అందరూ తెలంగాణ ఉద్యోగులే ఉండాలి


- ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ సుబ్బారావు

- రేపు టీఎన్జీవోస్ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం

హన్మకొండ సిటీ : గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు తెలంగాణ ఉద్యోగులే ఉండాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు అన్నారు. హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో ఇంకా ఇక్కడ సీమాంధ్ర ఉద్యోగులు పనిచేయడాన్ని సహించేది లేదన్నారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం నుంచి టీఎన్జీవోస్ యూనియన్ కీలకంగా వ్యవహరిస్తోందని, జిల్లాలో ఈ యూనియన్ కార్యక్రమాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ ఆవిర్భవించాక మొదటిసారిగా జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు గంట ముందు విధుల నుంచి వెళ్లేందుకు అనుమతించిన కలెక్టర్ కిషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

 

ఉద్యోగాలు ఫణంగా పెట్టాం..

తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ఉద్యోగులు చేసిన పోరాటం మరువలేనిదని, ప్రజల కోసం ఉద్యోగాలను సైతం ఫణంగా పెట్టి పోరాడామని టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం ఏర్పడినందున ఉద్యోగులు హక్కులు సాధించుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల సమస్యలు చర్చించి కావాల్సిన హక్కులు సాధించుకోవడానికి నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 19వ తేదీన టీఎన్జీవోస్ జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరుగుతుందన్నారు.



జిల్లాలోని ఉద్యోగులందరు ఈ సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కలెక్టర్ జి.కిషన్, టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.దేవీప్రసాద్‌రావు, కారం రవీందర్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిల్ సమావేశం కరపత్రాలను ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో టీజీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్‌రావు, టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నావీరాచారితో పాటు వెంకటేశ్వర్లు, హసనుద్దీన్, రాములు, రత్నాకర్ రెడ్డి, నరేందర్, కత్తి రమేష్, సోమయ్య, రాజేందర్, శ్రీనివాస్, మాధవరెడ్డి, వేణు, ప్రకాష్, జగదీష్, విజయలక్ష్మి పాలొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top