సమగ్ర చర్చ

సమగ్ర చర్చ - Sakshi


ముకరంపుర: ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అధికారులతో తాగునీరు, కరెంటు, పింఛన్లు, విద్య, వాటర్‌గ్రిడ్, సన్నబియ్యం, హరితహారం, ఎస్సీ కార్పొరేషన్ నిధులు తదితర అంశాలపై సుధీర్ఘంగా సమీక్షించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసమిబసు, ఎంపీ వినోద్‌కుమార్, పార్లమెంటరీ కార్యదర్శి వి.సతీష్‌కుమార్, సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, విద్యాసాగర్‌రావు, పుట్ట మధు, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో దాదాపు ఐదు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు ప్రభుత్వ లక్ష్యాలను నిర్దేశిస్తూనే పైన పేర్కొన్న అంశాల్లో జరుగుతున్న అక్రమాలు, అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి ఘాటుగా స్పందించడంతోపాటు పలు ఆదేశాలను జారీ చేశారు.

 

ఈసారి కరువు ప్రభావం అధికంగా ఉన్నందున ఫిబ్రవరి నుంచి తాగునీటి సమస్య అధికమవుతోంది. దీనిని నివారించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ఇకపై మంచినీళ్లు లేక బిందెలు పట్టుకుని రోడ్లపైకి వచ్చే పరిస్థితి రానీయొద్దు. బోర్లు, బావులు, మంచినీటి ట్యాంకర్లను పెద్ద ఎత్తున లీజుకు తీసుకొనైనా ప్రజలకు మంచినీళ్లు అందించాల్సిందే.

 

రబీలో విద్యుత్ డిమాండ్ తగ్గిన ందున పంటలకు ఆరుగంటల ఉచిత విద్యుత్‌ను రెండు దశల్లో సరఫరా చేయండి. బోర్లు, బావుల్లో నీళ్లు లేకపోవడం వల్ల ఒకేసారి ఆరు గంటలు సరఫరా చేయడంవల్ల రైతులకు ప్రయోజనం కలగడం లేదు. అట్లాగే ట్రాన్స్‌ఫార్మర్ ఫెయిల్ అయిన 24 గంటల్లోనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను మార్చండి. ట్రాన్స్‌ఫార్మర్ మార్పిడి కేంద్రాలను విస్తరించండి.

 

రాబోయే రోజుల్లో మంత్రులతోపాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులంతా చెరువుల వద్ద టెంట్లు వేసుకుని కూర్చుం టాం. యుద్ధప్రాతిపదికన చెరువుల పునరుద్దరణ కార్యక్రమం జరగాల్సిందే. అవసరమైతే ప్రైవేటు ఏజెన్సీలతో అం చనాలు రూపొందించండి. తగిన నిధులు మంజూరు చేస్తాం.

 

హరితహారంలో భాగంగా సాధ్యమైనంత మేరకు ఎక్కడికక్కడ స్థానికంగానే మొక్కలను కొనుగోలు చేయండి. కొంత ధర ఎక్కువ వెచ్చించైనా కొనుగోలు చేయండి. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

 

పాఠశాలల్లో సన్నబియ్యం భోజన పథకం విజయవంతమైతే అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ప్రవేశపెడతాం. సన్నబియ్యం భోజనం వల్ల పాఠశాలల్లో హాజరుశాతం పెరుగుతోందనే నమ్మకం కలుగుతోంది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశముంది.

 

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలిస్తామని అనేక ఏజెన్సీలు ఒక్కో వ్యక్తి నుంచి రూ.లక్ష నుంచి రూ.3లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ ఉద్యోగాలు త్వరలో పర్మినెంట్ అవుతాయని ఆశ జూపడంతో నిరుద్యోగులు మోసపోతున్నారు. త్వరలో దీనిపై రహస్య విచారణ జరిపి బాధ్యులను శిక్షిస్తాం.

 

ఎంతో గొప్ప ఆశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘ఆసరా’లో తప్పటడుగులు దొర్లాయి. సీఎం ఆశయం నెరవేరలేదు. పింఛన్లలో అక్రమాలు జరిగాయి. అర్హులకు పింఛన్లు అందలేదు. సామాజిక తనిఖీ నిర్వహిస్తే 20 శాతాని కిపైగా పింఛన్లు పోవడం ఖాయం. అక్రమార్కులను తేలిగ్గా వదిలిపెట్టం. కఠినచర్యలు తీసుకుంటాం. ఒక్కసారి సస్పెం డ్ చేసిన తరువాత మళ్లీ వారికోసం పైరవీలు చేసేందుకు రాజకీయ నాయకులెవరూ ముందుకు రాకుండా చూస్తాం.

 

దళితుల భూమి కొనుగోలు అంశంపై ప్రత్యేక కమిటీలు వేసి భూ పంపిణీని వేగవంతం చేస్తాం. భూ పంపిణీ నిరంతర ప్రక్రియే తప్ప పంద్రాగస్టు, రిపబ్లిక్ వేడుకల్లో పంపిణీకే పరిమితం చేయబోం.

 

జవాబుదారీగా వ్యవహరించాలి

గత ప్రభుత్వాల హయాంలో ప్రజాధనం దుర్వినియోగం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో గుణాత్మక మార్పు రాబోతుంది. పద్ధతి మారింది.. మనమూ మారాలి.. ప్రతీ రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజల అవసరాలే ప్రభుత్వ నిర్ణయాలు.. జవాబుదారీతనంపైనే ప్రజల భవిష్యత్తు ఆధారపడివుంది. అధికారికంగా డీఆర్‌సీ నిర్వహణ లేకపోవడంతో ఎప్పటికప్పుడు సమస్యలపై సమీక్షించుకుందామని మంత్రి అన్నారు. కేవలం చర్చల కోసం కాకుండా అమలు పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.

 

సమస్యలపై చర్చ ఇలా..

 భూగర్భజలాలు ఎనిమిది మీటర్లలోతుకు పడిపోయాయని, ఫిబ్రవరి నుంచి సమస్య తలెత్తే ప్రమాదముందని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ వివరించారు. బోర్లు, పంపుసెట్ల రిపేర్, తాగునీటి ప్రణాళిక కోసం రూ.18.63 కోట్ల అంచనాతో ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.



బోర్‌వెల్స్‌కు ప్రతిపాదనలు పంపామని సమస్యలను గుర్తించి ఫిబ్రవరి నుంచి తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటామని వివరించారు. జిల్లాలో వాటర్‌గ్రిడ్ కోసం రూ.5262కోట్లతో ప్రాథమిక అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో సర్వే పూర్తి చేసి ఏప్రిల్‌లో టెండర్లు ఆహ్వానిస్తామని వివరించారు.

 

రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ.. ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకానికి రూ.8కోట్లు మంజూరు కాగా రూ.4.50 కోట్లు విడుదలయ్యాయని, దానికి హెచ్‌డీ పైపు వాడాల్సి ఉండగా డీఐ పైపు వేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన పనులకు ఏడాదిగా టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. త్వరలోనే పనులు పూర్తి చేస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ పేర్కొన్నారు.

 

ఎంపీ వినోద్‌కుమార్.. వేములవాడలోని వాటర్‌ట్యాంకు నుంచి నీటి సరఫరాకు కరెంటు సమస్య ఉందని, ట్రాన్స్‌ఫార్మర్‌కు కెపాసిటీ సరిపోవడం లేదని, సబ్‌స్టేషన్ అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. ట్రాన్స్‌కో డీఈ స్పందిస్తూ ట్రాన్స్‌ఫార్మర్ 3.15 కేవీ నుంచి 5 కేవీకి అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపుతామని, రెండింటికీ ఒకే ఖర్చు అవుతుందని చెప్పారు. మంత్రి ఈటెల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చిన్న సమస్యలను వారంలోగా పరిష్కారం చేయాలని ఆదేశించారు.

 

హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌బాబు.. వ్యవసాయానికి నిరంతరంగా ఆరుగంటల విద్యుత్ ఇస్తే బావులు ఎండిపోతున్నాయని, రెండు విడతలుగా కరెంటు ఇవ్వాలని సూచించారు.

 

మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. నియోజకవర్గంలో 11 కేవీ వైర్లతో రైతులు చనియారన్నారు. మానకొండూర్ మండలం లక్ష్మీపూర్, కల్వలగ్రామాల్లో 11 కేవీ వైర్ మార్చాలన్నారు. విద్యుత్ సిబ్బంది ప్రవర్తన బాగాలేదని, రైతులపై కేసులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి.. కోహెడ మండలం ముద్దన్నపేట విద్యార్థినులు రాత్రిపూట బస్సు దిగి ఇంటికి వెళ్లేందుకు జంకుతున్నారని, లైట్లు లేక సమస్య ఉందని, ట్రాన్స్‌కో అధికారులు స్పందించాలన్నారు.

 

మంత్రి ఈటెల స్పందిస్తూ.. జిల్లావ్యాప్తంగా 11కేవీ లైన్ల కోసం ప్రైవేట్ తన్కీబేస్‌లో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. లూజ్‌లైన్ మిడ్‌పోల్స్ ఏర్పాటుపై సమీక్షించుకోవాలన్నారు.

 

జిల్లాలో అంబాల, శంభునిపల్లి, సిరిసేడు, గోపాలపూర్ చెక్‌డ్యాంలను నిర్మించామని నీటిపారుదల శాఖ ఎస్‌ఈ తెలిపారు. జిల్లాలో ఇంజనీర్ల కొరత ఉందన్నారు.

 

హరితహారంలో భాగంగా జిల్లాలో 6.24 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా రూ.1.72 కోట్లు విడుదలయ్యాయని, ఇప్పటివరకు 1.74 కోట్ల మొక్కలు నాటి 25 శాతం పూర్తి చేశామని డీఎఫ్‌వో, డ్వామా పీడీ గణేశ్, ఉద్యానశాఖ ఏడీ జ్యోతి తెలిపారు. టేకు, ఎర్రచందనంతో పాటు మామిడి మొక్కలను నాటుతుండగా, జిల్లాలో మామిడి మొక్కల కొరత ఉందని తెలిపారు. ప్రైవేట్ నర్సరీల ద్వారా ధర ఎక్కువైనా మొక్కలు కొనాలని మంత్రి సూచించారు.

 

పాఠశాలల్లో కనీస సౌకర్యాలకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని డీఈవో లింగయ్య తెలిపారు. మధ్యాహ్నభోజనం, సన్నబియ్యం పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. నాలుగు మండలాల్లోని కొన్ని పాఠశాలల్లో సన్నబియ్యం సరిపడా పంపిణీ కాలేదని, ఈ సమస్య పునరావృతం కాకుండా చూసుకుంటామని పేర్కొన్నారు.

 

ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి.. అంధుల కోసం జిల్లాలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరగా, ఎమ్మెల్యే రసమయి.. ఇల్లంతకుంట పాఠశాలల్లో నీరు కొనుక్కుని తాగుతున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంకర్ ద్వారా నీళ్లు సరఫరా చేయాలన్నారు.

 

దళితులకు భూపంపిణీ కింద పత్రాలిచ్చినప్పటికీ రిజిస్ట్రేషన్ చేయలదేని మంథని ఎమ్మెల్యే పుట్టమధు అన్నారు. ప్రభుత్వ భూములు కొంత మంది చేతుల్లోనే ఉన్నాయని, స్థానిక తహశీల్దార్ సర్కారు భూమిలో గుడిసెలు వేయించి తీయించడం లేదన్నారు. రెవెన్యూ అదాలత్‌లు పెట్టి భూ సమస్యలు పరిష్కరించాలన్నారు. దీంతో భూముల కొనుగోలుపై స్పెషల్ డ్రైవ్ పెట్టాలని మంత్రి ఈటెల సూచించారు.

 

సదరంపై సమరం...

బోగస్ వికలాంగుల సర్టిఫికెట్లపై దుమారం రేగింది. వికలాంగుల పింఛన్ కోసం అర్హులను పక్కనపెట్టి అనర్హులను లబ్దిదారులుగా చేర్చారని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్.. సదరం శిబిరంలో నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన వారిపై చర్యలేవని ప్రశ్నించారు. బాధ్యతలేని వైద్యుల వల్లే అర్హులకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. కాటారంలో 22 బోగస్ వికలాంగ సర్టిఫికెట్లు ఒకే గ్రామంలో ఇచ్చారని, ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.8-9వేలు తీసుకున్నారని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు పేర్కొన్నారు.



భీవండి, షోలాపూర్ ప్రాంతాలకు వలస వెళ్లిన చేనేత కార్మికులు వృద్దాప్యంలో తిరిగి వస్తే పింఛన్లు మంజూరు చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కోరారు. బోగస్ సర్టిఫికెట్లతో కొందరు అనర్హులు పింఛన్లు పొందుతుంటే నిజమైన అర్హులు తమ కళ్లమందు కనబడుతున్నారని చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.



మంత్రి స్పందిస్తూ.. అర్హులైన వికలాంగులందరికీ పింఛన్లు ఇచ్చేందుకు అన్ని నియోజకవర్గాల్లో సదరం క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. జోగినులకు, భర్త వదిలిన మహిళలకు పింఛన్లు ఇవ్వడానికి పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 3.86 లక్షల మందికి పెన్షన్లు మంజూరయ్యాయని డీఆర్‌డీఏ పీడీ విజయగోపాల్ తెలిపారు. రూ.వెయ్యి సింగరేణి పింఛన్ పొందుతున్న కార్మికులకు ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు ఉత్తర్వులు వచ్చాయన్నారు. అభయహస్తం కింద ప్రతినెల రూ.500 పింఛన్ ఇస్తామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top