బీజేపీ నల్లగొండ సభలో కలకలం

బీజేపీ నల్లగొండ సభలో కలకలం - Sakshi


* కిషన్‌రెడ్డి మాట్లాడుతుండగా వ్యక్తి ఆత్మహత్యాయత్నం

* గ్రామకంఠం భూమి కబ్జాపై పోరాడుతున్న బాధితుడు

* శంకర్‌కు మద్దతుగా కలెక్టర్ బంగ్లా వద్ద కిషన్‌రెడ్డి ధర్నా


 

 నల్లగొండ టూటౌన్: నల్లగొండ జిల్లా కేంద్రంలో మోదీ సర్కారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా బుధవారం నల్లగొండలో బీజేపీ నిర్వహించిన ‘ప్రజాసేవ పునరంకిత’ సభలో కలకలం రేగింది. పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రసంగిస్తుండగానే ఓ వ్యక్తి హఠాత్తుగా ఒంటినిండా మంటలతో కేకలు వేస్తూ వేదికపైకి దూసుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా సభ మొత్తం హడలెత్తిపోయింది. ఆత్మాహుతి దాడి యత్నం జరిగిందని వదంతులు రావడంతో అక్కడున్న వారంతా పరుగులు తీశారు. ఏం జరుగుతోందో అర్థంకాక కొంతసేపు గందరగోళం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు, పార్టీ నేతలు కిషన్‌రెడ్డి చుట్టూ వలయంగా మారారు. అక్కడి నుంచి ఆయన్ని బయటకు తీసుకెళ్లారు. మంటలతో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా, అతను ఆత్మాహుతి దళ సభ్యుడు అయి ఉం టాడని పార్టీ వర్గాలు భావించాయి. ఆ వ్యక్తి వెంట వచ్చిన ఓ యువకుడిని గుర్తించిన బీజేపీ కార్యకర్తలు అతనిపై దాడికి యత్నిం చారు. పోలీసులు అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు.

 

 భూ వివాదమే కారణం!

 కిషన్‌రెడ్డి ఎదుటే ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి పేరు బరిశెట్టి శంకర్. ఈయనది నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని కేశరాజు పల్లి. ఈ గ్రామకంఠం భూమిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించడంపై శంకర్ పోరాడుతున్నాడు. కబ్జాకు గురైన భూమిని గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయానికి కేటాయించాలని కొద్ది రోజులుగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నాడు. జిల్లా కలెక్టర్, ఆర్‌డీవో, తహసీల్దార్‌కు సైతం విన్నవించాడు.

 

  కానీ ఆక్రమించుకున్న వ్యక్తి టీఆర్‌ఎస్ కార్యకర్త కావడంతో ఈ వ్యవహారం కొలిక్కి రావడం లేదని ఆవేదన చెందాడు. ఈ విషయమై కిషన్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు శంకర్ నల్లగొండ బీజేపీ సభకు వచ్చాడు. వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పటించుకున్నాడు. బీజేపీ నేతలు మంటలను ఆర్పి శంకర్‌ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తర్వాత కిషన్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి శంకర్‌ను పరామర్శించారు. ఆర్డీవోను పిలిచించి భూ కబ్జా విషయంలో నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.శంకర్ కుటుంబానికి న్యాయం చేయాలని, అతన్ని వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ బంగ్లా ఎదుట కిషన్‌రెడ్డి ధర్నా చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top