మళ్లీ మొదలైన మక్కల కొనుగోళ్లు


తాండూరు: తాండూరు డీసీఎంఎస్ కేంద్రంలో మక్కల కొనుగోళ్లు తిరిగి మొదలయ్యాయి. సోమవారం డీసీఎంఎస్ కేంద్రంలో కొనుగోలు చేసిన మక్కల్లో నాణ్యత లేదంటూ సీడబ్ల్యూసీ కేంద్రంలో తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు కేంద్రానికి వచ్చారు. అయినప్పటికీ కొనుగోళ్ల విషయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా గందరగోళం నెలకొంది. మక్కల నాణ్యతను పరిశీలించి గ్రేడ్‌ను నిర్ధారించాలని డీసీఎంఎస్ గోదాం ఇన్‌చార్జి ఎల్లయ్య కేంద్రానికి వచ్చిన వ్యవసాయ శాఖ ఏఈఓ రవికుమార్‌ను కోరారు.



అయితే ఈ విషయమై ఉన్నతాధికారుల నుంచి తనకు ఆదేశాలు లేవని అతడు చెప్పడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. మరోవైపు కొనుగోళ్లు జరపకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న డీసీఎంఎస్ స్థానిక మేనేజర్ షరీఫ్, వ్యవసాయ శాఖ ఏడీఏ సింగారెడ్డిలు కొనుగోలు కేంద్రానికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.



 తాము మక్కలను ఏ గ్రేడ్‌గా నిర్ణయిస్తే సీడబ్ల్యూసీ గోదాంకు వెళ్లిన తరువాత బీ గ్రేడ్‌గా నిర్ణయించి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని డీసీఎంఎస్ అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఏడీఏ హామీ ఇచ్చారు. ఇక సోమవారం కొనుగోలు చేసిన మక్కలపై అధికారులు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.



 163.50 క్వింటాళ్ల కొనుగోళ్లు

 తూకాలు ఆలస్యంగా జరగటంతో మంగళవారం సాయంత్రం 6గంటల వరకు సుమారు 163.50క్వింటాళ్ల మొక్కజొన్నల కొనుగోళ్లు జరిగాయి. ఇందులో 96 క్వింటాళ్లు బ్రీగ్రేడ్, 67.50 క్వింటాళ్లు సీ గ్రేడ్ మక్కలను నాలుగురు రైతుల నుంచి కొనుగోలు చేశారు. అయితే తిరస్కరణ ప్రభావంతో మంగళవారం ఒక్క క్వింటాలు కూడా ఏగ్రేడ్‌లో కొనుగోలు చేయకపోవడం గమనార్హం.



 ముందుగా నమూనాలు తీసుకురావాలి

 మక్కల నమూనాలను ముందు కేంద్రానికి తీసుకురావాలని తాండూరు ఏడీఏ సింగారెడ్డి చెప్పారు. కేంద్రంలో నాణ్యతాప్రమాణాల ప్రకారం గ్రేడ్ నిర్ధారణ చేసుకున్న తరువాతనే పూర్తి పంటను కేంద్రానికి తరలించాలని ఆయన రైతులను సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top