‘ఇన్‌పుట్‌’తోనూ ఎగనామం

‘ఇన్‌పుట్‌’తోనూ ఎగనామం - Sakshi


- బోధన్‌ స్కాంలో కొత్తకోణం..

- అడ్రస్‌ లేని వ్యాపార సంస్థల నుంచి బోగస్‌ ఇన్వాయిస్‌లు

- ఏటా రూ.కోట్లలో పన్ను ఎగవేతలు..

- మిల్లర్ల మరో అక్రమాల బాగోతమిది..




సాక్షి, నిజామాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బోధన్‌ స్కాంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటి వరకు బోగస్‌ చలానాలతోనే రూ.వందల కోట్లు పన్ను ఎగవేసినట్లు తేలింది. ఇది కాకుండా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ పేరుతో కూడా కొందరు రైస్‌ మిల్లర్లు సర్కారుకు పెద్ద మొత్తంలో ఎగనామం పెట్టినట్లు తాజాగా వెలుగులోకి వస్తోంది. చాలా మంది రైస్‌ మిల్లర్లు బోగస్‌ చలానాలతో పన్ను ఎగవేస్తే.. పెద్ద మొత్తంలో టర్నోవర్‌ చేసిన కొందరు మిల్లర్లు మాత్రం ఇలా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ దారిని ఎంచుకున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ విచారణ అధికారుల దృష్టికి వచ్చింది. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన మిల్లర్లు పన్ను ఎగవేసేందుకు వ్యాపారుల వద్ద కొన్నట్లు బోగస్‌ ఇన్వాయిస్‌లతో సర్కారును బురిడీ కొట్టించారు.



ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ అంటే..?

వ్యాపారి గానీ, వ్యాపార సంస్థ గానీ ఆ నెలలో చేసిన క్రయవిక్రయాలపై వ్యాట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంలో సరుకు క్రయవిక్రయాల్లో పెరిగిన విలువ ఆధారంగా పన్ను మొత్తం కూడా పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యాపారి రూ.లక్ష విలువ చేసే వంద క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తే దానిపై రూ.4వేలు (4 శాతం) వ్యాట్‌ చెల్లించాలి. ఆ వ్యాపారి ఈ ధాన్యంపై లాభం, ఇతర ఖర్చులు కలుపుకుని రూ.1.25 లక్షలకు ఓ రైస్‌ మిల్లరుకు విక్రయించాడనుకుందాం. కొనుగోలు చేసిన రైస్‌ మిల్లరు అదనంగా కలిసిన రూ.25 వేల విలువకు రూ.వెయ్యి చెల్లిస్తే సరిపోతుంది. ఆ రూ.4 వేల పన్ను మొత్తాన్ని ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ కింద చూపుతారు.



ఆడిట్‌ అధికారులకు భారీ నజరానాలు...

జిల్లాలోని కొందరు రైస్‌ మిల్లర్లు బోగస్‌ వ్యాపార సంస్థలు సృష్టించి.. వాటి పేరుతో నకిలీ ఇన్వాయిస్‌లు తయారు చేసి, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ పేరుతో తక్కువ పన్ను కట్టారని అధికారుల దృష్టికి వచ్చింది. ఈ విధంగానూ వాణిజ్య పన్నుల శాఖకు ఏటా రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టారు. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ చూపిస్తున్న రైస్‌ మిల్లర్ల రికార్డులను పరిశీలించాల్సిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రతి నెలా మామూళ్లతో సరిపెట్టుకోవడంతో ఈ దందా యథేచ్ఛగా సాగింది. అప్పుడప్పుడు తనిఖీలకు వెళ్లే ఆడిట్‌ విభాగానికి పెద్ద మొత్తంలో నజరానాలు ముట్టజెప్పడం ఇక్కడ ఆనవాయితీ. ప్రస్తుతం బోధన్‌ స్కాంలో సూత్రధారులైన ట్యాక్స్‌ కన్సల్టెంట్‌ శివరాజ్, అతని కుమారుడు సునీల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సీఐడీ అధికారులు... ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ కుంభకోణంపై కూడా దర్యాప్తు చేస్తే మరికొంత మంది రైస్‌మిల్లర్ల బాగోతాలు బట్టబయలయ్యే అవకాశాలున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top