పరిశ్రమలతోనే అందరికీ ఉపాధి

సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న జూపల్లి కృష్ణారావు


 పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జూపల్లి కృష్ణారావు

 వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడి


 

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పరిశ్రమల స్థాపన ద్వారా ఇంటింటికీ ఉపాధి కల్పిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ కొత్త మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. యువతతో పాటు మహిళలు, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరే పరిశ్రమలను విస్తరించే వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు. గురువారం సచివాలయంలో ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. వాణిజ్య పంటలు పండించే రైతులకు అదనపు లాభాలు తెచ్చిపెట్టే పరిశ్రమలు నెలకొల్పుతామని చెప్పారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యలను అధిగమించేందుకు ఈ వ్యూహం దోహదపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వాలు మహిళా సంఘాలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని.. అయితే మహిళల ఆర్థిక శక్తిని పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఎంతో నైపుణ్యం ఉందని.. చేనేత ఉత్పత్తులకు డిమాండ్ పెంచితే కార్మికులకు మేలు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

 

  చేనేత ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేసే బాధ్యతను చేనేత రంగానికి అప్పగించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. దీంతో చేనేత కార్మికుల ఆత్మహత్యలను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చెరకు రైతులకు లాభాలు రావటం లేదని.. ఈ దృష్ట్యా వారిని ఆదుకునేందుకు చక్కెర ఫ్యాక్టరీలను బలోపేతం చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని మంత్రి అన్నారు. మంత్రులు ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి సవ్యసాచిఘోష్ జూపల్లికి అభినందనలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top