మూడొంతులుమురికిలోనే..

మూడొంతులుమురికిలోనే..

  •  3.39 లక్షల మంది మురికివాడల్లో నివాసం

  •  పమాదభరితంగా 31 వాడలు

  •  దుర్భరంగా మారిన నగర జీవనం

  •  ఆదుకోని ప్రభుత్వ పథకాలు

  •  ఊరిస్తున్న రాజీవ్ ఆవాస్‌యోజన

  • సాక్షి, హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా పేరొందిన వరంగల్‌లో అభివృద్ధి ఛాయలు కనిపించడం లేదు. గ్రేటర్ వరంగల్‌గా మార్పుకు సుముఖత.. కేంద్ర ప్రభుత్వ నిధులతో త్వరలో స్మార్ట్‌సిటీ పథకం అమలు.. అంటూ పాలకులు ప్రజలను మభ్య పెట్టడం తప్పితే నగర సమగ్రాభివృద్ధికి ఇన్నేళ్లుగా తీసుకుంటున్న చర్యలు శూన్యం.



    నగర జనాభాలో మూడొంతుల మంది ఇప్పటికీ మురికివాడల్లో అరకొర సౌకర్యాల నడుమ దుర్భర జీవనం సాగిస్తున్నారు. వీరికి పక్కా ఇళ్లు, మౌలిక సదుపాయాలను కల్పించడంలో బల్దియా అధికారుల తీవ్ర నిర్లక్ష్యం చేశారు. దానితో మురికికూపాల్లో నివసిస్తున్న జనాభా మూడు లక్షలు దాటింది. వరంగల్ నగర జనాభా ప్రస్తుతం 8,19,249 ఉంది. ఈ జనాభాలో 3.39 లక్షల మంది మురికివాడల్లో జీవిస్తున్నారు.



    విలీన గ్రామాలను మినహాయిస్తే నగరంలో 84 మురికివాడలు ఉన్నట్లుగా అధికారికంగా గుర్తించగా.. ఇక్కడ 1,58,334 మంది ప్రజలు నివసిస్తున్నారు. అధికారిక గుర్తింపుకు నోచుకోకపోయినప్పటికీ మురికివాడలుగా పేరొందినవి మరో 62 వీధులు ఉన్నాయి. ఇక్కడ 85,769 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. విలీన గ్రామాలు కాకుండా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చూస్తేనే 6,20,000 జనాభా ఉండగా.. ఇందులో 2,44,113 మంది మురికివాడల్లో ఉండటం గమనార్హం.  

     

    ఆదుకోని ఆవాస్‌యోజన..

     

    విలీనగ్రామాలను మినహాయిస్తే 146 మురికివాడలు నగరంలో ఉండగా ఇక్కడ 4,166 కుటుంబాలకు నివసించేందుకు కనీసం సరైన ఇళ్లు లేవు. వీరంతా కార్పొరేషన్ పరిధిలో పూరిగుడిసెలు, డేరాలు వంటి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుని నివసిస్తున్నారు. వీరితో పాటు పక్కా ఇళ్లు లేకుండా నివసిస్తున్న కుటుంబాల సంఖ్య 18,616గా ఉంది. అరుతే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రాాజీవ్ ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ధి పొందేందుకు కార్పొరేషన్ పరిధిలో ఎదురుచూస్తున్న కుటుంబాల సంఖ్య ఇరవై వేలకు పైమాటగానే ఉంది. కానీ, ఇప్పటి వరకు కార్పొరేషన్ పరిధిలో ఆర్‌వైఏ పథకం అమలుకు నోచుకోలేదు.



    అత్యవసరంగా పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిన కుటుంబాల సంఖ్య 4,166గా ఉండగా.. ఇందులో ఆరోవంతు కంటే తక్కువ మందికి మొదటిదశ కింద రూ.31.58 కోట్లతో 576 పక్కా గృహాలు మంజూరయ్యాయి. వీటిని జితేందర్‌నగర్, అంబేద్కర్‌నగర్‌లలో నివసిస్తున్న పేదలకు నిర్మించి ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఇవి పూర్తరుున తర్వాత మలిదశ కింద గాంధీనగర్, మీరాసాహెబ్‌కుంటలో ఈ పథకాన్ని అమలు చే స్తామని అధికారులు పేర్కొంటున్నారు.

     

    ప్రమాదభరింగా 31 కాలనీలు..


     

    నగరంలో 146 మురికివాడలు ఉండగా వీటిలో 31 వాడలు చెరువు, వరదముంపులో, కొండచరియలు విరిగిపడే ప్రమాదభరిత ప్రాంతాల్లో ఉన్నాయి. వాస్తవానికి వీరిని ఈ ప్రాంతాల నుంచి తరలించి సురక్షిత ప్రాంతంలో ఆవాసం కల్పించాల్సి ఉంది. కానీ ఈ దిశగా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా మురికివాడల్లో నివసిస్తున్న జనాభాలో దళితులు, మైనార్టీల జనాభానే ఎక్కువగా ఉంది. అధికారికంగా గుర్తించినవి 84 మురికివాడలు ఉండగా వీటిలో 17 పూర్తిగా హరిజన వాడలు కావడం గమనార్హం. అంతేకాదు.. మైనార్టీలు అధికంగా ఉండే ఉర్సు, కరీమాబాద్ ప్రాంతాలు సైతం మురికివాడల జాబితాలోనే ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top