‘గోలీ’మాల్..!

‘గోలీ’మాల్..! - Sakshi


- ఆస్పత్రుల్లో అనుమతుల్లేని మందుల షాపులు  వైద్యుడు ఒకటి రాస్తే ..రోగికి ఇచ్చేది మరోటి

- నిబంధనలు ఉల్లంఘించిన 76 షాపులకు నోటీసులు

 

సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలోని పలు ఫార్మసీ దుకాణాలు మందుల విక్రయాల్లో మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. లెసైన్స్ లేకుండా దుకాణం నిర్వహించడంతో పాటు ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు మందులు అమ్ముతున్నా యి. వైద్యుడు ఒక మందు రాస్తే.. ఫార్మసిస్ట్, డ్రగ్గిస్టులు మరొక రకం మందులను రోగులకు అంటగడుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో ని చిన్నచిన్న మందుల దుకాణాలే కాదు హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులు సైతం నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి.



ఏలాంటి ఫార్మసీ అర్హతలు లేనివారికి అతి తక్కువ వేతనమిచ్చి షాపుల్లో పని చేయిం చుకుంటున్నాయి. అంతేకాదు అనుమతి లేకుం డా ఒకే ఆస్పత్రి భవనంలో మూడు నుంచి నాలుగు ఫార్మసీ కేంద్రాలను నడపుతున్నాయి. వీటిలో చాలా వరకు నాసిరకం మందులే విక్రయిస్తున్నారు. ఔషధ నియంత్రణ విభాగం ఇన్‌స్పెక్టర్లు ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో ఫార్మసీల మాయాజాలాలు, విస్తుగొలిపే వాస్తవాలు ఒక్కోటి బయటపడ్డాయి.

 

 

రాజధానిలో అత్యధికం..

హైదరాబాద్, రంగారెడ్డి సహా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో ఇటీవల ఔషధ నియంత్రణ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. పది ప్రముఖ ఆస్పత్రులు తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడగా, మరో 86 ఆస్పత్రులు, ఫార్మసీ కేంద్రాలు స్వల్ప ఉల్లంఘనలకు  పాల్పడినట్లు గుర్తించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే.. ఇక్కడ 20 కార్పొరేట్ ఆస్పత్రులు ఉండగా ఇందులో 15 ప్రముఖ ఆస్పత్రులు నిబంధనలను ఉల్లంఘిస్తూ భారీ ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. వీటిపై ఇప్పటికే అధికారులు కేసులు కూడా నమోదు చేశారు.

 

ఇంపోర్టెడ్ పేరుతో దోపిడీ..

ఆరోగ్య బీమా, ఆరోగ్య భద్రత, సీజీహెచ్‌ఎస్, ఇతర హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఉన్న రోగులు వస్తే చాలు ఈ ఆస్పత్రి ఫార్మసీలు అందినకాడికి దోచుకుంటున్నాయి. ఇన్ పేషెంట్లకు తక్కువ ఖరీదు మందులు ఇచ్చి ఎక్కువ ధర ఉన్న మందులు ఇచ్చినట్లు బిల్లులు చూపెడుతున్నాయి. ఇక సర్జికల్ వస్తువులు, హృద్రోగులకు అమర్చే స్టెంట్లు, కృత్రిమ మోకాళ్లు, విరిగిన ఎముకలను జాయింట్ చేసే స్టీల్ రాడ్డులు ఎంఆర్‌పీ కన్నా అధిక ధరకు విక్రయిస్తున్నాయి. ఇంపోర్టెడ్ డ్రగ్ కోటెడ్ స్టెంట్ల పేరుతో స్వదేశీ కంపెనీలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన నాసిరకం స్టెంట్లను అమర్చుతున్నారు. గుండె రక్త నాళాల లోపల వీటిని అమర్చుతుండటంతో ఎవరూ గుర్తించలేక పోతున్నారు. ఏ రోగికి ఏ కంపెనీ పరికరం అమర్చారు...? దాని ఖరీదు ..? రోగి ఎంత చెల్లించారు... వంటి వివరాలు ఎప్పటికప్పుడు రికార్డు చేయకుండా ఈ షాపులు ఐటీ ఎగవేతకు పాల్పడుతున్నాయి.

 

ప్రధాన ఉల్లంఘనలు ఇవీ..

- లెసైన్స్ లేకుండా మందుల షాపు నిర్వహించడం

- ఎంఆర్‌పీ కన్నా ఎక్కువ ధరకు మందుల విక్రయం

- సెకండ్ క్వాలిటీ, గడువు ముగిసిన మందుల అమ్మకం

- కోల్డ్ స్టోరేజీ నిర్వహణ, రికార్డుల నిర్వహణలో లోపం

- డ్రగ్ కంట్రోల్ యాక్ట్ 1940 ఉల్లంఘన

 

 

జిల్లా             తీవ్ర ఉల్లంఘనలు            స్వల్ప ఉల్లంఘనలు

 హైదరాబాద్            04                        15

 ఆదిలాబాద్            01                         06

 కరీంనగర్              01                         12

 వరంగల్               01                          05

 ఖమ్మం                02                         05

 నల్లగొండ              01                         13

 నిజామాబాద్          -                          10

 మహబూబ్‌నగర్     -                           05

 మెదక్                  -                           15

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top