మధ్యాహ్నం...అధ్వాన్నం

మధ్యాహ్నం...అధ్వాన్నం - Sakshi


ఉడికీ ఉడకని బియ్యం....నాసిరకమైన కూరగాయలు వెరసి మధ్యాహ్నభోజనం అధ్వానంగా తయారవుతోంది. బుధవారం తాటికల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో భోజనం చేసిన 40మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు లోనయ్యారు. శనివారం నాటికి ఇలాంటి ఘటన మరో రెండు పాఠశాలల్లో చోటుచేసుకుంది. అయిటిపాముల, బీమారం పాఠశాలల్లో 74 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సర్కారు మధ్యా హ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లా వ్యాప్తంగా 3,301 పాఠశాలల్లో 3.16లక్షల మంది విద్యార్థుల కోసం 6,400 మంది మహిళలు మధ్యాహ్న భోజనాన్ని వండిపెడుతున్నారు. అయి తే అధికారుల పర్యవేక్షణ సరిగ్గాలేక ఈ పథకం జిల్లా వ్యాప్తంగా అధ్వానంగా మారింది. జిల్లాలో మధ్యాహ్న భోజనం వికటించి ఇటీవల తాటికల్, భీమారం, అయిటిపాములలో సుమారు 113 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరారు. పాఠశాలల్లో వరుసగా జరుగుతున్న సంఘటనలతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

 

 ఆదేశాలు బేఖాతర్

 మధ్యాహ్నభోజన పథకంలో మహిళా సంఘాల వారు మెనూ సక్రమంగా పాటించడం లేదు. వారంలో మూడు రోజుల పాటు పప్పు వండి పెట్టాలని ఆదేశాలున్నాయి. అయినా మార్కెట్‌లో పప్పులకు ఎక్కువ ధరలు ఉండటంతో ఒక్కరోజు పప్పు వండిపెట్టి మమ అనిపిస్తున్నారు. అదే విధంగా వారంలో రెండు కోడిగుడ్లు పెట్టాల్సి ఉన్నా కనీసం ఒక్కరోజు కూడా ఇవ్వడం లేదు. వర్షాల కాలంలో ఆకు కూరలు వండి పెట్టవద్దని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు జారీ చేసినా మహిళా సంఘాల వారు పట్టించుకోవడంలేదు. కొన్ని చోట్ల ఆకుకూరలతో భోజనం పెడుతున్నారు. దాంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు.

 

 పీడీఎస్ బియ్యంతోనే వంట

 మధ్యాహ్న భోజనం కోసం రేషన్ డీలర్లకు ప్రత్యేకంగా ఎఫ్‌ఏక్యూ (ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ) బియ్యం అందిస్తున్నారు. కానీ వారు మాత్రం పాఠశాలల ఏజెన్సీలకు వాటిని సరఫరా చేయడంలేదు. దీంతో మహిళా సంఘాల వారు పీడీఎస్ బియ్యాన్నే మధ్యాహ్న భోజనం కోసం వినియోగిస్తున్నారు. ఈ బియ్యం ఉడికీఉడకక ముద్దగా మారుతోంది. ఇలాంటి భోజనాన్ని విద్యార్థులు తినలేకపోతున్నారు. భోజనాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తప్పని సరిగా రుచి చూడాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వారితో పాటు పాఠశాల విద్యా కమిటీలు సైతం రుచి చూడాల్సి ఉంది. కానీ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటీల చైర్మన్‌లు కూడా మధ్యాహ్నభోజనాన్ని రుచి చూడటం లేదు. దాంతో మధ్యాహ్నభోజనం వండే ఏజెన్సీలది ఇష్టారాజ్యంగా మారింది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top