మనది మిషన్ 2019

మనది మిషన్ 2019 - Sakshi


ఐదేళ్లలో అధికారం దక్కాలి

 తెలంగాణ బీజేపీ గ్రామస్థాయి అధ్యక్షులకు అమిత్ షా పిలుపు


 

 సాక్షి, హైదరాబాద్: ‘‘కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలనేది బీజేపీ నినాదం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి నరేంద్రమోడీ ప్రధానమంత్రి కావటంతో అది నెరవేరినట్టు కాదు. అది పూర్తి కావాలంటే బీజేపీ యుక్త్ భారత్ రావాలి. అంటే ఇప్పుడు బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా మన జెండా ఎగరాలి. కేంద్రంలో పాలనా పగ్గాలు చేపట్టడం ద్వారా ఆ నినాదానికి తగ్గ కార్యాచరణ ఇప్పుడు మొదలైందని అర్థం చేసుకోవాలి. అందులో కీలకమైంది తెలంగాణ. మిషన్ 2019 దిశగా ఇక్కడి ప్రతి కార్యకర్తా పనిచేయాలి. ఐదేళ్లలో పార్టీ గతి మారి అధికారపీఠం దక్కించుకోవాలి’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. పార్టీ గ్రామస్థాయి కమిటీల అధ్యక్షులకు పిలుపునిచ్చారు. రెండు రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారమిక్కడి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ గ్రామస్థాయి అధ్యక్షులు, బూత్‌స్థాయి నేతలతో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు రావడంతో స్టేడియం కిక్కిరిసిపోయింది. నేతల నినాదాలు హోరెత్తటంతో ఆ ప్రాంగణం కన్నుల పండువగా ఉందంటూ అమిత్ షా ఉత్సాహంగా ప్రసగించారు.



‘‘ఇటీవలి ఎన్నికల ఫలితాల సరళి తెలుసుకుంటున్న క్రమంలో 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో 73 సీట్లు గెలిచామని, సొంతంగా అధికారాన్ని చేపట్టే సంఖ్యలో సీట్లు బీజేపీకి వచ్చాయన్న సంగతులు తెలిసి సంతోషపడ్డాను. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో 23 శాతం ఓట్లను బీజేపీ సాధించిందనే విషయం మరింత ఉత్సాహాన్నిచ్చింది. అన్ని పార్టీల కంటే ముందుగా తెలంగాణ కోసం తీర్మానం చేసి రాష్ట్ర సాధన కు తీవ్రంగా కృషి చేసిన బీజేపీ ఆ ఎన్నికల్లో అంతమేర ఓట్లు సాధించటం సంతోషంగా అనిపించింది. ఇక్కడ పార్టీ అధికారంలోకి రావటం సాధ్యమనే సంకేతాలకు అది నిదర్శనం. వచ్చే ఐదేళ్లలో బూత్‌స్థాయి కార్యకర్తలు తలచుకుంటే అనుకున్నది సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే ప్రజాపక్షాన నిలిచి, వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేయండి’’ అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేనప్పుడు ఆ పనులెలా సాధ్యమనే అనుమానం వస్తుందని, కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, ప్రధానమంత్రి నరేంద్రమోడీ మనకు అండగా ఉంటారనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేసిందని, టీఆర్‌ఎస్ సహా ఇతర పార్టీలేవీ దాన్ని కోరకున్నా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రాసిన లేఖకు స్పందించి కేంద్రం దాన్ని మంజూరు చేసిందని పేర్కొన్నారు. అలాగే మంజూరు చేసిన ఏకైక ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని, ట్రైబల్ విశ్వవిద్యాలయాన్ని కూడా తెలంగాణకు కేటాయించారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల ప్రతి ఆకాంక్షను నెరవేర్చేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని స్పష్టంచేశారు. దీన్ని గుర్తించి కార్యకర్తలు పార్టీని గ్రామగ్రామానికి తీసుకెళ్లటమే కాకుండా బూత్ స్థాయిలో పార్టీ జెండా ఎగిరేలా చేయాలని సూచించారు.

 

 న వంబర్ ఒకటి నుంచి సభ్యత్వ నమోదు...

 

 ‘‘తెలంగాణలో బీజేపీకి కొత్త రక్తం కావాలి. ముఖ్యంగా యువకులు పార్టీలో చేరాల్సి ఉంది. దీన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని స్థానిక నేతలు పనిచేయాలి. నవంబర్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. ఆ సమయంలో బడులు, కళాశాలలకు కూడా పార్టీ నేతలు వెళ్లాలి’’ అని అమిత్ షా ఆదేశించారు. బూత్ స్థాయిలో పార్టీ బలపడటమంటే నరేంద్రమోడీని మరింత పటిష్టపరచటమనే విషయాన్ని ప్రతి కార్యకర్త గుర్తించాలని పేర్కొన్నారు. తెలంగాణలో  కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు సమైక్యంగా పనిచేసి పార్టీని అధికారం దిశగా నడిపించాలని, ఆ పని వెంటనే మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు.

 

 అభివృద్ధిపై మోడీకి స్పష్టమైన అవగాహన..

 

 ఏం చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందో స్పష్టమైన అవగాహనతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముందుకు సాగుతున్నారని షా తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై బుల్లెట్ ప్రూఫ్ రక్షణ లేకుండా మాట్లాడిన తొలి ప్రధాన మోడీ అని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి అవసరమైన రోడ్‌మ్యాప్‌ను అక్కడి నుంచే ప్రకటించిన ప్రధాని కూడా ఆయనేనన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని పనిచేస్తున్నారని, యూపీఏ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి అధికారాన్ని అప్పగించినా ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా మోడీ సర్కారు తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలసి ముందుకు సాగుతూ తెలుగువారి అభివృద్ధికి ప్రయత్నించాలని ఆకాంక్షించారు.

 

 బిజీబిజీగా బీజేపీ అధ్యక్షుడు

 

 తెలంగాణలో పార్టీకి దిశానిర్దేశం చేయటానికి వచ్చిన అమిత్ షా.. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, వివిధ రంగాలకు చెందిన మేధావులు, కులసంఘాలతో బిజీబిజీగా గడిపారు. రెండు రోజుల నగర పర్యటనలో తొలుత  పార్టీ కార్యక్రమాలకే సమయం కేటాయిస్తూ పార్టీ వర్గాలు షెడ్యూల్ రూపొందించాయి. కానీ వివిధ సంఘాల ప్రతినిధులు అపాయింట్‌మెంట్లు కోరడంతో చివరకు పార్టీ నేతలతో ఆయన ఎక్కువ సేపు గడిపే వీల్లేకపోయింది. రెండు రోజుల షా పర్యటన ఆసాంతం హడావుడిగా సాగింది.

 

 విభజన కష్టాల పరిష్కారానికి సహకరించండి

 

 అమిత్‌షాకు చంద్రబాబు వినతి

 

 విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సహకరించాల్సిందిగా సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కోరారు. షా శుక్రవారం చంద్రబాబు తన నివాసంలో ఇచ్చిన అల్పాహార విందుకు హాజరయ్యారు.  బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డిలతో పాటు టీడీపీ నేతలు ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకరరావు, కంభంపాటి రామ్మోహనరావు, సుజనాచౌదరి, పరకాల ప్రభాకర్ తదితరులు కూడా పాల్గొన్నారు. విభ జన అనంతరం రాష్ట్రం పలు సమస్యలు ఎదుర్కొంటోందని, వాటిని ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి తగిన సాయం అందేలా అధికార పార్టీ అధ్యక్షుడిగా చొరవ తీసుకోవాల్సిందిగా షాను చంద్రబాబు కోరారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top