అందని అభయహస్తం

అందని అభయహస్తం


* మూడు నెలలుగా నిలిచిన పింఛన్ల పంపిణీ

* పెన్షన్ పెంపుపై సందిగ్ధం

* ఆందోళనలో లబ్ధిదారులు

* ఆధార్ అనుసంధానం పూర్తయితేనే చేతికందేది..!


నెలలకు సంబంధించి అందకుండా పోయింది. ఇప్పటికే జనవరి నెల పింఛన్ వారు అందుకోవాల్సి ఉండగా, నేటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. 60 ఏళ్ల వయస్సులో తమకు ఆసరాగ నిలుస్తుందని రోజుకు రూపాయి చొప్పున చెల్లిస్తే ఇప్పుడు ఆ పథకం ద్వారా డబ్బులు నిలిచిపోగా, పెంచి ఇస్తామన్న పింఛను రెండు నెలలుగా నిలిచింది. దీంతో వారికి పాత పొంఛన్ ఇస్తారా? పెంచిన పింఛన్ ఇస్తారా? అనే విషయమై ఇప్పటి వరకు ప్రభుత్వం, అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో అభయహస్తం పింఛన్లు పొందే లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో అభయహస్తం పింఛన్ పొందేవారు ఆందోళనబాట పట్టారు.

 

2009లో పథకం ప్రారంభం


స్వశక్తి సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు వృద్ధాప్యం పొందిన తరువాత ఆసరా కోసం ప్రతి నెలా పింఛన్ అందించేందుకు వీలుగా 2009లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. నాటి నుంచి ప్రతినెలా అభయహస్తం పింఛన్లు అందిస్తుండగా, మూడు నెలలుగా పంపిణీని అధికారులు నిలిపివేశారు. 65 ఏళ్లు దాటిన వారికి ఆసరా పథకం ద్వారా ప్రభుత్వం రూ.1000 పింఛన్ అందిస్తుండగా, 60 నుంచి 65 ఏళ్లలోపు ఉన్న వారికి మాత్రం ఇప్పటి వరకు రాలేదు.ఈ క్రమంలో అభయహస్తం పింఛన్లపై అధికారులు ఒక్కోతీరుగా చెబుతుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లోని పింఛన్ లబ్ధిదారులు పెరిగిన పింఛన్లను సంతోషంగా అందుకుంటుంటే.. తమకు మాత్రం పెంచినవి లేవు, పాతవి లేవని.. మూడు నెలలుగా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు.

 

జిల్లాలో 21 వేల మంది లబ్ధిదారులు

జిల్లాలో మొత్తం 21,187 మంది అభయహస్తం ద్వారా నెలకు రూ. 500 పింఛన్ పొందుతున్నారు. ఈ పథకం కింద ఒక్కో సభ్యురాలు రోజుకు రూపాయి చొప్పున ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం కూడా రూపాయి చొప్పున ప్రీమియం చెల్లిస్తుంది. ఇలా 60 ఏళ్లు నిండే వరకు సభ్యులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత వారు చెల్లించిన మొత్తాన్ని లెక్కేసి నెలకు రూ.500 నుంచి రూ. 2,200 వరకు పింఛన్ మంజూరు చేస్తారు.సభ్యురాలికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతోపాటు కుటుంబంలో ఇద్దరు పిల్లలకు స్కాలర్‌షిప్ వస్తుంది. ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన 21,187 మంది మహిళలకు నెలనెలా రూ.500 పింఛన్ అందిస్తే, ప్రతినెలా రూ.1.05 కోట్లు, మూడు నెలల బకాయిలు 3.17 కోట్లుగా ఉన్నాయి.

 

స్పష్టత కరువు

అభయహస్తం లబ్ధిదారులకు సైతం అర్హతలుంటే సామాజిక పింఛన్లు మంజూరు చేస్తామని, సామాజిక పింఛన్లకు అర్హులుగా గుర్తిస్తే అభయహస్తం పింఛన్ రద్దు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. 65 ఏళ్లు దాటిన వారికి ఆసరా ద్వారా పింఛన్లను గ్రామపంచాయతీల్లో అందిస్తుండగా, 60 నుంచి 65 ఏళ్లలోపు ఎంత మంది ఉన్నారు, ఎంత మందికి అందడం లేదనే వివరాల సేకరణ ఇంకా పూర్తికాలేదు. ప్రభుత్వ నిర్ణయం ఆలస్యం కావడంతో వివరాలను సేకరించడంలోనూ అధికారులు ఆలస్యం చేస్తున్నారు.



జిల్లాలోని 21,187 మంది అభయహస్తం పింఛన్‌దారులకు సంబంధించిన ఆధార్‌ను డీఆర్డీఏ అధికారులు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే 65 ఏళ్లకు పైబడ్డ వారు ఎంతమంది ఉన్నారు.. వారిలో ఆసరా ద్వారా పింఛన్ ఎంత మంది పొందుతున్నారనే విషయమై స్పష్టత వస్తుంది. ఇప్పటికే మూడు నెలలుగా అభయహస్తం పింఛన్ పొందని వారు ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం మాత్రం ఆసరా పథకానికి అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులను గుర్తించి పూర్తిస్థాయిలో మండల అధికారులతో సర్వే చేసి వారికి ‘ఆసరా’ పింఛన్లు మంజూరు చేయాలని, అభయహస్తం పింఛన్లు రద్దు చేయాలని ఆదేశాలు జారీచేసింది.



దీంతో మిగిలిన అభయహస్తం పింఛన్‌దారులకు మాత్రం రూ.500 నుంచి రూ.1000 వరకు పెంచే విషయమై స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే మూడు నెలల పింఛన్ అందకపోగా, ఫిభ్రవరి నెలతో నాలుగు నెలలకు చేరుతుంది. అధికారులు మాత్రం ఆధార్ అనుసంధానం పూర్తయి, ఆసరాకు అర్హులైన వారిని గుర్తించిన తరువాతే అభయహస్తం పింఛన్లు అందించాలని నిర్ణయించారు. దీంతో ఈ ప్రక్రియ ఎన్నిరోజులు పడుతుందోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

 

ఇంకా ఆదేశాలు రాలేదు


అభయహస్తం పింఛన్లు అక్టోబర్ నెల నుంచి నిలిచిపోయాయి. ఇప్పటికే 65 ఏళ్లు నిండిన వారు ఆసరా ద్వారా పింఛన్లు అందుకుంటున్నారు. జిల్లాలో ఉన్న 21,187 మంది పింఛన్‌దారుల ఆధార్ అనుసంధాన ప్రక్రియ జరుగుతోంది. ఇందులో 65 ఏళ్లు నిండి, ఆసరా ద్వారా పింఛన్ పొందుతున్న వారి వివరాలను సేకరిస్తున్నాం. ఆసరా పథకానికి అర్హులైన వారిని గుర్తించడంతోపాటు, ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తిచేసిన వెంటనే మిగిలిన లబ్ధిదారులకు నాలుగు నెలల పింఛన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

 - శోభారాణి, డీఆర్డీఏ డీపీఎం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top