నాలుగేళ్లయినా బదిలీలేవి?


ఎక్సైజ్ శాఖలో అధికారుల గగ్గోలు

 

సాక్షి, హైదరాబాద్: సాధారణ బదిలీలతో సంబంధం లేకుండా ప్రతి రెండేళ్లకోసారి స్థాన మార్పిడి జరిగే ఆబ్కారీ శాఖలో నాలుగేళ్లుగా స్తబ్దత నెలకొంది.  ఈ శాఖలో  నాలుగేళ్ల నుంచి అధికారులు కదలకుండా పనిచేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన సుమారు 70 ప్రాంతాల్లో ఏడాదికోసారి బదిలీలు జరపాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చెక్‌పోస్టులు, బోర్డర్ మొబైల్ పార్టీలు, సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో పనిచేసే వారిని ఏడాదికే బదిలీ చేయాలన్న నిబంధనలు బేఖాతరవడంతో ఆయా ప్రాంతాల్లో పోస్టింగుల్లో ఉన్నవారు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలతో పాటు గెజిటెడ్ అధికారుల సంఘాలు, ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

 

500 పోస్టులు ఖాళీ.. తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ నుంచి అదనపు కమిషనర్ వరకు మంజూరైన పోస్టులు 3,602 కాగా, మినిస్టీరియల్ స్టాఫ్ 723. మొత్తం 4,325 పోస్టుల్లో ప్రస్తుతం 500 వరకు ఖాళీలున్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలంటే పదోన్నతులు, బదిలీలు చేపట్టాల్సి ఉంది. కానీ నాలుగేళ్లుగా ఆ ప్రక్రియ సాగడం లేదు. దీంతో ధూల్‌పేట, నల్లమల, ఆదిలాబాద్ వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్ల నుంచి సీఐల వరకు అక్కడే ఉండిపోయారు. ఇక ఆదాయ మార్గాలు అధికంగా ఉండే రంగారెడ్డి జిల్లాలోని 70 శాతానికి పైగా స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు సీఐ, ఏఈఎస్, ఈఎస్ స్థాయి అధికారులు తమను కదిలించకపోవడమే మంచిదన్న ధోరణిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖలోని ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల సంఘాలు సీఎంను కలసి బదిలీలకు అనుమతివ్వాల్సిందిగా కోరనున్నాయి.

 

పదోన్నతులకు ఏసీబీ కేసుల అడ్డు!

పదోన్నతులు కల్పిస్తేగానీ బదిలీలు జరిగే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పదోన్నతుల జాబితాను ప్రభుత్వానికి పంపించారు. కానీ ప్రభుత్వం ఈ పదోన్నతులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా జాబితా తయారీలో అవకతవకలు జరిగాయని ఆబ్కారీ భవన్‌లో గొడవలు జరుగుతున్నాయి. అనర్హులను జాబితాలో చేర్చారని ఒకరిద్దరు అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు. కాగా 2012-13లో ఉమ్మడి రాష్ట్రంలో చోటుచేసుకున్న సిండికేట్ల వ్యవహారంలో సీఐ స్థాయి నుంచి ఈఎస్ స్థాయి వరకు గల వారిలో 80 శాతం మందిపై ఏసీబీ కేసులున్న నేపథ్యంలో పదోన్నతులకు గండిపడింది. హైకోర్టులో ఉన్న ఈ కేసు తేలితే గానీ పదోన్నతులు వచ్చే పరిస్థితి లేదు. ప్రమోషన్లు లేకుండా బదిలీలు జరపాలని కోరుతున్నా సర్కార్ పట్టించుకోవడం లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top