నగరం గులాబీమయం

ముస్తాబవుతున్న సభా ప్రాంగణం


సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ హోదాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి హైదరాబాద్ నగరం గులాబీమయంగా మారుతోంది. ఈ నెల 24న ప్లీనరీ, 27న బహిరంగ సభ ఉండడంతో రాష్ట్ర రాజధానిలో ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, హోర్డింగులు, సీఎం కేసీఆర్ నిలువెత్తు కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో ప్లీనరీ కోసం జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం మంత్రులు కేటీఆర్, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పరిశీలించారు. పార్టీ నాయకత్వం ఏర్పాటుచేసిన 7 కమిటీలు ఆయా బాధ్యతల్లో మునిగిపోయాయి.



ఇవీ...ఏర్పాట్లు

ప్లీనరీ జరిగే ఎల్‌బీ స్టేడియంలో భారీస్టేజీని ఏర్పాటుచేశారు. నియోజకవర్గానికి 300 మంది చొప్పున 36 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జులు వీరిని సమన్వయపరుస్తారు. ప్రతి ప్రతినిధికి ప్లీనరీ తీర్మానాలతోపాటు, ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాల సమాచారంతో కూడిన కిట్లను అందజేయనున్నారు. ప్రతినిధుల సీటింగ్‌కు ఇబ్బంది లేకుండా బ్లాకులుగా విభజించారు. రెండు వీఐపీ గ్యాలరీలు, మహిళల కోసం ఒక భారీ గ్యాలరీ, మీడియా గ్యాలరీలను ఏర్పాటు చేశారు.

భాగ్యనగరానికి గులాబీ అలంకరణ: ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌ను గులాబీమయం చేయాలని టీఆర్‌ఎస్ నాయకత్వం నిర్ణయించింది. అలంకరణ కమిటీ చైర్మన్ కేటీఆర్ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్లీనరీ జరిగే ఎల్బీ స్టేడియాన్ని భారీ జెండాలు, తోరణాలతో అలంకరించారు. జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధుల వాహనాల కోసం ఎన్‌టీఆర్ గార్డెన్స్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్స్ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పిస్తారు.



అధ్యక్షుని ప్రకటన జరగ్గానే టీఆర్‌ఎస్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీఎం కేసీఆర్ పేరును ప్లీనరీలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఆయన పేరును ప్రకటించగానే టపాకాయలు పేలుస్తారు. ఇందుకోసం శివకాశి నుంచి ప్రత్యేక నిపుణులను రప్పించారు. అదే మాదిరిగా ప్రతినిధులు అందరిపైనా గులాబీ పూల వర్షం కురిపించేలా బ్లోయర్లనూ ఏర్పాటుచేస్తున్నారు. ఈ నెల 27న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభకు జిల్లాకు లక్ష మంది చొప్పున ఏకంగా పది లక్షల మందిని సమీకరించనున్నట్టు పార్టీ నాయకత్వం చెబుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top