నోటిఫికేషన్ తర్వాత 45 రోజుల్లోనే పోస్టుల భర్తీ: విఠల్

నోటిఫికేషన్ తర్వాత 45 రోజుల్లోనే పోస్టుల భర్తీ: విఠల్


వికారాబాద్: నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కేవలం 45 రోజుల్లోనే పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) సభ్యుడు విఠల్ చెప్పారు. సోమవారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2012లో నిర్వహించిన గ్రూప్-1ను మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ఆ పరీక్షను 2 రాష్ట్రాలు విడివిడిగా నిర్వహిస్తాయన్నారు. తెలంగాణ చరిత్ర, భౌగోళిక అంశాలు, తెలంగాణ ఉద్యమం, సంస్కృతి మీద ఈసారి పరీక్షల్లో అధిక ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందన్నారు.



తొలి విడతలో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. వీటి తర్వాత మరో పదివేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని, అందులో గ్రూప్ ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని, గ్రూపు పరీక్షలకు ఇంటర్వ్యూ తప్పనిసరిగా ఉండే అవకాశం ఉందని విఠల్ తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సభ్యుడు శివశంకర్, జేఏసీ రంగారెడ్డి జిల్లా చైర్మన్ శ్రీనివాస్, పంచాయతీరాజ్ మినిస్ట్రీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నందకుమార్,ఎంపీడీఓ సత్తయ్య, సాక్షర భారత్ రాష్ట్ర నాయకుడు గోపాల్ యాదవ్  పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top