మృత్యుఘోష..!

మృత్యుఘోష..!


ఎనిమిది మంది చిన్నారులను బలిగొన్న ఈత సరదా

- కృష్ణానదిలో మరో ఇద్దరు యువకుల గల్లంతు

- నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో విషాదం




పీఏపల్లి/కేతేపల్లి/సూర్యాపేట క్రైం: ఈత సరదా ఎనిమిది మందిని బలిగొనగా.. మరో ఇద్దరు యువకులను గల్లంతు చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వేర్వేరు చోట్ల ఈ విషాదకర ఘటనలు మంగళవారం చోటు చేసుకున్నాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన పసల లూర్ధురాజు కుమార్తెలు పూజిత(13), సాత్విక(10), పసల రాజు కుమార్తె తేజ(10), కుమారుడు సిరిల్‌(8), పసల ఆరోగ్యయ్య కుమారుడు పవన్‌కుమార్‌(14) స్థానిక నిమ్మలమ్మ చెరువులో ఈతకు వెళ్లారు. ఒకరి తర్వాత ఒకరు చెరువులోకి దిగారు. అయితే చిన్నారుల్లో ఎవరికీ ఈత రాకపోవటంతో నీట మునిగిపోయారు. సాయంత్రమైనా ఎవరూ ఇంటికి రాకపోవటంతో ఇరుగుపొరుగు వారు, బంధువుల ఇళ్లలో కుటుంబీకులు వెతికారు. వ్యవసాయ బావులున్న రైతులు చెరువు ఒడ్డున ఉన్న చెప్పులు, బట్టలను చూసి చెప్పడంతో తల్లిదండ్రులు వెళ్లి తమ పిల్లలేనని గుర్తించి భోరున విలపించారు. పోలీసులు మంగళవారం రాత్రి మృతదేహాలను బయటకు తీశారు.



కొర్రోనితండాలో ఇద్దరు బాలికలు

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం కొర్రోనితండాకు చెందిన గోమ్లా కుమార్తె సరిత వివాహం ఈ నెల 23న జరిగింది. ఈ వేడుకకు బంధువులైన ఇదే మండలం కొల్‌ముంతలపహాడ్‌ పరిధి రామునిగుండ్లతండాకు చెందిన మీత్య కుమార్తె రమావత్‌ మంజుల(12), గుర్రంపోడు మండలం జువ్విగూడెం గ్రామపంచాయతీ పరిధి మెగావత్‌తండాకు చెందిన పంతుల కుమార్తె మెగావత్‌ మౌనిక(14) హాజరయ్యారు. ఇద్దరు కలసి స్థానిక ఎస్‌ఎల్‌బీసీ ఓపెన్‌ కెనాల్‌లో బట్టలు ఉతికి స్నానం చేసేందుకు నీటిలో దిగారు. ఈత రాకపోవడంతో మంజుల నీటిలో మునిగిపోతున్న విషయాన్ని గమనించిన మౌనిక కాపాడేందుకు కెనాల్‌లో దిగగా ఇద్దరు మునిగి చనిపోయారు.



సూర్యాపేటలో బాలుడు..

సూర్యాపేట పట్టణం తాళ్లగడ్డకు చెందిన సిద్ధిక్‌అలీ, జెరినా దంపతుల రెండో కుమారుడు యూనుస్‌అలీ(11) స్నేహితులతో కలసి ఆడుకునేందుకు వెళ్తున్నానని కాలనీకి సమీపంలోని సద్దుల చెరువులోని పెద్దపెద్ద గుంతల్లో నిలిచి ఉన్న నీటిలో స్నేహితులతో కలసి ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు యూనుస్‌ అలీ అందులో మునిగి మృతిచెందాడు.



కృష్ణా నదిలో ఇద్దరు యువకులు..

మఠంపల్లి (హుజూర్‌నగర్‌): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం నాగార్జున సిమెంట్‌ పరిశ్రమలో బర్నర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు కుమారుడు నవతేజ (22), అదే పరిశ్రమలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌ కుమారుడు రాజేశ్‌(21) ఇదే పరిశ్రమలో ఎలక్ట్రిషియన్‌ విభాగంలో పనిచేస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో మంగళవారం సాయంత్రం మట్టపల్లికి వెళ్లి కృష్ణానదిలో హై లెవల్‌ వంతెన వద్ద ఈతకు దిగారు. ప్రమాదవశాత్తు ఇద్దరూ నీటిలో మునిగి గల్లంతయ్యారు. రాత్రి వరకు గాలించినా యువకుల ఆచూకీ లభ్యం కాలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top