హత్యలకు అడ్డా.. నల్లమల!


నల్లమల ప్రాంతం హత్యలకు అడ్డాగా మారుతోంది. దుండగులు ఎక్కడో హత్యలు చేసి అచ్చంపేట ప్రాంతంలో మృతదేహాలను   పడేస్తున్నారు.. ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండటమో లేదా పోలీసుల అసమర్థతతో కానీ ఎక్కువ శాతం హత్యలు ఈ ప్రాంతంలోనే వెలుగులోకి వస్తున్నాయి.. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో భయాందోళనలు సృష్టిస్తున్నారు..     

 - అచ్చంపేట రూరల్

 

ఈ మధ్యకాలంలో అచ్చంపేట ప్రాంతంలో హత్యలు, దొంగతనాలు, చోరీలు ఎక్కువగా జరుతున్నాయి. ముఖ్యంగా దుండగులు ఎక్కడో హత్య చేసి నల్లమల ప్రాంతంలోనే మృతదేహాలను పడేసిపోయి పోలీసులకు సవాలు విసురుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు సమీప జిల్లాలైన రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల్లో హత్యలు చేసి నల్లమల ప్రాంతంలో పడేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న, భార్యపై కక్ష పెట్టుకున్న వారు హత్య చేసి మృతదేహాలను పడేసిపోతున్నారు. ఈ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు.



తాజాగా ఫిబ్రవరి 25న చంద్రవాగు బ్రిడ్జి వద్ద ఓ మహిళను దహనం చేసిన సంఘటన చర్చనీయాంశమైంది. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో మహిళను హత్య చేసి బ్రిడ్జి వద్ద దహనం చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ దిశగా నల్లగొండ జిల్లా దేవరకొండ, మల్లెపల్లి ప్రాంతంలో మహిళ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఈమె భవన నిర్మాణ పనులు చేసి ఉంటుందని, భర్తలేరని అనుమానిస్తున్నారు. చేతికి రోల్‌గోల్డ్ గాజు ఉందని, కాలుకు మెట్టె, గుండ్రని ముఖం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 2011 మే 23న ఓ వివాహితను హత్య చేసిన భర్త రంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో పడవేసిపోయారు. 2011లో జరిగిన సంఘటనకు సంబంధించిన కేసును పోలీసులు చేధించారు.



భర్తే హత్యకు పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. తాజాగా జరిగిన సంఘటనపై పోలీసులకు సమాచారం లభించక తలలు పట్టుకుంటున్నారు. ఇక ఎక్కడో హత్యలు చేసిన దుండగులు రాత్రివేళ శ్రీశైలం హై రోడ్డుపై వాహనాల్లో ప్రయాణించి చివరికి అచ్చంపేట ప్రాంతంలోనే మృతదేహాలను వదిలివెళుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా దుండగులు తగుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు నిదర్శనం 2011లో జరిగిన మహిళ హత్యే. ఆమె ముఖంపై యాసిడ్‌పోసి గుర్తించకుండా చేశారు.



అలాగే గత నెలలో చంద్రవాగు వద్ద మహిళను హత్య చేసిన అనంతరం బ్రిడ్జి కింద పడేసి యాసిడ్, పెట్రోల్‌పోసి తగులబెట్టారు. శరీరం 95శాతం కాలినా ముఖం, కుడిచే యి మాత్రమే మిగిలింది. ఈ విషయమై సీఐ వెంకటేశ్వర్లును వివరణ కోరగా రాత్రివేళ డిండి నుంచి హాజీపూర్‌చౌరస్తా వరకు ఉప్పునుంతల పోలీసులు, హాజీపూర్ నుంచి మన్ననూర్ వరకు సిద్దాపూర్ పోలీసులు వాహనంతో తిరుగుతూనే ఉన్నారన్నారు. త్వరలోనే ఆయా కేసుల్లో దుండగులను పట్టుకుంటామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top