మళ్లీ భూ సేకరణ!


యాచారం: మరో విడత భూ సేకరణ చేపట్టేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. గతంలో ఏపీఐఐసీ యాచారం మండలంలోని నాలుగు గ్రామాల్లో 3,145 ఎకరాలు సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కూడా మరో విడత ఇదే మండలంలో భూములు సేకరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రాల విభజనకు ముందు మొదటి విడితగా మండలంలోని కుర్మిద్దలో 985 ఎకరాలను సేకరించేందుకు ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయల సంస్థ) నిర్ణయం తీసుకుంది.



 రెండో విడతలో భాగంగా యాచారం, చౌదర్‌పల్లి, చింతుల్ల గ్రామాల్లో 2,160 ఎకరాలను సేకరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. అయితే ఈ భూముల సర్వే నంబర్లతో సహా అధికారులు బయటకు వెల్లడించినా.. రైతుల నుంచి భూ సేకరణ చేయలేదు. పరిహారం, పునరావాసం వంటి విషయాలపైనా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ క్రమంలోనే స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆ విషయం కొలిక్కి రాకముందు టీఎస్‌ఐఐసీ (తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయల సంస్థ) మండలంలోని మరో నాలుగు గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.



 అందులో భాగంగానే అధికారులు మండలంలోని కొత్తపల్లి, తక్కళ్లపల్లి, నక్కర్తమేడిపల్లి, తాడిపర్తి గ్రామాల్లో 550 ఎకరాలను వివిధ పరిశ్రమల ఏర్పాటుకు పరిశీలించినట్టు తెలుస్తోంది. అప్పట్లో మండలంలోని కుర్మిద్ద, యాచారం, చౌదర్‌పల్లి, చింతుల్ల తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు భూముల సేకరణ విషయమై రైతుల నుంచి ఎలాంటి అభిప్రాయం కోరలేదు. ప్రస్తుతం మరో 550 ఎకరాలకుపైగా భూములను సేకరించేందుకు టీఎస్‌ఐఐసీ అధికారులు చకచకా పనులు పూర్తిచేస్తుండడం, తరచూ స్థానిక రెవెన్యూ అధికారులతో సమావేశమై చర్చలు జరుపుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.



 భూములు సేకరించాలని నిర్ణయించిన యాచారం, చౌదర్‌పల్లి, చింతుల్ల గ్రామాల్లో అత్యధికంగా పట్టా భూములున్నాయి. మిగతా గ్రామాల్లో అసైన్డ్ భూములు, రాళ్లు, గుట్టలు ఉన్నాయి. మండలంలో పరిశ్రమల ఏర్పాటు వల్ల స్థానికులకు ఉపాధి దొరుకుతుందని కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా, కాలుష్య కారక పరిశ్రమలు ఏర్పాటైతే తీవ్ర నష్టం తప్పదని మరికొందరు అంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top