7,027 ఎకరాల్లో పంట నష్టం


సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రెండు రోజుల పాటు జిల్లాలో కురిసిన వర్షాల మూలంగా 7,027 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పంట నష్టంపై రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించిన వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. మార్చి రెండో తేదీన అత్యధికంగా 8.3 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం జిల్లాలో నమోదైంది. అలంపూర్, కొల్లాపూర్, వీపనగండ్ల, పెబ్బేరు, జడ్చర్ల, భూత్పూరు మండలాల్లో అత్యధికరంగా వర్షం కురిసింది.



అయితే వీపనగండ్ల, కొల్లాపూర్, అలంపూర్, పెబ్బేరు మండలాల్లో వర్షం, ఈదురుగాలులు, వడగండ్ల మూలంగా పంటలు దెబ్బతిన్నాయి. వీపనగండ్ల మండలం చిన్నమరూరు, పెద్దమరూరు, కొప్పునూరు, వెల్టూరు, పెద్దదగడ, బెక్కెం, జటప్రోలు, లక్ష్మీపూర్ గ్రామాలు పంట నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు కొల్లాపూర్ మండలం సిరిసాల, మల్లేశ్వరం, పెబ్బేరు మండలం యాపర్ల, అలంపూర్ మండలం లింగన్‌వాయి మండలాల్లోనూ పంటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న, శనగ పంటలు తీవ్రంగా దెబ్బతినగా, మినుము, పెసర, వేరుశనగతో పాటు బీన్స్, ఉల్లి, మిర్చి పంటలు కూడా దెబ్బతిన్న పంటల జాబితాలో ఉన్నాయి. మామిడి తోటలకు మాత్రం ప్రస్తుత వర్షాలు ఊతమిచ్చేవిగా ఉన్నాయని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో పంటనష్టంపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తున్నట్లు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు భగవత్ స్వరూప్ ‘సాక్షి’కి వెల్లడించారు.

 

 పంట నష్టం వివరాలు

 పంట                  నష్టం

                        (ఎకరాల్లో)

 మొక్కజొన్న        3,554

 శనగ                    1,123

 మినుము                 612

 పెసలు                     376

 వేరుశనగ                 400

 బీన్స్                       102

 చెరుకు                    216

 మిర్చి                     279

 నువ్వులు                280

 ఇతరాలు                  85

 మొత్తం               7,027

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top