యమపాశాలు!


రైతుల జీవితాల్లో వెలుగులు పంచాల్సిన విద్యుత్ తీగలు కాలనాగులై కాటేస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు కాలం చెల్లిన కరెంట్ తీగలు ఎప్పుడు తెగి పడతాయో... విద్యుత్ స్తంభాలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. ఏటా పదుల సంఖ్యలో అన్నదాతలు కరెంట్ షాక్‌కు బలవుతున్నారు. బతుకుసాగులో రైతన్నకు అండగా నిలుస్తున్న మూగజీవాలు సైతం కరెంట్ షాక్‌తో మృత్యువాత పడుతున్నాయి.

 - మెదక్

 

 విద్యుత్ శాఖ అధికారు లు, సిబ్బంది నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలు బలిగొంటుంది. దశాబ్దాల క్రితం నాటి స్తంభాలు, వైర్లు శిథిలమై రైతులు, జనానికి కొరకరాని కొయ్యగా మారుతున్నాయి. చాలాచోట్ల కర్రలే విద్యుత్ స్తంభాలుగా మారి ప్రమాద ఘం టికలను మోగిస్తున్నాయి. ఇదిలావుంటే వేలాది రూపాయల్లో జీతాలు తీసుకుంటున్న కొంతమంది విద్యుత్ ఉద్యోగులు వారు చేయాల్సిన పనిని బయటి వారికి అప్పగిస్తూ చేతులు దులుపుకొంటున్నారు. దీంతో వచ్చిరాని పనితనంతో విద్యుత్ మరమ్మతులు చేస్తూ కొంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

 కర్రలే స్తంభాలుగా...

 ఔరంగాబాద్, శమ్నాపూర్, రాయిన్‌పల్లి, పాతూర్‌తోపాటు అనేక గ్రామాల్లో  అదనపు స్తంభాల కోసం డీడీలు చెల్లించి ట్రాన్స్‌కో కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ కరెంట్ కనెక్షన్ల నిమిత్తం బోరు బావి వద్దకు విద్యుత్ పోల్ వేయాల్సిన అధికారు లు.. నిర్లక్ష్యం చేస్తుండటంతో కర్రలనే ఆధారంగా చేసుకొని రైతులు కరెంట్ తీగలు వేసుకుంటున్నా రు. ఈ క్రమంలో ఈదురు గాలులు వీచినా, భారీ వర్షాలు పడ్డా... ఆ కర్రలు నేల వాలుతున్నాయి. కరెంట్ తీగలు తెగిపోతున్నాయి.  వెనుకాముందు చూడని రైతులు ఆ తీగలకు బలవుతున్నారు.

 

 మోగుతున్న ప్రమాద ఘంటికలు...

 గ్రామాల్లో సుమారు 40 ఏళ్ల క్రితం వేసిన విద్యుత్ వైర్లు, స్తంభాలు శిథిలమై ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల ఎర్తింగ్ ఏర్పాటు చేయక పోవడం, ఏ-బీ స్విచ్‌లు అమర్చకపోవడం, విద్యుత్ లైన్ కింద పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించక పోవడంతో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.ట్రాన్స్‌కోకు చెందిన లైన్ ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మెన్లు తాము చేయాల్సిన పనులను బయటివారికి అప్పగిస్తున్నారు. పదో పరకో చేతపెట్టి యువకులతో విద్యుత్ పనులు చేయిస్తున్నారు. దీంతో అనుభవం లేని ఆ యువకులు కరెంట్ కాటుకు బలవుతున్నారు.

 

 చోటుచేసుకున్న పలు ఘటనలు...

     అందోల్ మండలం సాయిబాన్‌పేటలో శుక్రవారం రాములు(35) అనే రైతు నేలవాలిన విద్యుత్ తీగలకు బలయ్యాడు.

 

     ఇటీవల మెదక్ మండలం శమ్నాపూర్‌కు చెందిన మైలి పోచయ్య తన వ్యవసాయ పొలంలో కర్రల ఆధారంగా వేసిన విద్యుత్ వైర్లు తెగిపడగా మరమ్మతులు చేయబోయి విద్యుత్ షాక్‌కు గురై తీవ్రగాయాల పాలయ్యాడు.  

 

     మే 20న పాపన్నపేట మండలం కొడుపాకలో మంగళి శివరాం(35) అనే వ్యక్తి తెగిపడ్డ విద్యుత్ తీగలకు బలయ్యాడు. ఇదే గ్రామంలో అంతకుముందు మంగళి రాములు, తమ్మలి ప్రతాప్, కుర్మ బీరయ్య, సందిల రాములు విద్యుత్ షాక్‌తోనే మృత్యువాత పడ్డారు.

 

     మెదక్ మండలం వెంకటాపూర్‌కు చెందిన బొమ్మర్తి కిష్టయ్య(50), పాపన్నపేట మండలం గాజులగూడెంలో గంజి హన్మంతు(25) విద్యుత్ ప్రమాదానికి బలయ్యారు.

 

     గతంలో పాపన్నపేట మండలం చిత్రియాల్‌లో పుట్టి యాదమ్మ, ఎల్లాపూర్‌లో పుట్టి నర్సింలు, శానాయిపల్లిలో జిన్న ఏసయ్య, జిన్న వెంకయ్యలు కరెంట్ కాటుకు కన్నుమూశారు.

 

     ఇటీవల దౌల్తాబాద్ మండలం ముత్యంపేటలో ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ వైర్లు సంపత్ అనే మూగబాలుడికి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

 

     రైతులతోపాటు వ్యవసాయంలో వారికి చేదోడు వాదోడుగా ఉండే మూగజీవాలు సైతం కరెంట్‌షాక్‌లతో మృత్యువాత పడుతున్నాయి.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top