కష్టాలకే.. కన్నీళ్లొచ్చే..!

కష్టాలకే.. కన్నీళ్లొచ్చే..! - Sakshi


చందంపేట: ఈ దయనీయ గాథ చదివితే కష్టాలకే కన్నీళ్లు తెప్పిస్తుంది. నాలుగు నెలల క్రితం మూర్ఛవ్యాధితో తండ్రి మరణం.. తల్లి మానసిక రోగి.. సభ్య సమాజం చేత వెలివేయబడి ఊరికి దూరంగా ఉంటున్న కుటుం బం అది. అంతలోనే మరో కష్టం వచ్చి పడింది. ఆ కుటుంబానికి పెద్ద దిక్కయిన తల్లి కూడా మరణించింది. దీంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. ఈ హృదయవిదారక సంఘటన నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముర్పునూతల గ్రామపంచాయతీ పరిధిలోని హంక్య తండా లో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన రమావత్ జగ్గుకు ఫిట్స్, జగ్గు భార్య ద్వాళి మానసిక రోగి. ఎవరితోనూ మాట్లాడలేదు. కొడుకు దేవోజీ మూగవాడు.



కూతురు అమ్ములు తెల్దేవర్‌పల్లి పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. కొడుకు దేవోజీకి తండ్రికి ఉన్న రోగం వచ్చిందేమోనన్న అనుమానంతో స్కూల్‌కు వస్తే తమకు కూడా ఆ రోగం ఎక్కడ సోకుతుందో ఏమోనని తోటి విద్యార్థులచే వివక్షకు గురయ్యాడు. తల్లిదండ్రులకున్న జబ్బు పిల్లల ద్వారా తమ బిడ్డలకు ఎక్కడ సోకుతుందోనన్న అనుమానంతో పిల్లలను వెలి వేసే పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలోనే  గ్రామం నుంచి దూరంగా వెళ్లాలని రోజూ  ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేవారు. దీంతో హైదరాబాద్‌లో ఉంటున్న జగ్గు తమ్ముడు గోప్యాకు గ్రామస్తులు విషయం తెలిపారు. దీంతో గోప్యా తన అన్న కుటుంబం కోసం హంక్యతండాలో మూతపడ్డ బడి భాగంలో చిన్న ఇంటిని నిర్మించాడు.



మూడేళ్ల నుంచి వారు ఊరికి దూరంగా ఉన్న ఆ ఇంట్లోనే నివసిస్తూ ఉన్నారు. వ్యాధి ముదరడంతో నాలుగు నెలల క్రితం జగ్గు మరణించాడు. మరణించిన సమయంలో కనీసం అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఆ గ్రామస్తులు కనీసం చేయి వేయడానికి కూడా రాలేదు. అయితే ఆ కుటుంబం ఎదుర్కొం టున్న ఇబ్బందిని.. ‘మానవత్వం మంట కలిసింది’ అనే శీర్షికన అప్పట్లో ‘సాక్షి’ మెయిన్‌లో ప్రచురించింది. దీనికి అప్పట్లో స్పందించిన అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఆ కుటుంబానికి చేదోడు, వాదోడుగా నిలి చారు. రేషన్‌కార్డు, పెన్షన్, ఆర్థిక సహాయం అందించారు.  ఊరికి దూరంగా ఉన్న కుటుం బాన్ని గ్రామంలోని ఇంట్లోనే ఉండేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఆ కుటుంబానికి పెద్ద దిక్కైన ద్వాళి కూడా తీవ్రమైన కడుపునొప్పితో ఆదివారం రాత్రి మృతి చెందింది.



 పట్టెడన్నం పెట్టేవారెవరు?

 తల్లి, తండ్రి ఇద్దరు మృతి చెందడంతో చిన్నారులు అమ్ములు, దేవోజీ అనాథలుగా మారారు. వీరికి పట్టెడన్నం పెట్టే నాథుడు కరువయ్యాడు. ఇంత జరిగినా ఆ గ్రామంలో మాత్రం మార్పు రాలేదు. తండ్రి విషయంలో ఎటువంటి వివక్ష ఎదుర్కొన్నారో ఇప్పుడూ కూడా అదే పరిస్థితి నెలకొంది. ద్వాళికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాలేదు. చందంపేట ఎంపీడీవో నర్సింహులు, ఎస్‌ఐ నాగభూషణ్‌రావు చొరవతో ద్వాళికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అనాథలైన ఆ ఇద్దరు చిన్నారుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top