రాష్ట్రానికి మరో డ్రై పోర్టు


* తాజాగా మంజూరు చేసిన కేంద్రం

* స్థలాల గుర్తింపులో జాప్యం తగదంటూ రాష్ట్రానికి హితవు

* వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అదనంగా మరో డ్రై పోర్టును కేంద్రం మంజూరు చేసింది. ఇటీవల జాతీయ రహదారుల ప్రతిపాదనలపై చర్చించేందుకు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఢిల్లీలో కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలసినపుడు ఈ విషయంలో స్పష్టత వచ్చింది. తొలుత ఒకే డ్రైపోర్టు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్న కేంద్రం ఇప్పుడు రెండింటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.



ఇప్పటికే తొలి డ్రైపోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా, ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తేల్చకపోవడంతో ఆ విషయంలో జాప్యం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి గడ్కరీ లేఖ రాసినట్లు సమాచారం. దీంతో డ్రైపోర్టుల ఏర్పాటు స్థలాలపై ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది.

 

మంత్రివర్గ సమావేశంలో ఖరారు...

డ్రైపోర్టుల ఏర్పాటుకు ఏ ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రైవేటు కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించింది. హైదారబాద్ శివార్లు, మెదక్ జిల్లాతో పాటు మరికొన్ని ప్రాంతాలను ఆ కంపెనీ పరిశీలిస్తోంది. ఇలా నాలుగైదు ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. వీటిల్లో రెండింటిని ఖరారు చేసి ప్రభుత్వం కేంద్రానికి నివేదించాల్సి ఉంటుంది. ఈ నివేదిక అందిన తర్వాత జరగబోయే కేబినెట్ సమావేశంలో వాటిని కరారు చేయనున్నారు.

 

తీరం లేకున్నా సరుకు రవాణా...

సరుకుల ఎగుమతి సాధారణంగా నౌకాశ్రయాల ద్వారా జరుగుతుంది. ఇందుకు సరుకులను తీర ప్రాంతాలకు తరలించాలి. రాష్ట్ర విభజనతో సముద్ర తీరప్రాంతం ఏపీకే పరిమితం కావడంతో తెలంగాణ ఈ విషయంలో నష్టపోతోంది. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రం.. తీర ప్రాంతాల్లేని రాష్ట్రాల్లో డ్రైపోర్టులను నిర్మించాలని నిర్ణయించింది. గతంలో గడ్కరీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దీనిపై చర్చించారు. సరుకులను ఎగుమతి చేసేవారు నేరుగా ఈ డ్రైపోర్టులకు తరలిస్తారు. నౌకల ద్వారా విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన తంతు ఇక్కడే పూర్తవుతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top