసరాలకు నీటి విడుదల, కుడి కాలువ, తెలుగుగంగకు నీటి విడుదల ప్రక్రియంతా పూర్తయ్యాకే తెలంగాణలోని సాగర్‌ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది.



జీవో 107 చెబుతోంది ఇదీ..

2005లో ఇచ్చిన జీవో 107లో అయితే ఏకంగా శ్రీశైలం కనీస నీటి మట్టాన్ని ఏకంగా 834 అడుగుల నుంచి 854 అడుగులకు పెంచారు. ఈ జీవో కేవలం పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకెళ్లేందుకే తెచ్చారని తెలంగాణ ఆరోపిస్తోంది. జీవో 107, 69లు కేవలం ఆంధ్రా ప్రాంతానికి మేలు చేసేలా ఉమ్మడి రాష్ట్రంలో చేసిన నిర్ణయాలని, వాటిని తెలంగాణకు వర్తింజేయలేమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రెండేళ్ల కిందటే కృష్ణా బోర్డుకు స్పష్టం చేశారు. తెలంగాణకు న్యాయం జరగాలంటే కృష్ణాలో కేటాయించిన 299 టీఎంసీల నీటి వాటాను తమ రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా వాడుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు.


అందుకు కేంద్ర జలవనరుల శాఖ సమ్మతించింది. అయితే తాజాగా ఏపీ ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ను మళ్లీ తెరపైకి తెచ్చి సాగర్, శ్రీశైలం పరిధిలో ఉన్న సాగు, తాగు అవసరాలకే పరిమితం చేసేలా వ్యూహాలు వేస్తోంది. ఇదే విధానం అమలైతే ఈ రెండు ప్రాజెక్టుల కింద తెలంగాణ గరిష్టంగా 120 టీఎంసీలకు మించి వాడుకునే అవకాశం లేదు. అయితే ఏపీ వాదనను సమర్థంగా తిప్పికొట్టేందుకు తెలంగాణ సన్నద్ధం అవుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top