ఆటకట్టిస్తాం


అనుమతిలేని ప్లే స్కూళ్లపై కఠిన చర్యలు

 జిల్లాలో 425 పాఠశాలలు కొనసాగుతున్నట్లు నిర్ధారణ

 ఒక్కదానికీ గుర్తింపు లేని వైనం షోకాజ్ నోటీసులు

 జారీచేసిన విద్యాశాఖవారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం


 

 సాక్షి, రంగారెడ్డి జిల్లా: అనుమతి లేని ప్లే స్కూళ్లపై విద్యాశాఖ చర్యలకు దిగింది. గతవారం దిల్‌సుఖ్‌నగర్ సమీపంలోని మూసారాంబాగ్‌లోని స్టార్ కిడ్స్ ప్రీమియం ప్లేస్కూల్‌లో ఓ చిన్నారి లిఫ్ట్‌లో ఇరుక్కుని మరణించింన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలోని ప్లే స్కూల్స్‌పై విద్యాశాఖ ఆరా తీస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 37 మండలాల్లో ఒక్క ప్లే స్కూల్‌కు కూడా అనుమతి లేదు. అనుమతి లేకుండా కొనసాగుతున్న వీటిపై కఠినంగా వ్యవహరించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా మండలాల వారీగా నడుస్తున్న ప్లేస్కూళ్లను గుర్తించేందుకు ఉపక్రమించింది.

 

 425 స్కూళ్లకు షోకాజ్ నోటీసులు..


 జిల్లాలో మండలాల వారీగా తనిఖీలు నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు ఇప్పటిరకు 425 ప్లే స్కూళ్లున్నట్లు గుర్తించారు. వీటి పరిధిలో దాదాపు 13వేల మందికి పైగా పిల్లలున్నట్లు అధికారుల అంచనాలు చెబుతున్నాయి. అనుమతి లేకుండా కొనసాగుతున్న ప్లేస్కూళ్లను గుర్తించిన వెంటనే వాటికి షోకాజ్ నోటీసులు జారీచేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 425 స్కూల్ మేనే జ్‌మెంట్లకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు.

 

 అక్రమంగా నడుస్తున్నవి మరో 750..


 జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ప్లే స్కూళ్లు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. రాజధాని చుట్టూ ఉన్న 9 మండలాల్లో ఇప్పటివరకు 425 పాఠశాలలను గుర్తించారు. ఇవేగాకుండా మిగతా మండలాల్లోనూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

 ఇప్పటివరకు గుర్తించిన ప్లేస్కూళ్లలో కేవలం చిన్నారులకు ఆటపాటలతోనే సరిపెడుతున్నారు. అయితే కొన్ని అనుమతి పొందిన ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో అక్రమంగా ప్లేస్కూళ్లను నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ పరిశీలనలో వెల్లడైంది. ఇలా దాదాపు 750 పాఠశాలల్లో ఇలా ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వీటి సంఖ్యను తేల్చేందుకు విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా.. ప్లే స్కూళ్లకు అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులుంటే అధికారికంగా వీటిని నిర్వహించే అవకాశం ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top