76,545 పోస్టులకు మోక్షమెప్పుడో


హైదరాబాద్:

 విభజన సమస్య లేకున్నా భర్తీకి నోచుకోని జిల్లా స్థాయి ఖాళీలు

 జోన్‌ల వ్యవస్థ కొనసాగితే మరో 20 వేల ఖాళీల భర్తీకీ ఢోకా లేదు

 అయినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. ఆవేదన చెందుతున్న నిరుద్యోగులు

 

 రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా పోస్టుల భర్తీ వ్యవహారం

 ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. క్షేత్ర స్థాయిలో

 భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా.. వాటి భర్తీకి చేపట్టాల్సిన చర్యల్లో వేగం పుంజుకోవడం లేదు. రాష్ట్ర విభజన జరిగి 10 మాసాలు పూర్తి కావస్తున్నా ఖాళీల భర్తీ ముందుకు సాగడం లేదు. కొత్త రాష్ట్రం ఏర్పడగానే ఉద్యోగ నోటి ఫికేషన్లు వస్తాయని భావించిన నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదు.



 గ్రూపు-1, గ్రూపు-2, లెక్చరర్, ఇంజనీర్ తదితర పోస్టుల కోసం లక్షల మంది ఏళ్ల తరబడి శిక్షణలు

 తీసుకుంటూనే ఉన్నారు. కొత్త రాష్ట్రంలో నోటిఫికేషన్ల జారీకి సమయం పడుతుందని కొన్నాళ్లు.. సిలబస్ మార్పుల పేరుతో ఇంకొన్నాళ్లు, ఎన్నికల పేరుతో మరి కొన్నాళ్లు.. ఇలా కారణాలు ఏమైనా

 నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడక తప్పడం లేదు. ఇక పరీక్షల విధానం, సిలబస్‌లో మార్పుల ఖరారుకు ఇంకెంత కాలం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.




రాష్ట్రంలో ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటివరకు 44 శాఖల్లోని ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకున్నారు. ఇంకా మరో 110 విభాగాల్లోని ఉద్యోగుల నుంచి ఆప్షన్లను తీసుకోవాల్సి ఉంది. ఇక ఆప్షన్లు ఇచ్చిన 44 శాఖల్లోని ఉద్యోగుల విభజన పూర్తి కాలేదు. దీంతో రాష్ట్ర స్థాయి, మల్టీ జోనల్, విభాగాధిపతి కార్యాలయాల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇవి కాకుండా జిల్లా స్థాయిలోనే 76,545 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ జిల్లాల్లోని వివిధ శాఖల కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టుల భర్తీకి విభజన సమస్య లేనేలేదు. ప్రభుత్వం తలచుకుంటే ఈ పోస్టుల భర్తీకి పెద్దగా అడ్డంకులు లేవు. అయినా ప్రభుత్వం దృష్టి సారించడం లేదని నిరుద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.



మరో 20 వేల పోస్టులు..

రాష్ట్రంలో జోన్ల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టకుండా ప్రస్తుతం ఉన్న రెండు జోన్లను యథావిధిగా కొనసాగిస్తే మరో 20,591 పోస్టుల భర్తీకి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే రాష్ట్రంలో రెండు జోన్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో వాటిని మూడు లేదా నాలుగు జోన్లకు పెంచాలన్న వాదన ఉంది. ఇదీ ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి లేదు. జోన్ల పునర్‌వ్యవస్థీకరణ చేయాలంటే రాష్ట్రపతి ఆమోదంతో 371(డి) అధికరణానికి సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పట్టనుంది. అందుకే ప్రస్తుతమున్న రెండు జోన్లను కొనసాగిస్తూ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని, తద్వారా 96 వేల ఉద్యోగాలను భర్తీ చేయవచ్చని నిరుద్యోగులు కోరుతున్నారు.



టీచర్ పోస్టుల భర్తీలో గందరగోళం..

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వ్యవహారమైతే మరింత గందరగోళంగా తయారైంది. ఈ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తారో చేయరో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతుండగా, దాదాపు 3 లక్షల మంది నిరుద్యోగులు మాత్రం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే వేసవి సెలవుల్లో స్కూళ్లలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టాలని విద్యాశాఖ ఆలోచిస్తోంది. తద్వారా ఉన్న ఉపాధ్యాయులనే అవసరం ఉన్న స్కూళ్లకు పంపించే ప్రణాళికలపై దృష్టి పెట్టింది. దీంతో కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందా? రాదా? అనే తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,702 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ తాజాగా లెక్కలు వేసింది. మరి వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇస్తుందా? లేదా? అనే విషయాన్ని కూడా ప్రభుత్వమే తేల్చాల్సి ఉంది. గత వారంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ను మార్చి మూడో వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో జారీ చేస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగినా అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top