కరువు గోస.. వలస బాట

కరువు గోస.. వలస బాట - Sakshi


మళ్లీ ముంబైకి తరలుతున్న పాలమూరు జనం

రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితిలో ఖాళీ అవుతున్న పల్లెలు




ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధ దంపతుల పేర్లు లీల్యానాయక్, మణికిబాయి. వీరిది మహబూబ్‌నగర్‌ జిల్లా మద్దూరు మండలం పల్లెగడ్డతండా. వారి కుమారుడు కిషన్‌నాయక్, కోడలు శాంతాబాయి. మూడెకరాల భూమి ఉంది. మూడేళ్లుగా సరైన వర్షాల్లేక పంటలు పండటం లేదు. ఉపాధి హామీ పనులను నమ్ముకుంటే ఇక్కడ బతకలేమంటూ.. కిషన్‌నాయక్, శాంతాబాయి తమ ఇద్దరు పిల్లలను తీసుకుని కూలి చేసుకునేందుకు రెండు నెలల కింద ముంబై వలస వెళ్లారు. ఇప్పుడు లీల్యానాయక్, మణికిబాయిలు పింఛన్‌ మీదే ఆధారపడి బతుకుతున్నారు



సాక్షి, మహబూబ్‌నగర్‌: పాలమూరు జిల్లాను కరువు కాటేసింది. ఉన్న చోట పనులు దొరకక.. చేసిన అప్పులు పెరిగిపోతుండటంతో జనం వలసబాట పడుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితిలో పనిచేయగిలినవారంతా ముంబైకి కూలి పనులకు వెళుతున్నారు. పనిచేయలేని వృద్ధులు మాత్రం కళ్లలో ప్రాణాలు పెట్టుకుని బతుకు వెళ్లదీస్తున్నారు. దీంతో పాలమూరు పల్లెలన్నీ బోసిపోయాయి. జిల్లాలోని మద్దూరు, కోయిల్‌కొండ, నవాబ్‌పేట, ధన్వాడ, మరికల్, నారాయణపేట, దామరగిద్ద, ఊట్కూరు మండలాల ప్రజలు రోజూ 200 నుంచి 250 మంది ముంబై, పుణె వంటి నగరాలకు వలసబాట పడుతున్నారు. ఇప్పటివరకు 20 వేల మందికిపైగా వలస వెళ్లినట్లు అంచనా.



రోజూ వందల మంది..

అధికారిక సమాచారం ప్రకారమే మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి నిత్యం 200 మందికిపైగా వలస వెళ్తున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య రెండింతలు ఉంటుందని అంచనా. మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలో నారాయణపేట, వనపర్తి డిపోల రోజూ రెండు ఆర్టీసీ బస్సులు ముంబైకి రాకపోకలు సాగిస్తున్నాయి. ఆ బస్సుల ఆక్యుపెన్సీ రేటు 72 శాతంగా ఉంది. నిత్యం సుమారు 100 మంది వాటిలో వెళుతున్నారు. ఇక కోయిల్‌కొండ నుంచి నిత్యం రెండు తుఫాన్‌ వాహనాలు, నారాయణపేట నుంచి ప్రైవేటు మినీ బస్సులు ముంబైకి వెళుతున్నాయి. మరికొందరు రైలుమార్గం ద్వారా వెళ్తున్నారు. ఇలా రోజూ 250 మంది వరకు నాలుగు నెలల్లో 20 వేల మంది వలసబాట పట్టినట్లు సమాచారం.



ఆదుకోని ‘ఉపాధిహామీ’

జిల్లాలో ఉపాధి హామీ పనులు కూడా ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 2.89 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. మొత్తం 6.23 లక్షల మంది సభ్యులున్నారు. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరానికి కేవలం 2 కుటుంబాలు మాత్రమే వందశాతం పనిదినాలు పూర్తి చేశాయి. రోజు కూలీ సగటున కేవలం రూ.132 మాత్రమే రావడం, అది కూడా నెలల తరబడి వేచిచూడాల్సి రావడమే దీనికి కారణం. అదే బయట కూలీ పనికి వెళితే రోజుకు రూ.300 వరకు వస్తున్నాయి. దీంతో పాలమూరు వాసులు ముంబై, పుణె వంటి వంటి నగరాలకు వలసవెళ్తున్నారు.



పంటలే లేవాయే..

జిల్లాలో పంటల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా పంటల సాగు పడిపోయింది. వర్షాకాలంలో వరి సాధారణంగా 38 వేల హెక్టార్లలో సాగుకావాల్సి ఉండగా.. ఈసారి 20 వేల హెక్టార్లలోనే సాగైంది. పత్తి కూడా 56 వేల హెక్టార్లలో సాగుకావాల్సి ఉండగా.. 23 వేల హెక్టార్లలో మాత్రమే వేశారు. యాసంగి (రబీ)లో వరి 24 వేల హెక్టార్లలో సాగుకావాల్సి ఉండగా 21 వేల హెక్టార్లలో.. వేరుశనగ 28 వేల హెక్టార్లలో సాగు కావాల్సిఉండగా.. 16 వేల హెక్టార్లలోనే సాగైంది. ఇలా పంటల సాగు పడిపోవడంతో వ్యవసాయ రంగంపై ఆధారపడిన కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలో వలసబాట పడుతున్నారు.



సాగుచేసే వీలులేకనే వలస

మూడెకరాల పొలం ఉన్నా బోర్లు ఎండిపోయాయి. ఉన్న ఊరిని వదిలి పుణెకు వలస వెళ్తున్నాం. పదిహేను సంవత్సరాలుగా అక్కడ ఓ మేస్త్రీ దగ్గర టైల్స్‌ వేసే పనులు చేస్తున్నాం. ఏడాదిలో రెండుసార్లు పండుగలకు ఊరికి వచ్చి ఇంటిని, కుటుంబ సభ్యులను చూసి వెళ్తాం. ప్రభుత్వ సహకారం ఉంటే మాకు ఇక్కడ చేసేందుకు పని దొరుకుతుంది. ఇలా వలస వెళ్లే పరిస్థితి రాదు.

    – పిన్యానాయక్, బుద్ధారం, ధన్వాడ, మహబూబ్‌నగర్‌



బీఈడీ చదివి మట్టిపని చేశా

మా నాయన నన్ను కష్టపడి చదివించాడు. టీటీసీ, బీఈడీ రెండూ పూర్తి చేసిన. డీఎస్సీ నోటిఫికేషన్‌ పడుతదని చూసి, చూసి అలిసిపోయిన. కిందటి విద్యా సంవత్సరంలో మద్దూరులో ప్రైవేటు స్కూల్లో పనిచేస్తే నెలకు రూ.3 వేలు ఇస్తమన్నరు. చేసేదేమీ లేక ముంబై వెళ్లి మట్టిపని చేశా. ఇప్పుడు గురుకుల పోస్టులు పడ్డయని తెలిసి.. వచ్చి ప్రిపేర్‌ అవుతున్నా. పాలమూరు జిల్లాను కరువు అలుముకుంది. గిరిజనుల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి..    

    – సురేశ్‌నాయక్, పల్లెగడ్డతండా, మద్దూరు

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top