అందరికీ మేలు చేసిన నాయకుడు వైఎస్


  • నల్లగొండ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల

  • ఐదో రోజు ఆరు కుటుంబాలకు పరామర్శ

  • తెలంగాణ తల్లి విగ్రహానికిపూలమాల వేసిన షర్మిల

  • సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘తన, పర భేదం లేకుండా.. ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అని చూడకుండా ప్రతి వర్గానికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మేలు చేశారు. తెలుగు ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసుకున్నారు.. ప్రతి పేదవాడినీ మనస్ఫూర్తిగా గౌరవించారు. అందుకే ఆయన రాజన్న అయ్యారు.. ఇన్నాళ్ల తర్వాత కూడా కోట్లాది మంది ప్రజలు వైఎస్‌ను తమ గుండెల్లో పెట్టుకున్నారంటే కారణం అదే..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పేర్కొన్నారు.



    ఐదోరోజు పరామర్శయాత్రలో భాగంగా ఆమె ఆదివారం నల్లగొండ జిల్లా కోదాడ నియోజకవర్గంలో పర్యటించారు. ఆ నియోజకవర్గ పరిధిలోని ఆరు కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ కుటుంబం వారికి అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. యాత్ర మార్గమధ్యంలో చిలుకూరు, బేత వోలు గ్రామాల్లో వైఎస్ విగ్రహానికి షర్మిల పూలమాలలు వేసి నివాళులర్పించి... అక్కడికి భారీ సంఖ్యలో వచ్చిన గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు.  

     

    ఐదేళ్లలోనే ఎన్నో పథకాలు: వైఎస్సార్ అందరి గుండెల్లో బతికే ఉన్నాడని, ఆయనకు మరణం లేదని షర్మిల పేర్కొన్నారు. రాజన్న చేసిన మంచి పనులు, ఆయన మంచి మనసు కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయాయని.. అధికారంలో ఉన్న ఐదేళ్లలోనే ప్రతి ఒక్కరి మనసు గెలుచుకున్నారని ఆమె చెప్పారు. ‘‘మహిళలు, రైతులు, విద్యార్థులు, పేదలందరికీ మేలు చేసే కార్యక్రమాలు వైఎస్ చేపట్టారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో అద్భుత పథకాలను అమలుచేసి చూపించారు. ఇన్ని చేసినా ఏ ఒక్కరోజూ ఎలాంటి పన్నులు, చార్జీలు పెంచలేదు. ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు, ఆర్టీసీ చార్జీ పెరగలేదు. ఏ పన్ను పెంచినా తన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లపై భారం పడుతుందనే ఆలోచనతోనే పేదలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు.



    ఈ విషయంలో ప్రతిపక్షాలూ ఆయనను విమర్శించలేవు..’’ అని షర్మిల పేర్కొన్నారు. ప్రతి మహిళను లక్షాధికారిగా చేయాలన్న తపనతో అప్పటివరకు మహిళా సంఘాలకు రుణాలపై ఉన్న రూపాయి పావలా వడ్డీని పావలా వడ్డీకి తగ్గించారని, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడ్డారని తెలిపారు. వైఎస్ పాలనలోని అన్ని పథకాలను, రాజన్న ఆశయాలను కొనసాగించుకునేందుకు, కాపాడుకునేందుకు చేయిచేయి కలిపి ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెచ్చుకోవాలన్నారు.

     

    ఐదోరోజు ఆరు కుటుంబాలకు పరామర్శ

     

    యాత్ర ఐదోరోజైన ఆదివారం షర్మిల కోదాడ నియోజకవర్గంలోని ఆరు కుటుంబాలను కలిశారు. తొలుత కోదాడ మండలం తొగర్రాయికి వెళ్లి మందా ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత కోదాడలో సురభి శ్రీనివాస్, వల్లంశెట్ల రాంప్రసాద్ కుటుంబాలను కలిశారు. అనంతరం భోజన విరామం తీసుకున్నాక చిలుకూరు మండలం ఆచార్యులగూడెంలో అలవాల ముత్తయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. షర్మిల తమ ఇంటికి వచ్చిందన్న ఉద్వేగంతో ముత్తయ్య భార్య నాగలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత మునగాల మండలం గణపవరంలో సారెడ్డి జితేంద ర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి.. మునగాల మండలం వెంకట్రాంపురంలో మునుకుంట్ల గురవయ్య కుటుంబాన్ని కలిసి.. వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.

     

    తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల..



    పరామర్శ యాత్రలో భాగంగా కోదాడ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి షర్మిల పూలమాల వేశారు. అంతకు ముందు పలు చోట్ల ఆమె వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. షర్మిల వెంట పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, యెర్నేని వెంకటరత్నంబాబు, గున్నం నాగిరెడ్డి, శివకుమార్, నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర కార్యదర్శి ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, అధికార ప్రతినిధులు కొండా రాఘవరెడ్డి, ఆకుల మూర్తి, పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్ణారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు భీష్వ రవీందర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముస్తాబ్ అహ్మద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మెండెం జయరాజ్, కార్యదర్శి షర్మిలా సంపత్, సహాయ కార్యదర్శి ఇరుగు సునీల్, మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మామిడి శ్యాం సుందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top