బంద్ ప్రభావం నామమాత్రమే


సాక్షి ప్రతినిధి, నల్లగొండ : టీడీపీ బుధవారం నిర్వహించిన జిల్లాబంద్ పాక్షికంగానే జరిగింది. పండగ వాతావరణం...ఆర్టీసీ బస్సులను మినహాయించడంతో బంద్ ప్రభావం నామమాత్రంగానే కనిపించింది. పార్టీ కార్యాలయంపై టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ ఉదయం కొద్దిసేపు జిల్లాలో టీడీపీ శ్రేణులు దుకాణాలు మూయించేందుకు ప్రయత్నించాయి. కానీ, ఆ తర్వాత పెద్దగా బంద్ చేసినట్టు కనిపించలేదు. ర్యాలీలు, ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు, అరెస్టులకు పరిమితమయ్యారు. ఇక బ్యాం కులు, సినిమా హాళ్లు కూడా యథావిధిగా నడిచాయి. మరోవైపు బంద్‌ను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు కూడా ప్రయత్నించాయి.

 

 మునుగోడు, భువనగిరి, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఓవైపు టీడీపీ బంద్ చేయిస్తుండగానే, మరోవైపు టీఆర్‌ఎస్ నేతలు దుకాణాలను తెరిపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల ఇరుపార్టీల నేతల మధ్య వాగ్వాదాలు జరిగాయి. పోలీసులు వారిని నిలువరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. టీటీడీపీకి చెందిన ముఖ్య నేతలు కొందరు హైదరాబాద్ నుంచి జిల్లాలో ప్రవేశించడం, వారిని సరిహద్దుల్లో పోలీసులు అదుపులోనికి తీసుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్.రమణ, రమేశ్‌రాథోడ్ లాంటి ముఖ్య నేతలు హైడ్రామా నడుమ జిల్లాలో ఆందోళన నిర్వహిం చాల్సి వచ్చింది. అనంతరం పోలీసు అనుమతితో జిల్లా పార్టీ కార్యాలయ పరి శీలనకు వచ్చిన టీడీపీ అగ్రనేతలు సీఎం కేసీఆర్‌పై విమర్శల వర్షం గుప్పించారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ నేతలు కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీడీపీపై దుమ్మెత్తిపోశారు.  

 

 హైడ్రామా నడుమ

 రెండు గ్రూపులుగా విడిపోయిన టీటీడీపీ నేతలు రోడ్డు మార్గంలోనే హైదరాబాద్‌నుంచి నల్లగొండకు వచ్చేం దుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిని సరిహద్దుల్లోనే నిలిపివేశారు. అయితే, రేవంత్‌రెడ్డి బృందం రైలుమార్గంలో నల్లగొండకు వస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు నల్లగొండ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. కానీ, వారు రోడ్డు మార్గంలోనే రావడంతో రంగారెడ్డి జిల్లా శివారులోని కొత్తగూడెం గ్రామం వద్ద రేవంత్‌రెడ్డి, రమేశ్‌రాథోడ్ తదితరులను అదుపులోకి తీసుకుని భూదాన్‌పోచంపల్లికి తరలించారు. ఆ తర్వాత ఎర్రబెల్లి, మోత్కుపల్లి, ఎల్.రమణల బృందాన్ని చిట్యాల వద్ద నిలిపివేశారు. ఇక్కడ టీఆర్‌ఎస్  కార్యకర్తలకు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు టీడీపీ నేతల వాహనాలపై రాళ్లు రువ్వడంతో మూడు వాహనాల అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ నేతలను తొలుత నారాయణపురం పీఎస్‌కు, ఆ తర్వాత రామన్నపేటకు తరలించారు. అక్కడినుంచి జిల్లా ఎస్పీ ప్రభాకరారావు అనుమతి మేరకు ఎర్రబెల్లి బృందం నల్లగొండలోని జిల్లా పార్టీ కార్యాలయాన్ని సందర్శించింది.  

 

 తిట్లు... శాపనార్థాలు

 ఇక, బంద్‌రోజు కూడా టీడీపీ, టీఆర్‌ఎస్ నేతల మాటల యుద్ధాలు కొనసాగాయి. నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయం పరిశీలనకు వచ్చిన టీడీపీ ముఖ్య నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్‌కు తిట్లు, శాపనార్థాలు పెట్టారు. ఆయన సంగతి అసెంబ్లీలో తేలుస్తామని, నల్లగొండలో పెద్ద ఎత్తున నిరసన సభ నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం టీఆర్‌ఎస్ నేతలు కూడా విలేకరులతో మాట్లాడుతూ టీడీపీకి చేతకాకనే బంద్ విఫలమైందని ఎద్దేవా చేశారు. పోలీసుల రక్షణే లేకపోతే నల్లగొండకు వచ్చిన టీడీపీ నేతలను రైతులే తరిమికొట్టేవారని అన్నారు. నల్లగొండలో నిరసన సభ ఎలా పెడతారో తామూ చూస్తామని హెచ్చరించారు.

 నియోజకవర్గాల వారీగా బంద్ జరిగిందిలా....

 

 ేవరకొండలో బంద్ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. వాణిజ్య సంస్థలు, ఫుట్‌పాత్ దుకాణాలు యథావిధిగా తెరిచారు.

 నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పాక్షికంగా జరిగింది. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, పోలీసులు టీడీపీ నాయకులను అడుగడుగునా అడ్డగించారు. వ్యాపార సంస్థలు బంద్‌కు సహకరించలేదు.   బలవంతంగా దుకాణాలను బంద్ చేయడానికి ప్రయత్నించగా టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట పట్టణంలో టీడీపీ నాయకులు నిర్వహించిన బంద్ పాక్షికంగా,  ప్రశాంతంగా ముగిసింది.  పట్టణంలోని వ్యాపార సంస్థలను  బంద్ చేయించారు.  బైక్ ర్యాలీ తీస్తుండగా, అనుమతి లేదని పోలీసులు టీడీపీ నాయకులను అరెస్టు చేశారు.

 

 మునుగోడులోనూ అదే పరిస్థితి. టీడీపీ, టీఆర్‌ఎస్‌లు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించాయి. చౌటుప్పల్‌లో టీడీపీ నాయకులు బంద్ చేయిస్తుం డగా, మనుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి దాదాపు 100మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలతో మూసివేయించిన దుకాణాలను తెరిపించారు. ఇరువురు నినాదాలు, ప్రతి నినాదాలు చేసుకున్నారు. నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంచర్ల భూపాల్‌రెడ్డిని అరెస్టుచేసి, చండూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావడంతో, ఆయనను వదిలిపెట్టాలని టీడీపీ నాయకులు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సంస్థాన్ నారాయణపురంలో టీడీపీ ఆధ్వర్యంలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. టీ టీడీపీ నేతలు ఎర్రబెల్లి, ఎల్.రమణ, మోత్కుపల్లిలను చౌటుప్పల్‌లో అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రయత్నించాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో టీడీపీ బంద్ పాక్షికంగా జరిగింది. అర్వపల్లిలో రాస్తారోకో నిర్వహించారు. తుంగతుర్తి, మోత్కూరు, శాలిగౌరారం మండల కేంద్రాలలో టీడీపీ నేతలు దుకాణ, వాణిజ్యసముదాయాలను బంద్ చేయించారు.

 

 మిర్యాలగూడలో పట్టణంలో బంద్ పాక్షికంగా జరిగింది. ఉదయం వేళలో కొంతసేపు మాత్రమే బంద్ జరిగింది. నాయకులు రెండు వర్గాలుగా వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించారు. హుజూర్‌నగర్‌లో టీడీపీ నాయకులు వ్యాపార, వాణిజ్య సంస్థలను బంద్ పాటించాలని కోరుతుండగానే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని  స్టేషన్‌కు తరలించారు. టీఆర్‌ఎస్ నాయకులు సైతం ర్యాలీ నిర్వహిస్తుండడంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్న చంద్రబాబుపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్‌ఎస్ నాయకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

 

 కోదాడలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్  బొల్లం మల్లయ్యయాదవ్ ఆధ్వర్యంలో నాయకులు ఖమ్మం క్రాస్‌రోడ్డు నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్ నాయకులు ఉండడంతో ముందస్తుగా పోలీసులు టీడీపీ నాయకులను అరెస్టు చేశారు. టీఆర్‌ఎస్ నాయకులు చంద్రబాబు దిష్టిబొమ్మ ద హనం చేశారు.భువనగిరిలో  టీడీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ జెండా దిమ్మెకు పాలాభిషేకం చేశారు. రాస్తారోకో చేయాలని ప్రయత్నించగా,  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నకిరేకల్‌లో బంద్ ప్రశాతంగా జరిగింది. ఈ సందర్భంగా  పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి దుకాణాలను, కళాశాలలను బంద్ చేశారు. చిట్యాలలో పోలీస్‌స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై టీడీపీ, టీఆర్‌ఎస్ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నల్లగొండలో జరిగే ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, ఆ పార్టీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ప్రయాణిస్తున్న వాహనాలు చిట్యాలకు చేరుకున్నాయి. అక్కడ ర్యాలీ నిర్వహించేందుకు యత్నించిగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు  జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు.



 ఆ పార్టీ నాయకులు కింద కూర్చుని ధర్నా చేస్తుండగానే గుర్తు తెలియని వ్వక్తులు టీడీపీ నాయకుల వాహనాశ్రేణిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో మూడు వాహనాల కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. టీడీపీ నేతలను రమణ, ఎర్రబెల్లి, మోత్కుపల్లిలను పోలీసులు అదుపులోకి తీసుకుని రామన్నపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆనంతరం టీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు చెదరగొట్టారు.  నల్లగొండలో బంద్ ప్రభావం అక్కడక్కడ మాత్రమే కనిపించింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్ నేతృత్వంలో నిర్వహించిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా టీఆర్‌ఎస్ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.  ఆలేరు మండల కేంద్రంలో రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూర్(ఎం) మండలంలో కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. యాదగిరిగుట్టలో బంద్ ప్రభావం కనిపించలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top