అమాంతం పెరిగిన విద్యుత్ బిల్లులు


స్పాట్ బిల్లింగ్‌లో జాప్యంతో వినియోగదారులపై భారం

కార్మికుల సమ్మె సాకుగా డిస్కంల దోపిడీ


 

హైదరాబాద్: స్పాట్ బిల్లింగ్‌లో జాప్యం జరగడంతో విద్యుత్ బిల్లుల మోత మోగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె కారణంగా ఏప్రిల్ నెల విద్యుత్ వినియోగానికి స్పాట్ బిల్లింగును పది రోజులు ఆలస్యంగా చేశారు. వ్యవధి దాటిన తర్వాత జరిగిన వినియోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మీటర్ రీడింగ్‌లను సేకరించారు. దాదాపు 40 రోజుల వినియోగం కింద అధిక యూనిట్లకు బిల్లింగ్ జరిగింది. దీంతో టారిఫ్ స్లాబులు మారిపోయి బిల్లులు అమాంతం పెరిగాయి. స్లాబుల్లో తేడాతో యూనిట్ ధర కూడా మారిపోతుంది. బిల్లింగ్‌లో జాప్యం జరిగినట్లు తెలిసినా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు బరితెగించి వినియోగదారులను దొంగదెబ్బ తీస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా వినియోగదారులనే బలి చేస్తున్నాయి.



దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్‌పీడీసీఎల్) పరిధిలో గృహ వినియోగదారులు గత మార్చి నెలలో 464 మిలియన్ యూనిట్లను వినియోగించగా, రూ.178 కోట్ల బిల్లులు జారీ అయ్యాయి. ఇక ఏప్రిల్‌లో ఆలస్యంగా మీటర్ రీడింగ్‌ను నమోదు చేయడంతో వినియోగం ఏకంగా 583 మిలియన్ యూనిట్లకు పెరిగింది. బిల్లులు సైతం రూ.264 కోట్లకు ఎగబాకాయి. మార్చితో పోల్చితే విద్యుత్ వినియోగం 23 శాతం, సంస్థ ఆదాయం 48 శాతం పెరిగిపోయింది. సగటున యూనిట్ చార్జీ రూ.7.22 వసూలవుతోంది. పరిశ్రమలు, వాణిజ్యం, ఇతర కేటగిరీల వినియోగదారుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. టారీఫ్ స్లాబుల్లో ఒక్క యూనిట్ తేడా వచ్చినా బిల్లు భారీగా పెరిగిపోతోంది. ఉదాహరణకు 100 యూనిట్ల వినియోగానికి రూ.202.50 బిల్లు వస్తుండగా, 101 యూనిట్లకు రూ.263.60 బిల్లు చెల్లించాల్సి వస్తోంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top