60 మంది గర్భిణులు.. 12 గంటల ప్రసవ వేదన

60 మంది గర్భిణులు.. 12 గంటల ప్రసవ వేదన

- నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రిలో దారుణం పురిటి నొప్పులతోనే ఆందోళన

- గైనకాలజిస్ట్‌లు లేక గర్భిణులను తిప్పి పంపిన ఆస్పత్రి సిబ్బంది 

 

సాక్షి, నాగర్‌కర్నూల్‌: 60 మంది గర్భిణులు.. 12 గంటల ప్రసవ వేదన.. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నరకయాతన అనుభవించిన దారుణమిది. ప్రసవ వేదనతో ఆస్పత్రికి వచ్చి పండంటి బిడ్డతో తిరిగి ఇళ్లకు వెళ్లాలనుకున్న వారి ఆశలపై అధికారులు నీళ్లుచల్లారు. డాక్టర్లు లేరు పొండి.. అంటూ వారిని ఆస్పత్రి నుంచి సిబ్బంది పంపివేయడంతో తీవ్ర మనోవేదనకు గురై.. పురిటి నొప్పులతోనే రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. ఆస్పత్రుల్లో మహిళలకు ప్రసవాలు జరిపించడంలో విఫలమయ్యారని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలంటూ గర్భిణులు, వారి బంధువులు రాస్తారోకో చేస్తూ నినాదాలు చేశారు. 

 

గర్భిణులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేసుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. వారికి రూ.12 వేల నజరానాతోపాటు కేసీఆర్‌ కిట్‌ను అందిస్తోంది. దీంతో ఆస్పత్రిలో ప్రసవాలు చేసుకునేందుకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అయితే ఇందుకు తగ్గట్లుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాట్లు లేకపోవడంతో నిండు చూలాలు నొప్పులు భరించలేక కష్టాలు పడుతున్నారు. మంగళవారం ఉదయమే నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 60 మంది గర్భిణులు ప్రసవం కోసం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలైనా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు.



తమకు కాన్పులు చేయాలంటూ అక్కడి సిబ్బంది కాళ్లావేళ్లా పడ్డారు. గైనకాలజిస్ట్‌లు విధులకు హాజరుకావడం లేదని వారు సెలవులో ఉన్నారని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో గర్భిణి మహిళలు, వారి బంధువులు నిరాశ చెందారు. ప్రభుత్వం ఓ పక్క ఆస్పత్రిలో ప్రసవాలు చేసుకోండంటూ ప్రచారం చేస్తుండగా.. మీరేమో ఇలా చెబుతున్నారంటూ సిబ్బందిపై మండిపడ్డారు. తమకేమీ తెలియదని అక్కడి సిబ్బంది చేతులెత్తేయడంతో ప్రసవం కోసం వచ్చిన గర్భిణులతో బంధువులు ఆస్పత్రి ముందు మహబూబ్‌నగర్‌ – శ్రీశైలం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఇంత జరుగుతున్నా పరిస్థితిని సమీక్షించేందుకు డీఎంఅండ్‌హెచ్‌ఓ గానీ, జిల్లా ఉన్నతాధికారులుగానీ అక్కడికి రాకపోవడంతో చివరికి పోలీసులు కలుగజేసుకుని వారికి నచ్చజెప్పి పంపారు. చాలామంది మహిళలు నెలలునిండి నడవలేని స్థితిలో ఆస్పత్రికి రాగా.. వారికి కనీస వైద్యం అందించేందుకు నిపుణులైన వైద్యులు లేకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top